సంక్షిప్త వార్తలు (8)

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రికెట్‌ లీగులు వస్తున్నప్పటికీ.. ఆర్థికంగా బలంగా ఉన్న లీగులు కొన్ని మాత్రమే దీర్ఘకాలంలో మనగలుగుతాయని మాజీ కెప్టెన్‌ గంగూలీ అన్నాడు.

Updated : 07 Feb 2023 04:52 IST

మిగిలేది కొన్ని లీగ్‌లే: గంగూలీ

కోల్‌కతా: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రికెట్‌ లీగులు వస్తున్నప్పటికీ.. ఆర్థికంగా బలంగా ఉన్న లీగులు కొన్ని మాత్రమే దీర్ఘకాలంలో మనగలుగుతాయని మాజీ కెప్టెన్‌ గంగూలీ అన్నాడు. ‘‘ప్రపంచవ్యాప్తంగా వస్తున్న లీగ్‌ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఐపీఎల్‌నే తీసుకుంటే.. దానికో భిన్నమైన వ్యవస్థ ఉంది. అది భిన్నమైన లీగ్‌. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్‌కి మంచి ఆదరణే ఉంది. అలాగే ఇంగ్లాండ్‌లో హండ్రెడ్స్‌, దక్షిణాఫ్రికాలో ఎస్‌ఏ లీగ్‌లు బాగానే ఉన్నాయి. ఎస్‌ఏ లీగ్‌ను మూడు వారాలుగా చూస్తున్నా. ఆయా దేశాల్లో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉండడం ఈ లీగుల్లో ఉమ్మడి అంశం. ముందు ముందు నాలుగైదేళ్లలో కొన్ని లీగ్‌లు మాత్రమే నిలబడతాయి. ఇప్పుడైతే లీగ్‌లు కొత్త. అందరూ అందులో ఆడాలనుకుంటారు. కానీ చివరికి లీగ్‌లలాగే దేశం కూడా ముఖ్యమైందని అందరికీ అర్థమవుతుంది. మంచి వ్యవస్థ ఉన్న లీగ్‌లే మిగులుతాయి’’ అని గంగూలీ అన్నాడు.


ఆసియా అథ్లెటిక్స్‌కు జ్యోతి

దిల్లీ: తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజి ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైంది. ఫిబ్రవరి 10న కజకిస్థాన్‌లోని అస్తానాలో ఆరంభమయ్యే ఈ టోర్నీలో జ్యోతి.. మహిళల 60 మీటర్ల పరుగు, 60 మీటర్ల హర్డిల్స్‌ విభాగాల్లో పోటీపడనుంది. స్వప్న బర్మన్‌ (పెంటాథ్లాన్‌) తజిందర్‌పాల్‌ సింగ్‌ (షాట్‌పుట్‌) జెస్విన్‌ అల్డ్రిన్‌, మహ్మద్‌ అనీస్‌ (లాంగ్‌జంప్‌) లాంటి స్టార్లు ఈ టోర్నీ బరిలో ఉన్నారు.


క్రీడలకు రూ.134.80 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఈ సారి క్రీడా రంగానికి కేటాయింపులు పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రీడలకు రూ.134.80 కోట్లు కేటాయించారు. 2022-23 (రూ.81.01 కోట్లు)తో పోలిస్తే ఈ సారి రూ.53.79 కోట్లు పెంచారు. బడ్జెట్‌లో తొలిసారిగా తెలంగాణ క్రీడా ప్రాంగణాల కోసం రూ.45 కోట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ క్రీడా ప్రాంగణాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోన్న సంగతి తెలిసిందే. క్రీడా సంఘాల గ్రాంట్లు, క్రీడాకారులకు నగదు ప్రోత్సాహాకాలు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌)కు నిధులు పెరగగా.. తెలంగాణ ప్రాంతీయ క్రీడా పాఠశాలలు, వరంగల్‌ క్రీడా వసతి గృహానికి తగ్గాయి. స్టేడియాల నిర్మాణాలకు, క్రీడా వసతుల ఆధునికీకరణకు రూ.30 కోట్లు ఇచ్చారు. క్రీడా సంఘాల గ్రాంట్లు, క్రీడాకారుల నగదు ప్రోత్సాహకాలకు రూ.15 కోట్లు, శాట్స్‌కు రూ.20.74 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ క్రీడా పాఠశాలలు, వరంగల్‌ క్రీడా వసతి గృహానికి రూ.16.53 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన క్రీడా పాఠశాలకు రూ.7.53 కోట్ల చొప్పున కేటాయించారు.


గురునాయుడికి పసిడి

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్‌.గురునాయుడు పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. బాలుర 55 కిలోల విభాగంలో బరిలోకి దిగిన గురునాయుడు స్నాచ్‌లో 103 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 124 కేజీలు ఎత్తాడు. మొత్తంగా 227 కిలోలతో మొదటి స్థానంలో నిలిచాడు.


మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్‌

దిల్లీ: మొట్టమొదటి మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మార్చి 4 నుంచి 26 వరకు ముంబయిలో జరగనుంది. ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌ ఈ విషయం చెప్పాడు. బ్రబౌర్న్‌ స్టేడియం, డీవీ పాటిల్‌ స్టేడియం మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తాయి.ఈ లీగ్‌ కోసం దాదాపు 1500 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తుది జాబితాను ఈ వారం విడుదల చేసే అవకాశముంది. ఈ నెల 13న క్రికెటర్ల వేలం ఉంటుంది.


అశ్విన్‌ ఒక తుపాకీ: ఖవాజా

బెంగళూరు: రవిచంద్రన్‌ అశ్విన్‌ నేతృత్వంలోని భారత స్పిన్‌ బృందాన్ని ఎదుర్కోవడమే రాబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో అతి పెద్ద సవాలని ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా అభిప్రాయపడ్డాడు. చక్కటి ఫామ్‌లో ఉన్న ఖవాజా టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాకు కీలకం అవుతాడని భావిస్తున్న నేపథ్యంలో అతను స్పందిస్తూ.. ‘‘భారత్‌లో ఆడడం భిన్న అనుభవం. గత పదేళ్లలో మా జట్టు భిన్న రకాల పిచ్‌లపై ఎలా ఆడాలో అనుభవం సాధించింది. అయినా సరే.. భారత్‌లో ఆడడం కష్టమే. అశ్విన్‌ ఒక తుపాకీ లాంటి వాడు. అతడిలో గొప్ప నైపుణ్యం ఉంది. బంతులకు కొంచెం వైవిధ్యం జోడించి తికమక పెడతాడు. భారత స్పిన్‌ దాడిని ఎదుర్కోవడం మాకొక మంచి సవాలు. ఇక్కడి పిచ్‌లపై తొలి రోజైనా, నాలుగో రోజైనా బంతి తిరుగుతుంది. అశ్విన్‌ను నేనెలా ఎదుర్కొంటాను, పరుగులు చేస్తానన్నది కీలకం. అతను ప్రతి ఓవర్లో ఒకేలా ఉండడు. అతణ్ని ఎదుర్కోవడానికి మనం చాలా కష్టపడాలి’’ అని చెప్పాడు.


అశ్విన్‌తో జాగ్రత్త: ఇయాన్‌

నాగ్‌పుర్‌: ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రూపంలో ప్రమాదం పొంచి ఉందని, ఆస్ట్రేలియా బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాలని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ హెచ్చరించాడు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9న నాలుగు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇయాన్‌ మాట్లాడుతూ.. ‘‘అశ్విన్‌ తెలివైన క్రికెటర్‌. అందుకే అతడితో ఎప్పుడూ సమస్యే. తాను కోరుకున్నట్లుగానే అశ్విన్‌ను బౌలింగ్‌ చేయనిస్తే ఆసీస్‌ ప్రమాదంలో పడినట్లే. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేటప్పుడు కంగారూ బ్యాటర్లు చురుగ్గా ఉండాలి. సాహసాలకు పోకుండా సింగిల్స్‌ తీస్తూ స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తే..అతడు వ్యూహాన్ని మార్చుకోక తప్పదు. ఇక రిషబ్‌ లేకపోవడం టీమ్‌ఇండియాకు పెద్ద లోటు. ఆస్ట్రేలియాకు ఇది ఊరటనిచ్చే అంశం’’ అని అన్నాడు. లైయాన్‌ ఆఫ్‌స్టంప్‌కు ఆవల బంతి ఎక్కువ స్పిన్‌ అవుతూ బ్యాటర్లు అందుకోలేని విధంగా బంతులేయాలని సూచించాడు. ‘‘లైయాన్‌ భారత బ్యాటర్లకు అందని కోణంలో ఆఫ్‌సైడ్‌ బంతులు విసరాలి. ఇలా వేస్తూ ఒక్కసారిగా వికెట్ల మీదకు బంతిని తిప్పితే బ్యాటర్‌ బౌల్డ్‌, బ్యాట్‌ అండ్‌ ప్యాడ్‌ లేదా ఎల్బీ అయ్యే అవకాశాలు ఉంటాయి’’ అని చెప్పాడు.


భారత్‌ను తొలగించండి: మియాందాద్‌

కరాచి: ఆసియా కప్‌ వేదిక వ్యవహారంలో భారత్‌ నిర్ణయాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్‌ తప్పుబట్టాడు. భారత్‌ ఏమైపోయినా తమకు అనవసరమని తెలిపాడు. ఆసియా కప్‌ను పీసీబీ పాక్‌లో నిర్వహించాలని భావిస్తుండగా.. ఆ దేశానికి తమ ఆటగాళ్లు రారంటూ బీసీసీఐ కుండబద్దలు కొట్టింది. దీంతో యూఏఈకి వేదికను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘‘నేనెప్పుడూ చెప్పేది ఒక్కటే.. భారత్‌ ఏమైపోయినా మేం పట్టించుకోం. మా క్రికెట్‌ మాకొస్తుంది. ఇలాంటి వాటిని నియంత్రించడం ఐసీసీ విధి. లేకపోతే పాలక మండలి ఉండటం వల్ల ప్రయోజనం లేదు. ప్రతి దేశానికి ఐసీసీ ఒకే నిబంధన పాటించాలి. ఎంతటి బలమైన జట్లైనా పర్యటనలకు రాకపోతే తొలగించాల్సిందే’’ అని మియాందాద్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని