Pakistan: వన్డే ప్రపంచ కప్‌ వేదికలు మార్చాలనడం మూర్ఖత్వమే: పాక్‌ మాజీ క్రికెటర్

వన్డే ప్రపంచ కప్‌లో తాము ఆడే మ్యాచ్‌లకు సంబంధించి పలు వేదికలు మార్చాలని పాకిస్థాన్‌ చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడం సరైనదేనని పాక్‌ మాజీ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్ (Kamran Akmal) అభిప్రాయపడ్డాడు.

Published : 29 Jun 2023 01:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌లో తాము ఆడే మ్యాచ్‌లకు సంబంధించి పలు వేదికలు మార్చాలని పాకిస్థాన్‌ చేసిన అభ్యర్థనను ఐసీసీ (ICC) తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే, వేదికలు మార్చాలని కోరడంపై ఆ దేశ మాజీ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్ (Kamran Akmal) మండిపడ్డాడు. ఇలా కోరడం మూర్ఖత్వమే అవుతుందని, పాక్‌ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడం సరైందేనని అభిప్రాయపడ్డాడు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌ జరిగే చెన్నై, ఆస్ట్రేలియాతో తలపడాల్సిన బెంగళూరు వేదికలను మార్చాలని ఐసీసీని పాక్‌ కోరింది. అహ్మదాబాద్‌లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు కూడా పాక్‌ సుముఖంగా లేదు. పాకిస్థాన్‌ అభ్యర్థనను బీసీసీఐ, ఐసీసీ పట్టించుకోకుండా ఆ వేదికల్లోనే మ్యాచ్‌లను నిర్వహించేలా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. 

‘‘గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌తో జరిగే తమ మ్యాచ్‌ల వేదికలను మార్చాలని పాకిస్థాన్ అభ్యర్థించింది. అహ్మదాబాద్‌లో భారత్‌తో తలపడేందుకు ఇష్టపడటం లేదు. అయితే, పాక్‌ అభ్యర్థనను తిరస్కరించి ఐసీసీ మంచి పని చేసింది. ఇది ఐసీసీ ఈవెంట్‌. కాబట్టి.. మ్యాచ్‌లు ఎక్కడ నిర్వహించాలో ఐసీసీనే నిర్ణయించనివ్వండి. పాక్‌ కోరినట్లు వేదికలను మార్చడానికి ఐసీసీ అంగీకరించినట్లయితే ఇతర బోర్డులు కూడా తమ మ్యాచ్‌లు వేదికలు మార్చాలని కోరేవి. వేదికలను మార్చాలనడం మూర్ఖత్వమే’’ అని కమ్రాన్‌ అక్మల్‌ అన్నాడు.  

ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. భారత్‌లో వన్డే ప్రపంచ కప్‌ పోటీల్లో పాల్గొనడంపై ప్రభుత్వం నుంచి ఇంకా క్లియరెన్స్‌ రాలేదని అందులో పేర్కొంది. పీసీబీ చేసిన ప్రకటనపై ఐసీసీ స్పందించింది. ప్రపంచ కప్‌లో పాల్గొంటామని భాగస్వామ్య ఒప్పందంలో పాక్‌ ఇప్పటికే సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. భారత్‌లో జరిగే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ పాల్గొంటుందనే నమ్మకంతో ఉన్నామని ఐసీసీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని