MI vs GT: చెన్నైని ఢీకొట్టేదెవరో?

గుజరాత్‌ టైటాన్స్‌.. లీగ్‌ దశ చివరి మ్యాచ్‌లో బెంగళూరును ఓడించి ముంబయికి ప్లేఆఫ్స్‌ మార్గం సుగమం చేసిన జట్టు. కానీ ఇప్పుడు అదే ముంబయితో ఐపీఎల్‌- 16 ఫైనల్లో  చోటు కోసం తలపడనుంది.

Updated : 26 May 2023 07:22 IST

ముంబయి × గుజరాత్‌
క్వాలిఫయర్‌-2 నేడే
గెలిచిన జట్టుకు సీఎస్కేతో ఫైనల్‌
రాత్రి 7.30 నుంచి  

గుజరాత్‌ టైటాన్స్‌.. లీగ్‌ దశ చివరి మ్యాచ్‌లో బెంగళూరును ఓడించి ముంబయికి ప్లేఆఫ్స్‌ మార్గం సుగమం చేసిన జట్టు. కానీ ఇప్పుడు అదే ముంబయితో ఐపీఎల్‌- 16 ఫైనల్లో  చోటు కోసం తలపడనుంది. శుక్రవారమే ఈ రెండు జట్ల మధ్య రెండో క్వాలిఫయర్‌. ఎలిమినేటర్‌లో లఖ్‌నవూపై భారీ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ముంబయి ఉండగా.. తొలి క్వాలిఫయర్‌లో చెన్నై చేతిలో ఓడిన గుజరాత్‌ ఈసారి అవకాశాన్ని వదలొద్దనే పట్టుదలతో ఉంది. రెండు బలమైన జట్ల మధ్య హోరాహోరీ సమరం ఖాయమని భావిస్తున్నారు. మరి తుదిపోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఢీ కొట్టేది ఎవరో?

అహ్మదాబాద్‌

ఐపీఎల్‌- 16 ప్లేఆఫ్స్‌ సమరం చెన్నై నుంచి అహ్మదాబాద్‌కు మారింది. శుక్రవారం రెండో క్వాలిఫయర్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో అయిదు సార్లు విజేత ముంబయి ఇండియన్స్‌ పోటీపడనుంది. భిన్న దారుల్లో లీగ్‌ దశ దాటిన ఈ రెండు జట్లకూ.. ప్లేఆఫ్స్‌లోనూ భిన్న ఫలితాలు ఎదరయ్యాయి. లీగ్‌ దశలో 10 విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన టైటాన్స్‌ తొలి క్వాలిఫయర్‌లో చెన్నై చేతిలో ఓడగా.. ఎనిమిది విజయాలతో కష్టపడి ముందంజ వేసిన ముంబయి ఎలిమినేటర్‌లో లఖ్‌నవూపై అద్భుత విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ రెండు జట్లు ఫైనల్లో చోటు కోసం తలపడుతున్నాయి. బలాబలాల పరంగా చూస్తే రెండు జట్లు సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి. మరి ముంబయి ఏడో సారి టైటిల్‌ పోరు చేరుతుందా? లేదా టైటాన్స్‌ వరుసగా రెండో సారి ఆఖరి సమరానికి సై అంటుందా? అన్నది చూడాలి.
ఆ ఇద్దరూ..: వరుసగా రెండు ఓటములతో సీజన్‌ను ఆరంభించి.. తడబాటును దాటి.. ముంబయి ఫైనల్‌కు అడుగు దూరంలో నిలవడం ఆ జట్టు పట్టుదల, పోరాట పటిమకు నిదర్శనం. ప్రస్తుతానికి ఆ జట్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు సంచలన ప్రదర్శనతో చెలరేగుతున్నారు. ఒకరు పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ కాగా.. మరొకరు ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌. మందకొడిగా కనిపించిన చెన్నై పిచ్‌పై లఖ్‌నవూతో పోరులో గ్రీన్‌ బ్యాట్‌తో సత్తాచాటగా.. ఆకాశ్‌ ఏకంగా అయిదు వికెట్లతో విజృంభించాడు. దీంతో 81 పరుగుల తేడాతో భారీ విజయం ముంబయి సొంతమైంది. సన్‌రైజర్స్‌పై శతకంతో అదరగొట్టిన గ్రీన్‌, గత మ్యాచ్‌లోనూ విలువైన పరుగులు సాధించాడు. ఇక సూర్యకుమార్‌ కూడా జోరు మీదున్నాడు. ఆఖర్లో నేహాల్‌ వధెరా కూడా రాణిస్తున్నాడు. కాస్త విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన తిలక్‌ వర్మతో పాటు రోహిత్‌ శర్మ, ఇషాన్‌, టిమ్‌ డేవిడ్‌తో ముంబయి బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. ఈ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కట్టడి చేయడం గుజరాత్‌ బౌలింగ్‌ దళానికి సవాలే. ఏ ముగ్గురు ఆటగాళ్లు పరుగుల వేటలో విజయవంతమైనా టైటాన్స్‌కు ఇబ్బందులు తప్పవు. ఇక ఐపీఎల్‌లో ప్రమాదకర రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో సూర్య ఒక్కసారి కూడా ఔటవలేదు. రషీద్‌పై సూర్య ఆధిపత్యానికి ఇది నిదర్శనం. మరోవైపు ముంబయి బౌలర్లలో యువ సంచలనం ఆకాశ్‌ గురించే చర్చంతా. సన్‌రైజర్స్‌తో పోరులో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు ప్లేఆఫ్స్‌ చేరడంలో కీలక పాత్ర పోషించిన అతను.. లఖ్‌నవూపై 3.3-0-5-5 బౌలింగ్‌ గణాంకాలతో అబ్బురపరిచాడు. జోర్డాన్‌ కూడా ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శనే చేశాడు. వీళ్లతో పాటు వెటరన్‌ స్పిన్నర్‌ పియూష్‌ చావ్లా (15 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు), బెరెన్‌డార్ఫ్‌ (14 వికెట్లు) కూడా సత్తాచాటుతున్నారు. మరోసారి ఈ బౌలింగ్‌ విభాగం రాణిస్తే ముంబయికి తిరుగుండదు. ఇక లఖ్‌నవూపై విజయం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. స్టార్‌ ఆటగాళ్లు దూరమైనా సమష్టి ప్రదర్శనతో సత్తాచాటగలమని ఈ గెలుపుతో ప్రత్యర్థికి ముంబయి హెచ్చరిక జారీచేసింది.

బ్యాటింగ్‌ గాడిన పడితే..: లీగ్‌ దశను గొప్పగా ముగించిన గుజరాత్‌ తొలి క్వాలిఫయర్‌లో కంగుతింది. బ్యాటర్లు విఫలమవడంతో ఆ జట్టు ఓటమి పాలైంది. లోపాలు సరిదిద్దుకుని ఫైనల్‌ చేరడానికి రెండో అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే సంకల్పంతో టైటాన్స్‌ ఉంది. బ్యాటింగ్‌ పరంగా చూస్తే ఆ జట్టు యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌పై అతిగా ఆధారపడినట్లు కనిపిస్తోంది. సంచలన ఫామ్‌లో ఉన్న గిల్‌ ఇప్పటికే రెండు శతకాలు బాదేశాడు. 15 మ్యాచ్‌ల్లో 722 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో డుప్లెసిస్‌ (730) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. కానీ అతను నిలకడగా రాణిస్తున్నా మిగతా బ్యాటర్ల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. గిల్‌ తర్వాత టైటాన్స్‌లో అత్యుత్తమ బ్యాటింగ్‌ ప్రదర్శన విజయ్‌ శంకర్‌ (301)దే. అతని కంటే గిల్‌ 421 పరుగులు ఎక్కువ చేయడం గమనార్హం. దీన్ని బట్టి ఆ జట్టులో మిగతా బ్యాటర్ల ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యతో పాటు మిల్లర్‌, సాహా, తెవాతియా బ్యాట్‌తో మెరిస్తేనే టైటాన్స్‌ గెలిచే అవకాశాలు మెరుగుపడతాయి. బౌలింగ్‌లో పేసర్‌ షమితో పాటు అఫ్గాన్‌ స్పిన్‌ ద్వయం రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌ నిలకడగా రాణిస్తున్నారు. 15 మ్యాచ్‌ల్లో 26 వికెట్లతో షమి, 25 వికెట్లతో రషీద్‌.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముంబయి బ్యాటర్లకు, గుజరాత్‌ బౌలర్లకు మధ్య రసవత్తర పోరు ఖాయం. మరి సొంతగడ్డపై మ్యాచ్‌ ఆడుతుండడాన్ని గుజరాత్‌ ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.

పిచ్‌ ఎలా ఉందంటే..

అహ్మబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. పిచ్‌ బ్యాటింగ్‌కు చక్కగా సహకరించనుంది. అలాగే మంచి పేస్‌, బౌన్స్‌ లభించే పిచ్‌ను రూపొందించినట్లు సమాచారం. టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశముంది. ఛేదనలో మంచు ప్రభావం పెద్దగా ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

తుది జట్లు (అంచనా):

ముంబయి ఇండియన్స్‌: ఇషాన్‌, రోహిత్‌ శర్మ, గ్రీన్‌, సూర్యకుమార్‌, తిలక్‌, టిమ్‌ డేవిడ్‌, షోకీన్‌/నేహాల్‌, జోర్డాన్‌, చావ్లా, బెరెన్‌డార్ఫ్‌, ఆకాశ్‌
గుజరాత్‌ టైటాన్స్‌: శుభ్‌మన్‌, సాహా, హార్దిక్‌, విజయ్‌ శంకర్‌, మిల్లర్‌, సుదర్శన్‌/అభినవ్‌ మనోహర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌, మోహిత్‌ శర్మ, షమి


1-1

ఈ సీజన్‌లో గుజరాత్‌, ముంబయి మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెరొకటి గెలిచాయి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు