ODI World Cup: ప్రపంచకప్‌ సన్నాహానికి దెబ్బ

వన్డే ప్రపంచకప్‌ అక్టోబరు-నవంబరులో జరగనుంది. మరీ ఎక్కువ సమయమేమీ లేదు. జట్లన్నీ ఇప్పటికీ 50 ఓవర్ల ఫార్మాట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టి సంసిద్ధమవుతున్నాయి.

Updated : 16 Mar 2023 08:38 IST

వన్డే ప్రపంచకప్‌ దగ్గరపడుతోంది. ఇక నుంచి ఆటగాళ్లు, అభిమానుల దృష్టంతా అటే. పైగా టీమ్‌ఇండియా సొంతగడ్డపై ఆడుతోంది. చివరిసారి (2011) స్వదేశంలో ఆడినప్పుడు ధోని నేతృత్వంలోనే కప్పును అందుకుంది. ఈ నేపథ్యంలో భారీ అంచనాలే ఉన్నాయ్‌! కానీ పరిస్థితులే అంత అనుకూలంగా లేవు. గాయాలు, ఫిట్‌నెస్‌ లేమి భారత జట్టు సన్నాహాలకు అడ్డంకిగా మారాయి.

ముంబయి: వన్డే ప్రపంచకప్‌ అక్టోబరు-నవంబరులో జరగనుంది. మరీ ఎక్కువ సమయమేమీ లేదు. జట్లన్నీ ఇప్పటికీ 50 ఓవర్ల ఫార్మాట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టి సంసిద్ధమవుతున్నాయి. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో రోహిత్‌సేన వన్డే సిరీస్‌ ఆడబోతోంది. కానీ ఆటగాళ్లకు వరుస గాయాలు భారత జట్టును కలవర పెడుతున్నాయి. తాజాగా శ్రేయస్‌ అయ్యర్‌ వెన్ను సమస్యతో ఆసీస్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌లోనూ కొన్ని మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశముంది. శ్రేయస్‌ ఫిట్‌గా ఉన్నట్లు ఎన్‌సీఏ ప్రకటించిన కొన్ని రోజులకే అతడి పరిస్థితి మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల గాయాల నిర్వహణ తీరుపైనే ప్రశ్నలు   తలెత్తుతున్నాయి. గాయాల బారిన పడ్డ ఆటగాళ్ల జాబితా చాలా పెద్దదే. వెన్ను గాయంతో ఇప్పటికే చాలా నెలలు ఆటకు దూరమైన ప్రధాన పేసర్‌ బుమ్రా ఇటీవలే శస్త్రచిత్స చేయించుకున్నాడు. ఇప్పట్లో జట్టులోకి వచ్చే అవకాశం లేదు. అసలు ప్రపంచకప్‌లో ఆడడం కూడా అనుమానంగానే ఉంది. జడేజా సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేశాడు. స్పీడ్‌స్టర్‌ దీపక్‌ చాహర్‌ కూడా పదే పదే గాయపడుతుండడం జట్టు మేనేజ్‌మెంట్‌కు అసహనాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గాయాల నిర్వహణపై ఎన్‌సీఏలోని స్పోర్ట్స్‌ సైన్స్‌ విభాగం నుంచి బీసీసీఐ వివరణ కోరినట్లు తెలుస్తోంది. నిరుడు టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆటగాళ్లను రొటేట్‌ చేసినందుకు విమర్శలు రావడంతో..  వన్డే ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో 18-20 మంది ఆటగాళ్లతోనే ఆడతామని సెలక్షన్‌ కమిటీ, భారత జట్టు మేనేజ్‌మెంట్‌ జనవరిలో చెప్పాయి. కానీ ముఖ్య ఆటగాళ్ల గాయాల నేపథ్యంలో ప్రధాన బృందంతో ఆడడం ఎలా సాధ్యమన్నది ప్రశ్న. ‘‘ఆటగాళ్లపై ఎక్కువ పనిభారం పడనివ్వట్లేదు. అయినా ప్రధాన ఆటగాళ్లు పదే పదే గాయపడుతున్నారు. దీని గురించి బీసీసీఐ.. ఎన్‌సీఏ అధికారులతో మాట్లాడింది. టీమ్‌ మేనేజ్‌మెంట్‌, సెలక్షన్‌ కమిటీ ఇప్పుడు బ్యాకప్‌ ఆటగాళ్లను గుర్తించడంపై దృష్టి పెట్టాయి’’ అని ఓ బీసీసీఐ అధికారి అన్నాడు. ఏడాదికి 30 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్న భారత క్రికెటర్లు చాలా తక్కువే. అయినా గాయకుల జాబితా పెద్దదిగా ఉండడం బోర్డుకు అంతుపట్టట్లేదు. ప్రసిద్ధ్‌ కృష్ణను ప్రపంచకప్‌కు సిద్ధం చేయాలని మేనేజ్‌మెంట్‌ భావించింది. కానీ అతడు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేడు. వెన్నుకు శస్త్రకిత్స చేయించుకున్న ప్రసిద్ధ్‌ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. నిరుడు ఆగస్టు (జింబాబ్వేతో వన్డే) తర్వాత అతడు మళ్లీ ఆడలేదు. రెండో ప్రాధాన్య పేసర్ల విషయంలో కూడా జట్టు మేనేజ్‌మెంట్‌కు స్పష్టత లేదు. ఆసియాకప్‌ తర్వాత జట్టుకు దూరమైన అవేష్‌ ఖాన్‌ కూడా రంజీ ట్రోఫీ సందర్భంగా గాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడం టీమ్‌ఇండియాకు పెను సవాలే. ‘‘ఆటగాళ్లకు అవుతున్నవి తీవ్రమైన గాయాలే. కోలుకుని, పూర్తి  ఫిట్‌నెస్‌ను అందుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒక  స్థిరమైన భారత జట్టును సిద్ధం చేయడం పెద్ద సవాలే’’ అని  బోర్డు అధికారి అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని