ICC World Cup 2023: విండీస్‌ లేని వన్డే సంబరం

తొలి రెండు ప్రపంచకప్‌లు ఆ జట్టువే. మూడో పర్యాయం కూడా ఫైనల్‌ చేరింది. ఇలాంటి గొప్ప చరిత్ర ఉన్న జట్టును ఈసారి ప్రపంచకప్‌లో చూడలేం.

Updated : 02 Jul 2023 08:25 IST

తొలిసారి ప్రపంచకప్‌కు దూరం
స్కాట్లాండ్‌ చేతిలో ఓటమితో ఆశలు ఆవిరి

తొలి రెండు ప్రపంచకప్‌లు ఆ జట్టువే. మూడో పర్యాయం కూడా ఫైనల్‌ చేరింది. ఇలాంటి గొప్ప చరిత్ర ఉన్న జట్టును ఈసారి ప్రపంచకప్‌లో చూడలేం. గతమెంతో ఘనమన్నట్లుగా.. నానాటికీ తీసికట్టుగా మారిన ఆటతో ఇప్పటికే అవమానాలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్‌.. ఇప్పుడు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. చరిత్రలో తొలిసారి వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. ఒకప్పుడు అరివీర భయంకరమైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన కరీబియన్‌ జట్టుకు ఇలాంటి దుస్థితి రావడం ముందుతరం క్రికెట్‌ అభిమానులకు పెద్ద షాకే.

హరారె

ఊహించిందే జరిగింది. వెస్టిండీస్‌కు షాక్‌ తప్పలేదు. పేలవ ప్రదర్శనతో.. పస లేని ఆటతో పసికూనల చేతిలో ఓడుతున్న ఆ జట్టు.. ఈ ఏడాది భారత్‌ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. శనివారం ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ చేతిలో ఓటమితో ఆ జట్టు దారులు మూసుకుపోయాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమైన విండీస్‌ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 43.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. జేసన్‌ హోల్డర్‌ (45), రొమారియో షెఫర్డ్‌ (36) చెరో కొన్ని పరుగులు చేయకపోతే ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఈ ఇద్దరు మినహా ఆ జట్టులో మరే బ్యాటర్‌ కూడా 22 కంటే ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. ఇప్పుడే క్రికెట్లో ఓనమాలు దిద్దుతున్నట్లు.. అంతర్జాతీయ అనుభవమే లేదన్నట్లు ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్‌ చేరారు. మెక్‌ములెన్‌ (3/32), మార్క్‌ వాట్‌ (2/25), క్రిస్‌ గ్రేవ్స్‌ (2/30), క్రిస్‌ సోల్‌ (2/43) వికెట్లు పంచుకున్నారు. బ్యాటర్ల మార్గంలోనే సాగిన విండీస్‌ బౌలర్లు కూడా.. ఛేదనలో స్కాట్లాండ్‌ను కట్టడి చేయలేక చేతులెత్తేశారు. మాథ్యూ క్రాస్‌ (74 నాటౌట్‌), మెక్‌ములెన్‌ (69) అర్ధశతకాలతో రాణించడంతో స్కాట్లాండ్‌ 43.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఇద్దరిని ఆపలేక విండీస్‌ బౌలర్లు చేష్టలుడిగారు. అంతకుముందు లీగ్‌ దశ చివరి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా జింబాబ్వే, నెదర్లాండ్స్‌ చేతుల్లో విండీస్‌ చిత్తయిన సంగతి తెలిసిందే. తనతో పాటు సూపర్‌-6కు అర్హత సాధించిన జింబాబ్వే, నెదర్లాండ్స్‌ చేతుల్లో ఓడటంతో విండీస్‌ ఒక్క పాయింటూ లేకుండా సూపర్‌-6లో అడుగు పెట్టింది. దీంతో ఈ దశలో ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవడమే కాక.. జింబాబ్వే, శ్రీలంకల్లో ఒక జట్టు ఒకటికి మించి విజయాలు సాధించకపోతేనే విండీస్‌ ముందంజ వేసే పరిస్థితి తలెత్తింది. అయితే తొలి మ్యాచ్‌లోనే కరీబియన్‌ జట్టు చిత్తుగా ఓడటంతో మిగతా సమీకరణాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది.

వెస్టిండీస్‌: 183 (హోల్డర్‌ 45, రొమారియో షెఫర్డ్‌ 36; మెక్‌ములెన్‌ 3/32, మార్క్‌ వాట్‌ 2/25, క్రిస్‌ గ్రేవ్స్‌ 2/30, క్రిస్‌ సోల్‌ 2/43); స్కాట్లాండ్‌: 185/3 (మాథ్యూ క్రాస్‌ 74 నాటౌట్‌, మెక్‌ములెన్‌ 69; అకీల్‌ హొసీన్‌ 1/26)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని