Team India - BCCI: ఇది సరైన దారేనా..?

వెస్టిండీసే కదా! ఇటీవల జింబాబ్వే, నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌ లాంటి పసికూనల చేతుల్లో ఓడి వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు కదా! అలాంటి జట్టు ఏం చేస్తుందిలే.. అని అతి విశ్వాసానికి పోయి ప్రయోగాలు చేసిన భారత్‌కు షాక్‌.

Updated : 31 Jul 2023 08:10 IST

వెస్టిండీసే కదా! ఇటీవల జింబాబ్వే, నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌ లాంటి పసికూనల చేతుల్లో ఓడి వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు కదా! అలాంటి జట్టు ఏం చేస్తుందిలే.. అని అతి విశ్వాసానికి పోయి ప్రయోగాలు చేసిన భారత్‌కు షాక్‌. రెండో వన్డేలో బౌలింగ్‌, బ్యాటింగ్‌లో పూర్తిగా      విఫలమైన టీమ్‌ఇండియా.. కరీబియన్‌ జట్టు చేతిలో గట్టి దెబ్బ తింది.

వన్డే ప్రపంచకప్‌ మరెంతో దూరంలో లేదు. ఇలాంటి సమయంలో జట్టు ఆటతీరు.. వ్యూహాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. మెగా టోర్నీ దిశగా మన సన్నాహాలు సరైన దారిలోనే సాగుతున్నాయా అన్న ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికైనా జట్టు యాజమాన్యం పొరపాట్ల నుంచి పాఠాలు నేరుస్తుందా? ప్రపంచకప్‌ ముందు జట్టును పటిష్ఠపరుస్తుందా?

ఈనాడు క్రీడావిభాగం

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ అనగానే.. భారత ఆటగాళ్లంతా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో చెలరేగి ప్రపంచకప్‌కు ముందు మంచి ఊపులోకి వస్తారనే అనుకున్నారు అభిమానులు. కానీ ఇప్పుడు చూస్తే ప్రయోగాల పేరుతో ప్రదర్శన వెనక్కి వెళ్తోంది. తొలి రెండు వన్డేల్లో ఇషాన్‌ కిషన్‌ అర్ధశతకాలు మినహా చెప్పుకోదగింది ఏం లేదు. తొలి వన్డేలో రోహిత్‌, కోహ్లి బ్యాటింగ్‌ ఆర్డర్లో కిందకు వెళ్లి.. ఇతర ఆటగాళ్లను పరీక్షించి చూశారు. కానీ 115 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు జట్టు ఆపసోపాలు పడింది. చివరకు 5 వికెట్లు కోల్పోయి గెలిచింది. ఇక విశ్రాంతి పేరుతో రోహిత్‌, కోహ్లి దూరంగా ఉన్న రెండో వన్డేలో అయితే ప్రదర్శన మరింత దిగజారింది. ఈసారి బ్యాటింగ్‌లోనే కాక బౌలింగ్‌లోనూ జట్టు విఫలమైంది. 90 పరుగుల వరకూ ఒక్క వికెట్టూ కోల్పోని టీమ్‌ఇండియా.. ఆ తర్వాత 91 పరుగుల వ్యవధిలో 10 వికెట్లూ చేజార్చుకోవడం బ్యాటింగ్‌ డొల్లతనాన్ని బయటపెట్టింది. జట్టులో మరీ కొత్త ఆటగాళ్లున్నారా? పోనీ అంతర్జాతీయ అనుభవం లేదా? అంటే అదేమీ కాదు. ప్రపంచకప్‌ జట్టు ఎంపికకు పరిగణించే అవకాశాలున్న శాంసన్‌ (9), అక్షర్‌ (1), హార్దిక్‌ (7), సూర్యకుమార్‌ (24), జడేజా (10) తేలిపోయారు.    మనవాళ్లు చేతులెత్తేసిన అదే పిచ్‌పై విండీస్‌ బ్యాటర్లు ఆకట్టుకున్నారు. ఒక్క శార్దూల్‌ (3/42) మినహా బౌలర్లు రాణించకపోవడంతో విండీస్‌ 4 వికెట్లు కోల్పోయి 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షై హోప్‌ (63 నాటౌట్‌), కార్టీ (48 నాటౌట్‌), మేయర్స్‌ (36) మెరిశారు. దీంతో 2019 డిసెంబర్‌ తర్వాత టీమ్‌ఇండియాపై విండీస్‌ తొలి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 1-1తో సిరీస్‌ సమమై.. నిర్ణయాత్మక మూడో వన్డేపై ఆసక్తి పెరిగింది.

2021లోనూ ఇలాగే..

ఈ ఏడాది భారత్‌లోనే అక్టోబర్‌ 5న వన్డే ప్రపంచకప్‌ ఆరంభమవుతుంది. ఆ మెగా టోర్నీకి ఇంకా రెండు నెలల సమయమే ఉంది. ఇలాంటప్పుడు జట్టులో ప్రయోగాలు అవసరమా? సాధారణంగా ఏ ప్రపంచకప్‌కైనా జట్లు రెండు లేదా మూడేళ్ల ముందు నుంచే సన్నద్ధమవుతాయి. ముందుగా ఓ రెండేళ్ల పాటు జట్టులో ప్రయోగాలు చేసి, తుది కూర్పును తయారు చేసుకుంటాయి. ప్రపంచకప్‌కు ఏడాది ముందు నుంచి నిలకడగా ఒకే జట్టును ఆడిస్తాయి. కానీ భారత్‌ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. 2021 టీ20 ప్రపంచకప్‌కు ముందు కూడా ఇలాగే జరిగింది. అప్పుడైతే ఏ మ్యాచ్‌లో ఏ ఆటగాణ్ని ఎందుకు ఆడించారో కూడా తెలియలేదంటే అతిశయోక్తి కాదు. ప్రయోగాల మీద ప్రయోగాలు చేశారు. ఫలితం బెడిసికొట్టింది. పొట్టి కప్పులో అత్యుత్తమ జట్టును బరిలో దింపలేక.. గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. అంతే కాకుండా ప్రపంచకప్‌  (వన్డే, టీ20) చరిత్రలో తొలిసారి దాయాది పాకిస్థాన్‌ చేతిలో ఓడింది. ఇంత జరిగినా టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ పాఠాలు నేర్చుకున్నట్లు లేదు. నిరుడు టీ20 ప్రపంచకప్‌లోనూ నిరాశే మిగిలింది. ఇప్పుడు కీలకమైన వన్డే ప్రపంచకప్‌కు ముందూ ఇలాగే ప్రయోగాలు చేస్తోంది. ఈ ప్రయోగాలు శ్రుతి మించితే మరోసారి.. అదీ సొంతగడ్డపై పరాభవం తప్పదు.

సొంతగడ్డపై అనుకుంటే..

ఇప్పుడు ఆడుతోంది విదేశాల్లో కాబట్టి ప్రయోగాలు బెడిసి కొడుతున్నాయి.. ప్రపంచకప్‌ సొంతగడ్డపై కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు అనుకుంటే పొరపడ్డట్టే! స్వదేశంలో జరిగే మెగా టోర్నీలో అంచనాలు అసాధారణ స్థాయిలో ఉంటాయి. ఈ టోర్నీలో ఇలాంటి ఒక్క మ్యాచ్‌ ఎదురై.. జట్టు ఓటమి పాలైతే పుంజుకోవడం కష్టమవుతుంది. కప్పు గెలవాలంటే ప్రతి మ్యాచ్‌ కూడా కీలకమే. ఆ దిశగా ఎలాంటి ఉదాసీనతకు తావివ్వకుండా.. పూర్తి అత్యుత్తమ జట్టును బరిలో దింపాల్సి ఉంటుంది. ఏ స్థానంలో ఏ ఆటగాడు ఆడాలి. ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి. ఓపెనింగ్‌ చేసేది ఎవరు? మిడిలార్డర్‌లో నిలబడేది ఎవరు? పేస్‌ బౌలింగ్‌ భారాన్ని పంచుకునేది ఎవరు? స్పిన్‌తో చుట్టేసేది ఎవరు.. ఇలా ఇప్పటికే తుది జట్టుపై స్పష్టత రావాల్సింది పోయి ప్రయోగాల పుణ్యమా అని మరింత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రపంచకప్‌కు ముందు భారత్‌ ఆసియా కప్‌లో 6 (ఫైనల్‌ చేరితే), ఆస్ట్రేలియాతో 3 వన్డేలు మాత్రమే ఆడనుంది. ఇలా బ్యాటింగ్‌ ఆర్డర్లో మార్పులు చేస్తూ పోతే.. ప్రపంచకప్‌లో ఆడించే జట్టులో ఆటగాళ్ల స్థానాలపై స్పష్టత ఎలా వస్తుందన్నది మేనేజ్‌మెంట్‌కే తెలియాలి. నిర్దిష్టమైన స్థానాల్లో ఆటగాళ్లను నిలకడగా ఆడిస్తే.. అప్పుడు తుది కూర్పుపై ఓ అంచనా ఏర్పడే ఆస్కారముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు