Chris Gayle: టీ20ల్లో 14,000 పరుగులు

విండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో దంచికొట్టాడు. తనదైన శైలిలో సిక్సర్లు బాదేసి ‘యూనివర్స్‌ బాస్‌’ను గౌరవించాలని సూచించాడు....

Published : 13 Jul 2021 10:36 IST

ఆసీస్‌పై 38 బంతుల్లో 67 కొట్టిన గేల్‌

సెయింట్‌ లూయిస్‌: విండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో దంచికొట్టాడు. తనదైన శైలిలో సిక్సర్లు బాదేసి ‘యూనివర్స్‌ బాస్‌’ను గౌరవించాలని సూచించాడు.

సెయింట్‌ లూయిస్‌ వేదికగా జరిగిన మ్యాచులో మొదట ఆసీస్‌ బ్యాటింగ్‌ చేసింది. 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 141 పరుగులే చేసింది. ఆరోన్‌ ఫించ్‌ (30), హెన్రిక్స్‌ (33) టాప్‌ స్కోరర్లు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో క్రిస్‌గేల్‌ (67; 38 బంతుల్లో 4×4, 7×6) దుమ్మురేపాడు. ఓపెనర్‌ ఆండ్రూ ఫ్లెచర్‌ (4) ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన గేల్‌.. ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. మునుపటి శైలిలో భారీ సిక్సర్లు దంచాడు. ఏడు సిక్సర్లు కొట్టిన అతడు టీ20ల్లో  14వేల పరుగుల మైలురాయి అధిగమించాడు. జట్టు స్కోరు 104 వద్ద అతడు ఔటయ్యాక నికోలస్‌ పూరన్‌ (32; 27 బంతుల్లో 4×4 1×6) పని పూర్తి చేశాడు. మరో 31 బంతులు మిగిలుండగానే విజయం అందించాడు.

ఎంత గొప్ప క్రికెటరైనా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయని క్రిస్‌గేల్‌ అన్నాడు. ఎవరో ఒకరు మాట్లాడాల్సి ఉంటుందని తెలిపాడు. డ్వేన్‌ బ్రావో, కీరన్‌ పొలార్డ్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు. తన మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డును జట్టుకు అంకితం చేశాడు. అభిమానులు గణాంకాలను అతిగా చూడొద్దని, కేవలం యూనివర్స్‌ బాస్‌ను గౌరవిస్తే చాలని సూచించాడు. 42 ఏళ్లు వచ్చినా క్రిస్‌గేల్‌ ఆడుతున్నాడంటే సంతోషమే కదా అన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని