T20 League : భారత టీ20 లీగ్‌ ప్రభావమే అందుక్కారణం..: గ్రేమ్‌ స్మిత్‌

2005లో తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో టీ20 క్రికెట్‌ పరిచయమైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. అప్పటి వరకు ...

Published : 28 Jul 2022 02:09 IST

ఇంటర్నెట్ డెస్క్: 2005లో తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో టీ20 క్రికెట్‌ పరిచయమైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. అప్పటి వరకు ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లు, 50 ఓవర్లపాటు జరిగే వన్డే మ్యాచ్‌లను చూసిన ప్రేక్షకులకు టీ20 మ్యాచ్‌లు ఎక్కేందుకు కాస్త సమయం పట్టిందనే చెప్పాలి. ఎప్పుడైతే 2007లో ధోనీ నాయకత్వంలోని టీమ్‌ఇండియా పొట్టి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోవడంతో భారత్‌లోనూ ఆసక్తి పెరిగింది. అప్పటి వరకు భారత్‌ ఆడిన టీ20 మ్యాచ్‌ ఒకే ఒకటి. అదీనూ దక్షిణాఫ్రికాతో జోహెన్స్‌బర్గ్‌ వేదికగా తలపడిన భారత్‌ విజయం సాధించింది. 2007 వన్డే ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్న టీమ్‌ఇండియా టీ20 వరల్డ్‌ కప్‌ను సాధించి అబ్బురపరిచింది. ఆ తర్వాత 2008లో భారత క్రికెట్‌ లీగ్‌ రాకతో.. పొట్టిఫార్మాట్‌ దశ మారిపోయింది. వీరబాదుడు క్రికెట్ అభిమానులకు కిక్‌ ఎక్కించేలా చేసింది. ఇక అప్పటి నుంచి టీ20 క్రికెట్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

ఇలాంటి టీ20 లీగ్‌లను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ క్రికెట్‌ బోర్డులు లాభాలను ఆర్జిస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు కూడా t20 ఛాలెంజ్‌ పేరిట లీగ్‌ను నిర్వహించనుంది. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్‌ స్మిత్‌ టోర్నమెంట్ అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో భారత టీ20 లీగ్‌ వల్లే పొట్టి ఫార్మాట్‌కు విశేష ప్రజాదరణ దక్కిందని స్మిత్ పేర్కొన్నాడు. టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 2006లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ను మరోసారి వీడియోలో వీక్షించాడట. ‘‘భారత్‌తో ఆడిన తొలి టీ20 మ్యాచ్‌ నాకు ఇంకా గుర్తుంది. దినేశ్‌ కార్తిక్‌ అద్భుతంగా ఆడి టీమ్‌ఇండియాను గెలిపించాడు. మాకు అదే మొదటి టీ20 మ్యాచ్‌. ఆరంభంలో మా జట్టులోని టాప్‌ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చేవాళ్లం. అయితే కాలం గడిచేకొద్దీ ప్రేక్షకాదరణ పెరిగింది. క్రికెట్ అభిమానులు ఈ ఫార్మాట్‌ను ఇష్టపడుతున్నారని గ్రహించాం. దాని కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒత్తిడి లేకుండా ఆడేందుకు ఇదొక అవకాశంగా భావించాం. 2006లో తొలిసారి టీ20 మ్యాచ్‌ ఆడేటప్పుడు ప్రస్తుత స్థాయికి చేరుకుంటుందని అసలు ఊహించగలమా..? నాకైతే అనిపించలేదు. కానీ  భారత టీ20 లీగ్‌ రాకతో పొట్టి ఫార్మాట్‌ దూసుకుపోయింది. అమెరికా వంటి కొత్త ప్రాంతాలకూ విస్తరించింది’’ అని స్మిత్‌ వివరించాడు. ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు వీరేంద్ర సెహ్వాగ్‌ (భారత్), గ్రేమ్‌ స్మిత్‌ (దక్షిణాఫ్రికా) సారథులుగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని