చెన్నై 10/14.. పదోసారి ఫైనల్‌కు కింగ్స్‌

స్టేడియం మొత్తం పసుపు మయం. ఎటు చూసినా ధోని నామ జపం. చివరి ఐపీఎల్‌ సీజన్‌ ఆడుతున్నాడనే ఊహాగానాల మధ్య.. చెపాక్‌లో ఆఖరి మ్యాచ్‌లో మహీని చూసేందుకు తరలివచ్చిన అభిమానులకు సీఎస్కే విజయాన్ని బహుమతిగా అందించింది.

Updated : 24 May 2023 06:45 IST

మెరిసిన రుతురాజ్‌, జడేజా

క్వాలిఫయర్‌-1లో గుజరాత్‌ ఓటమి

చెన్నై: స్టేడియం మొత్తం పసుపు మయం. ఎటు చూసినా ధోని నామ జపం. చివరి ఐపీఎల్‌ సీజన్‌ ఆడుతున్నాడనే ఊహాగానాల మధ్య.. చెపాక్‌లో ఆఖరి మ్యాచ్‌లో మహీని చూసేందుకు తరలివచ్చిన అభిమానులకు సీఎస్కే విజయాన్ని బహుమతిగా అందించింది. బ్యాటింగ్‌కు అంత తేలిగ్గా లేని పిచ్‌పై రుతురాజ్‌ రాణించడంతో ప్రత్యర్థికి మంచి లక్ష్యాన్ని నిర్దేశించిన సూపర్‌కింగ్స్‌.. శుభ్‌మన్‌ గిల్‌ భయపెట్టినా జడేజా, తీక్షణ, చాహర్‌ల సూపర్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు షాకిచ్చి.. సగర్వంగా పదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. అయిదో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్‌ చేరేందుకు టైటాన్స్‌కు మరో అవకాశముంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్‌-2లో ఆ జట్టు తలపడుతుంది.

సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌ అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ధోని జట్టు క్వాలిఫయర్‌-1లో 15 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి ఐపీఎల్‌-16 ఫైనల్‌కు దూసుకెళ్లింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (60; 44 బంతుల్లో 7×4, 1×6), కాన్వే (40; 34 బంతుల్లో 4×4) రాణించడంతో మొదట చెన్నై 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. షమి (2/28), మోహిత్‌ శర్మ (2/31), నూర్‌ అహ్మద్‌ (1/29) సూపర్‌కింగ్స్‌కు కళ్లెం వేశారు. జడేజా (2/18), తీక్షణ (2/28), దీపక్‌ చాహర్‌ (2/29) సూపర్‌గా బౌలింగ్‌ చేయడంతో ఛేదనలో టైటాన్స్‌ 20 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌటైంది. శుభ్‌మన్‌ గిల్‌ (42; 38 బంతుల్లో 4×4, 1×6) టాప్‌ స్కోరర్‌. రషీద్‌ ఖాన్‌ (30; 16 బంతుల్లో 3×4, 2×6) రాణించాడు. పద్నాలుగు ఐపీఎల్‌లలో చెన్నై ఫైనల్‌కు చేరడం ఇది పదోసారి.

టైటాన్స్‌ కష్టంగా..: మందకొడి పిచ్‌పై టైటాన్స్‌కు కూడా పరుగుల కోసం కష్టపడక  తప్పలేదు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఏ దశలోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు పోవడంతో ఆద్యంతమూ వెనుకబడింది. ఆ జట్టు ఆరంభమే బాగాలేదు. 9 ఓవర్లు ముగిసే సరికి 59 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్లో సాహా (12)ను చాహర్‌ ఔట్‌ చేయగా.. హార్దిక్‌ పాండ్య (8)ను తీక్షణ వెనక్కి పంపాడు. కానీ ఫామ్‌ను కొనసాగిస్తూ శుభ్‌మన్‌ గిల్‌ నిలబడ్డాడు. అయితే అతడు కొన్ని చక్కని షాట్లు ఆడినా.. ఎదుర్కొన్న తొలి 32 బంతుల్లో చేసింది 32 పరుగులే. శానక (17) కూడా బ్యాట్‌ ఝుళిపించలేకపోవడంతో టైటాన్స్‌ సాధించాల్సిన రన్‌రేట్‌ క్రమంగా పెరిగింది. ఆపై స్పిన్నర్లు ఆ జట్టును మరింత ఒత్తిడిలోకి నెట్టారు. శానకను తీక్షణ ఔట్‌ చేయగా.. ప్రమాదకర మిల్లర్‌ (4)ను జడేజా బౌల్డ్‌ చేశాడు. పరిస్థితి క్లిష్టంగా మారినా గిల్‌ క్రీజులో ఉండడంతో టైటాన్స్‌లో ఓ ధీమా. కానీ 14వ ఓవర్లో అతణ్ని ఔట్‌ చేయడం ద్వారా ఆ జట్టుకు దీపక్‌ చాహర్‌ షాకిచ్చాడు. మ్యాచ్‌పై చెన్నై మరింతగా పట్టుబిగించిన సందర్భమది. భారీ షాట్లు కొట్టడం కష్టంగా ఉన్న నేపథ్యంలో అయిదు వికెట్లు కోల్పోయిన గుజరాత్‌కు ఛేదన మరింత కష్టంగా మారింది. చివరి 6 ఓవర్లలో 78 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఆపై తెవాతియాను తీక్షణ బౌల్డ్‌ చేయడంతో చెన్నై అవకాశాలు మరింత మెరుగయ్యాయి. కానీ కథ అక్కడితో ముగియలేదు. రషీద్‌ ఖాన్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో టైటాన్స్‌ ఆశలు రేపాడు. పతిరన బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌ బాదిన అతడు.. తుషార్‌ బౌలింగ్‌లోనూ సిక్స్‌, ఫోర్‌ దంచేశాడు. విజయ్‌ శంకర్‌ (14) కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో 16, 17 ఓవర్లలో కలిపి టైటాన్స్‌.. 32 పరుగులు పిండుకుంది. ఆఖరి మూడు ఓవర్లలో ఆ జట్టుకు 39 పరుగులు అవసరమయ్యాయి. అయితే 18వ ఓవర్లో చక్కగా బౌలింగ్‌ చేసిన పతిరన 4 పరుగులే ఇచ్చి విజయ్‌ శంకర్‌ను ఔట్‌ చేశాడు. నల్కాండె రనౌటయ్యాడు కూడా. అయినా రషీద్‌ క్రీజులో ఉండడంతో చెన్నైకి ముప్పు తొలగలేదు. తుషార్‌ (19వ ఓవర్‌) తొలి బంతికి రషీద్‌ ఫోర్‌ కొట్టినా.. మూడో బంతికి ఔట్‌ కావడంతో చెన్నై ఊపిరిపీల్చుకుంది. అతడు 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. చివరి ఓవర్లో టైటాన్స్‌కు 27 పరుగులు అవసరమైన స్థితిలో చెన్నై విజయం ఖాయమైంది.

గైక్వాడ్‌ నిలిచాడు: అంతకుముందు బ్యాటింగ్‌కు అంత సులభంగా లేని పిచ్‌పై చెన్నైని టైటాన్స్‌ కట్టడి చేసింది. క్రమశిక్షణతో బౌలింగ్‌ చేసిన ఆ జట్టు సూపర్‌కింగ్స్‌ను స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపించనివ్వలేదు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై స్లో పిచ్‌పై పది ఓవర్లు ముగిసే సరికి 85/0తో నిలిచింది. ఓపెనర్లు రుతురాజ్‌, కాన్వే మరోసారి శుభారంభాన్నిచ్చినా.. ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కోరుకున్నంత దూకుడు లేదు. రుతురాజ్‌ కాస్త వేగంగా ఆడినా.. కాన్వే మాత్రం జోరందుకోలేకపోయాడు. బ్యాట్‌ ఝుళిపించలేకపోయాడు. చెన్నై నిజానికి రెండో ఓవర్లోనే వికెట్‌ కోల్పోవాల్సింది. దర్శన్‌ నల్కాండె బౌలింగ్‌లో రుతురాజ్‌.. గిల్‌కు చిక్కాడు. కానీ అది నోబాల్‌ కావడంతో బతికిపోయాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రుతురాజ్‌ చక్కని బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మరోవైపు కాన్వే లయను దొరకబుచ్చుకోలేకపోతున్న నేపథ్యంలో జట్టుకు రుతురాజ్‌ విలువైన పరుగులు అందించాడు. నల్కాండె బౌలింగ్‌లో వరుసగా 6, 4 కొట్టిన అతడు ఆ తర్వాత కూడా వీలైనప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. పది ఓవర్లు ముగిసే సరికి రుతురాజ్‌ 42 బంతుల్లో 59 పరుగులు చేయగా.. కాన్వే 19 బంతుల్లో 24 పరుగులే సాధించాడు. చెన్నై గేర్‌ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ సరైన సమయంలో ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. మోహిత్‌ బంతిని పుల్‌ చేయబోయిన రుతురాజ్‌ లాంగాన్‌లో మిల్లర్‌కు చిక్కాడు. స్పిన్నర్‌ నూర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయిన దూబె (1) బౌల్డయ్యాడు. 11 నుంచి 14 ఓవర్ల మధ్య చెన్నైకి 22 పరుగులు మాత్రమే వచ్చాయి. 15వ ఓవర్లో 18 పరుగులొచ్చినా.. రహానె (17) ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే కాన్వే కూడా వెనుదిరిగాడు. ఆఖర్లోనూ చెన్నై ఇన్నింగ్స్‌లో పెద్ద మెరుపులేమీ లేవు కానీ.. రాయుడు (17), జడేజా (22), మొయిన్‌ అలీ (9 నాటౌట్‌) తమ వంతుగా కొన్ని విలువైన పరుగులు చేయడంతో ఆ జట్టు చివరి అయిదు ఓవర్లలో 47 పరుగులు రాబట్టి కాస్త సంతృప్తిగానే ఇన్నింగ్స్‌ను ముగించింది. బహుశా చెన్నైలో చివరి మ్యాచ్‌ ఆడిన ధోని కేవలం ఒక పరుగే చేసి ఔట్‌ కావడం అభిమానులను నిరాశపరిచింది.

చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ 60; కాన్వే (సి) రషీద్‌ (బి) షమి 40; దూబె (బి) నూర్‌ 1; రహానె (సి) గిల్‌ (బి) నల్కాండె 17; రాయుడు (సి) శానక (బి) రషీద్‌ 17; జడేజా (బి) షమి 22; ధోని (సి) హార్దిక్‌ (బి) మోహిత్‌ 1; మొయిన్‌ నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 172; వికెట్ల పతనం: 1-87, 2-90, 3-121, 4-125, 5-148, 6-155, 7-172; బౌలింగ్‌: షమి 4-0-28-2; దర్శన్‌ 4-0-44-1; రషీద్‌ 4-0-37-1; నూర్‌ 4-0-29-1; మోహిత్‌ 4-0-31-2

గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) పతిరన (బి) దీపక్‌ 12; శుభ్‌మన్‌ (సి) కాన్వే (బి) దీపక్‌ చాహర్‌  42; హార్దిక్‌ (సి) జడేజా (బి) తీక్షణ 8; శానక (సి) తీక్షణ (బి) జËడేజా 17; మిల్లర్‌ (బి) జడేజా 4; శంకర్‌ (సి) రుతురాజ్‌ (బి) పతిరన 14; తెవాతియా (బి) తీక్షణ 3; రషీద్‌ (సి) కాన్వే (బి) దేశ్‌పాండే 30; నల్కాండె రనౌట్‌ 0; నూర్‌ నాటౌట్‌ 7; షమి (సి) దీపక్‌ (బి) పతిరన 5; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (20 ఓవర్లలో ఆలౌట్‌) 157; వికెట్ల పతనం: 1-22, 2-41, 3-72, 4-88, 5-88, 6-98, 7-136, 8-136, 9-142; బౌలింగ్‌: దీపక్‌ 4-0-29-2; తుషార్‌ 4-0-43-1; తీక్షణ 4-0-28-2; జడేజా 4-0-18-2; పతిరన 4-0-37-2

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని