ఆసియా కప్‌ ఆర్చరీలో ఆరు రజతాలు

ఆసియా కప్‌ మూడో అంచె ఆర్చరీ పోటీల్లో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ భారత ఆర్చర్లు ఒక్క స్వర్ణం కూడా గెలవలేకపోయారు. కొరియా, చైనా ఆర్చర్ల సవాలును దాటలేక ఆరు ఫైనల్లో ఓటమి పాలయ్యారు.

Updated : 11 Jun 2023 03:28 IST

సింగపూర్‌: ఆసియా కప్‌ మూడో అంచె ఆర్చరీ పోటీల్లో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ భారత ఆర్చర్లు ఒక్క స్వర్ణం కూడా గెలవలేకపోయారు. కొరియా, చైనా ఆర్చర్ల సవాలును దాటలేక ఆరు ఫైనల్లో ఓటమి పాలయ్యారు. దీంతో పోటీలను భారత్‌ ఆరు రజతాలు, ఓ కాంస్యంతో ముగించింది. శనివారం కాంపౌండ్‌ మహిళల టీమ్‌ ఫైనల్లో భారత్‌ 232-234 తేడాతో కొరియా చేతిలో ఓడింది. కాంపౌండ్‌ పురుషుల టీమ్‌ తుదిపోరులో భారత్‌ 235-238తో కొరియా చేతిలోనే పరాజయం పాలైంది. రికర్వ్‌ మహిళల టీమ్‌ ఫైనల్లోనూ మన జట్టు 3-5తో కొరియా ముందు తలవంచింది. రికర్వ్‌ పురుషుల టీమ్‌ టైటిల్‌ పోరులో భారత్‌ 1-5తో చైనా చేతిలో చిత్తయింది. రికర్వ్‌ పురుషుల వ్యక్తిగత విభాగంలో పార్థ్‌, కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో రుమా బిస్వాస్‌.. తమ తమ పసిడి మ్యాచ్‌ల్లో చైనా ఆర్చర్లపై పైచేయి సాధించలేకపోయారు. మరోవైపు కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత కాంస్య పతక పోరులో ప్రగతి 147-146తో సహచర ఆర్చర్‌ దీప్షికపై గెలిచింది.


కిప్‌యెగాన్‌ మరో ప్రపంచ రికార్డు

పారిస్‌: కెన్యా అథ్లెట్‌ ఫెయిత్‌ కిప్‌యెగాన్‌ మరో ప్రపంచ రికార్డు అందుకుంది. మహిళల 5000 మీటర్ల పరుగులో ఆమె అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసింది. డైమండ్‌ లీగ్‌ మీట్‌లో లక్ష్యాన్ని 14 నిమిషాల 5.20 సెకన్లలో చేరుకుని.. 2020లో లెటెసెన్‌బెట్‌ గీడి (14:06.62ని) నెలకొల్పిన రికార్డును ఇప్పుడు కిప్‌యెగాన్‌ తిరగరాసింది. ఈ రేసులో లెటెసెన్‌బెట్‌ (14:07.94ని) రెండో స్థానాన్ని దక్కించుకుంది. వారం క్రితమే కిప్‌యెగాన్‌.. ఫ్లోరెన్స్‌లో జరిగిన గోల్డెన్‌ గాలా మీట్‌లో మహిళల 1500 మీటర్ల పరుగులోనూ ప్రపంచ రికార్డు (3:49.11ని) సృష్టించింది. ‘‘నా ప్రణాళికల్లో ప్రపంచ రికార్డు లేదు. రేసులో గీడిని అందుకునేందుకు పరుగెత్తా అంతే. నా శరీరం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధ్యమే’’ అని కిప్‌యెగాన్‌ పేర్కొంది. మరోవైపు ఇదే డైమండ్‌ లీగ్‌ మీట్‌లో పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో లామెచా గిర్మా (ఇతియోపియా) 19 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. 7 నిమిషాల 52.11 సెకన్లలో రేసు ముగించిన గిర్మా.. 2004లో షహీన్‌ సాధించిన రికార్డును 1.52 సెకన్ల తేడాతో మెరుగుపర్చాడు.


పావో నూర్మి క్రీడలకు నీరజ్‌ దూరం

దిల్లీ: కండరాల గాయం నుంచి కోలుకుంటున్న భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా.. ప్రతిష్ఠాత్మక పావో నూర్మి క్రీడలకు దూరమయ్యాడు. ఆరోగ్య సమస్యల కారణంగా మంగళవారం జరిగే ఈ క్రీడల్లో పాల్గొనడం లేదని నీరజ్‌ సమాచారమిచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ‘‘పావో నూర్మి క్రీడల్లో జావెలిన్‌ త్రో ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా పాల్గొనడం లేదు. ఆరోగ్య సమస్యల దృష్ట్యా అతను పోటీలకు దూరమయ్యాడని నీరజ్‌ మేనేజర్‌ తెలిపాడు’’ అని ఫిన్లాండ్‌ అథ్లెటిక్స్‌ సమాఖ్య వెబ్‌సైట్లో పేర్కొంది. సాధనలో కండరాల గాయం కారణంగా ఎఫ్‌బీకే క్రీడల్లో (జూన్‌ 4) పాల్గొనడం లేదని గత నెల 29న నీరజ్‌ ప్రకటించాడు. గత నెల దోహా డైమండ్‌ లీగ్‌లో 88.67 మీటర్ల దూరం ఈటెను విసిరి అగ్రస్థానంతో ఈ సీజన్‌ను 25 ఏళ్ల నీరజ్‌ గొప్పగా ఆరంభించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడీ గాయం నుంచి అతను ఎప్పుడు కోలుకుంటాడన్న దానిపై స్పష్టత లేదు. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉంది. అలాగే ఈ ఏడాది డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌, ఆసియా క్రీడలూ ఉన్నాయి. అందుకే గాయాన్ని మరింత తీవ్రతరం చేసుకోవద్దనే ముందు జాగ్రత్తతో అతను పావో నూర్మి క్రీడలకు దూరమైనట్లు తెలుస్తోంది.


వర్షం పడితే..?

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో గద కోసం ఆస్ట్రేలియా, టీమ్‌ఇండియా గట్టిగానే పోరాడుతున్నాయి. ఆఖరి రోజు ఫలితం వచ్చేందుకే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ డ్రా అయితే అప్పుడు రెండు జట్లను ఉమ్మడి విజేతగా ప్రకటిస్తారు. నగదు బహుమతిని రెండు జట్లకూ సమానంగా పంచుతారు. ఈ ఫైనల్‌కు సోమవారం రిజర్వ్‌ డే ఉంది. ఆదివారం వర్షం కారణంగా గంట కంటే ఎక్కువ సేపు ఆటకు అంతరాయం కలిగితే.. ఆ నష్టపోయిన సమయాన్ని భర్తీ చేసేందుకు సోమవారానికి మ్యాచ్‌ను పొడిగించే అవకాశం ఉంది. అది కూడా వర్షం లేదా వెలుతురులేమి కారణంగా ఎంత సేపు ఆట ఆగిపోయిందో.. అంతే సేపు తిరిగి ఆడిస్తారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని