సంక్షిప్త వార్తలు(5)

మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో వరుసగా అయిదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ముంబయి ఇండియన్స్‌ జోరుకు బ్రేక్‌! ఆ జట్టుకు తొలిసారి ఓటమి రుచి చూపించింది యూపీ వారియర్స్‌! శనివారం ఆఖరి ఓవర్‌ వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

Published : 19 Mar 2023 02:13 IST

ముంబయికి ఝలక్‌

ముంబయి: మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో వరుసగా అయిదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ముంబయి ఇండియన్స్‌ జోరుకు బ్రేక్‌! ఆ జట్టుకు తొలిసారి ఓటమి రుచి చూపించింది యూపీ వారియర్స్‌! శనివారం ఆఖరి ఓవర్‌ వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. సోఫీ ఎకిల్‌స్టోన్‌ (3/15), దీప్తిశర్మ (2/35), రాజేశ్వరి గైక్వాడ్‌ (2/16) విజృంభించడంతో మొదట ముంబయిని 127కే ఆలౌట్‌ చేసిన యూపీ.. 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. హేలీ మాథ్యూస్‌ (35; 30 బంతుల్లో 1×4, 3×6), ఇసీ వాంగ్‌ (32; 19 బంతుల్లో 4×4, 1×6), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (25; 22 బంతుల్లో 3×4) రాణించడంతో కాస్త మెరుగైన స్కోరు సాధించిన ముంబయి తుది వరకు విజయం కోసం పోరాడింది. గ్రేస్‌ హారిస్‌ (39; 28 బంతుల్లో 7×4), తాలియా మెక్‌గ్రాత్‌ (38; 25 బంతుల్లో 6×4, 1×6) ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లారు. వీళ్లిద్దరూ ఔటయ్యాక ఆఖర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నా దీప్తి (13 నాటౌట్‌)తో కలిసి ఎకిల్‌స్టోన్‌ (16 నాటౌట్‌) పని పూర్తి చేసింది. ఈ విజయంతో వారియర్స్‌ (6 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లు) ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.

ముంబయి: 127 (హేలీ మాథ్యూస్‌ 35, ఇసీ వాంగ్‌ 32, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 25; రాజేశ్వరి గైక్వాడ్‌ 2/16, సోఫీ ఎకిల్‌స్టోన్‌ 3/15, దీప్తి 2/35;

యూపీ: (19.3 ఓవర్లలో) 129/5 (తాలియా మెక్‌గ్రాత్‌ 38, గ్రేస్‌ హారిస్‌ 39)


బంగ్లా రికార్డు విజయం

సిల్‌హట్‌: బంగ్లాదేశ్‌ అదరగొట్టింది. శనివారం తొలి వన్డేలో ఐర్లాండ్‌ను 183 పరుగుల తేడాతో చిత్తుచేసింది. వన్డేల్లో పరుగుల పరంగా బంగ్లాకు ఇదే అతి పెద్ద విజయం. మొదట బంగ్లా 50 ఓవర్లలో 8 వికెట్లకు 338 పరుగులు చేసింది. షకిబ్‌ (93), అరంగేట్ర ఆటగాడు తోహిద్‌ (92) మెరిశారు. ఐర్లాండ్‌ బౌలర్లలో గ్రాహమ్‌ (4/60) ఆకట్టుకున్నాడు. ఛేదనలో ఐర్లాండ్‌ 30.5 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో జార్జ్‌ డాక్రెల్‌ (45) టాప్‌స్కోరర్‌. ఎబాదత్‌ (4/42), నసుమ్‌ అహ్మద్‌ (3/43), తస్కిన్‌ (2/15) ప్రత్యర్థి పనిపట్టారు. షకిబ్‌ కూడా ఓ వికెట్‌ పడగొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో 7 వేల పరుగులు చేయడంతో పాటు 300 వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా షకిబ్‌ నిలిచాడు.


జాక్స్‌ స్థానంలో బ్రాస్‌వెల్‌

బెంగళూరు: గాయంతో ఐపీఎల్‌కు దూరమైన బ్యాటర్‌ విల్‌ జాక్స్‌ స్థానంలో మైకేల్‌ బ్రాస్‌వెల్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులోకొచ్చాడు. వేలంలో రూ.3.2 కోట్లు పెట్టి ఆర్సీబీ.. జాక్స్‌ను దక్కించుకుంది. కానీ తాజాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో ఈ ఇంగ్లాండ్‌ ఆటగాడు గాయపడడంతో ఐపీఎల్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటిదాకా ఐపీఎల్‌ ఆడని బ్రాస్‌వెల్‌పై వేలంలో ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. ఐపీఎల్‌ ఆడబోతుండడంతో శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడే జట్టు నుంచి బ్రాస్‌వెల్‌ను న్యూజిలాండ్‌ విడుదల చేసింది. అతడు త్వరలో ఆర్సీబీ సన్నాహక శిబిరంలో చేరనున్నాడు.


సన్నీ మాటే.. శాస్త్రి మాట

దిల్లీ: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కేఎల్‌ రాహుల్‌ను వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ఆడించాలన్న భారత బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ సూచనకు మరో మాజీ ఆటగాడు రవిశాస్త్రి మద్దతు పలికాడు. పంత్‌ స్థానంలో ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ ఆడిన కేఎస్‌ భరత్‌ అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంగ్లాండ్‌లో మంచి రికార్డు కూడా ఉన్న రాహుల్‌ను వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ఎంచుకోవాలని సూచించిన సన్నీతో రవిశాస్త్రి గొంతు కలిపాడు. ‘‘సెలక్టర్లు తన పట్ల ఆసక్తి చూపేలా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో రాహుల్‌ చక్కటి ప్రదర్శన చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేస్తే బ్యాటింగ్‌ బలం పెరుగుతుంది. మిడిలార్డర్లో 5, 6 స్థానాల్లో అతను బ్యాటింగ్‌ చేయొచ్చు. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై స్పిన్నర్లు ఎక్కువ బౌలింగ్‌ చేయరు కాబట్టి ఇబ్బంది ఉండదు’’  అని రవిశాస్త్రి అన్నాడు.


ఆ జెర్సీలకు వీడ్కోలు

బెంగళూరు: ఐపీఎల్‌లో తమ ఫ్రాంఛైజీ తరపున ఆడిన దిగ్గజాలు ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌ గేల్‌ జెర్సీలకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) వీడ్కోలు పలకనుంది. ఈ నెల 26న ఆర్సీబీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఈ ఇద్దరికి చోటు దక్కనుంది. అదే రోజు డివిలియర్స్‌ 17వ, గేల్‌ 333వ నంబరు జెర్సీలకు రిటైర్మెంట్‌ ఇవ్వాలని ఆర్సీబీ నిర్ణయించింది. ఆ జట్టులో ఇకపై ఎవరూ ఈ నంబరు జెర్సీలు వేసుకునే అవకాశం ఉండదు. ‘‘డివిలి యర్స్‌, గేల్‌కు అంకితంగా 17, 333 జెర్సీ నంబర్లకు శాశ్వత వీడ్కోలు పలకనున్నాం. ఈ ఇద్దరు దిగ్గజాలు ఆర్సీబీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకునే రోజు ఇది జరగనుంది’’ అని ఆర్సీబీ ట్వీట్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు