సెమీస్‌లో సింధు

స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ ఏడాది వరుస పరాభవాల నుంచి బయటపడుతూ.. తొలిసారి ఓ టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టింది.

Published : 01 Apr 2023 02:30 IST

స్పెయిన్‌ మాస్టర్స్‌

మాడ్రిడ్‌: స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ ఏడాది వరుస పరాభవాల నుంచి బయటపడుతూ.. తొలిసారి ఓ టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ సింధు 21-14, 21-17 తేడాతో మియా బ్లిచ్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించింది. వరుస వైఫల్యాలతో సతమతమై.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో చోటు కోల్పోయిన సింధు ఈ మ్యాచ్‌లో పోరాట పటిమ ప్రదర్శించింది. మియాతో పోరులో వెనుకబడ్డా తిరిగి పుంజుకుంది. తనదైన శైలిలో స్మాష్‌లు, క్రాస్‌కోర్టు షాట్లతో చెలరేగి వరుస గేమ్‌ల్లో ప్రత్యర్థిని ఓడించింది. తొలి గేమ్‌లో 4-6తో వెనుకబడ్డ సింధు పుంజుకుంది. 6-6తో ప్రత్యర్థిని అందుకుంది. అక్కడి నుంచి ఆధిక్యం చేతులు మారుతూ సాగింది. 15-14తో నిలిచిన సింధు.. వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ ఓ దశలో 6-12తో వెనుకబడ్డ ఆమె పట్టు వదల్లేదు. 16-16తో ప్రత్యర్థి స్కోరును సమం చేయడమే కాకుండా.. అదే జోరు కొనసాగించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ కైవసం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌లో అయిదో సీడ్‌ శ్రీకాంత్‌ 18-21, 15-21తో టాప్‌సీడ్‌ కెంటా నిషిమోటో (జపాన్‌) చేతిలో ఓడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని