కప్పు ముందు కంగారూలతో..

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌! వన్డే ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు జట్టు బలాబలాలను పరీక్షించుకోవడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఏముంటుంది?

Updated : 22 Sep 2023 13:59 IST

ఆసీస్‌తో భారత్‌ తొలి వన్డే నేడు
మధ్యాహ్నం 1.30 నుంచి

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌! వన్డే ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు జట్టు బలాబలాలను పరీక్షించుకోవడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఏముంటుంది? లోపాలను సరిదిద్దుకోవడానికి, కూర్పును సరిచూసుకోవడానికి, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఓ అంచనాకు రావడానికి దీనికంటే మంచి సిరీస్‌ లభిస్తుందా? టీమ్‌ఇండియా ఎలా సద్వినియోగం చేసుకుంటుందో? నేటి నుంచే ఆస్ట్రేలియాతో సిరీస్‌.

మొహాలి

స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమ్‌ఇండియా అసలైన సవాల్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే తొలి వన్డేలో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కుల్‌దీప్‌ యాదవ్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యలకు తొలి రెండు వన్డేల్లో విశ్రాంతినిచ్చారు. రోహిత్‌ గైర్హాజరీలో వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. జోరుమీదున్న ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం టీమ్‌ఇండియాకు పెద్ద సవాలే. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఓడినప్పటికీ కమిన్స్‌ సారథ్యంలోని కంగారూ జట్టు మంచి ఫామ్‌లో ఉంది.

శ్రేయస్‌పైనే దృష్టి: ఫిట్‌నెస్‌తో ఉన్నాడా? ప్రపంచకప్‌లో ఆడగలడా? శ్రేయస్‌ అయ్యర్‌ గురించి అందరిలోనూ ఉన్న అనుమానాలివి. ఈ నేపథ్యంలో అభిమానులందరి దృష్టీ అతడిపైనే నిలవనుంది. 28 ఏళ్ల శ్రేయస్‌ వెన్ను గాయం కారణంగా గత ఆరు నెలల్లో పెద్దగా క్రికెట్‌ ఆడలేదు. పునరాగమనం చేసినా.. ఆసియాకప్‌లో మళ్లీ వెన్ను సమస్యతో ఇబ్బందిపడ్డాడు. కేవలం రెండే మ్యాచ్‌లు ఆడి మిగతా మ్యాచ్‌లకు దూరం కావడంతో అతడి ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. శ్రేయస్‌ ఇప్పుడు బాగానే ఉన్నాడని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ చెప్పాడు. కానీ అతడు ఎంత ఫిట్‌గా ఉన్నాడన్నది ఈ సిరీస్‌తో తేలిపోనుంది. శ్రేయస్‌ను అందరూ నిశితంగా పరిశీలిస్తారనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితుల్లో అతడు ఎలా రాణిస్తాడో చూడాలి. శ్రేయస్‌ తర్వాత మరో ముంబయి బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కే ఈ సిరీస్‌ పెద్ద పరీక్ష. ప్రపంచకప్‌కు ఎంపికైనప్పటికీ ఈ టీ20 స్టార్‌ వన్డే సామర్థ్యంపై సందేహాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ కాలంలో 27 వన్డేల్లో 25 లోపు సగటు అంటే చాలా తక్కువే. ఇది అతడి ప్రతిభను కానీ, సామర్థ్యాన్ని కానీ ఏమాత్రం ప్రతిబింబించట్లేదు. అతడు ప్రపంచకప్‌లో తుది జట్టులో స్థానానికి గ్యారెంటీ ఉన్న ఆటగాడు కాదు. కానీ తనను తాను నిరూపించుకోడానికి, ప్రపంచకప్‌కు తన ఎంపిక సరైందేనని చాటుకోవడానికి సూర్యకు ఈ సిరీస్‌ చక్కని అవకాశం. టోర్నీకి ముందు అతడు సూపర్‌ఫామ్‌ను అందుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. గిల్‌, రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ ఫామ్‌లో ఉండడంతో భారత్‌ బ్యాటింగ్‌లో బలంగానే కనిపిస్తోంది. గిల్‌తో కలిసి ఇషాన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశముంది. అక్షర్‌ గాయం కారణంగా అనూహ్యంగా జట్టులోకి వచ్చిన 37 ఏళ్ల వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాడు. వార్నర్‌, స్మిత్‌లతో అతడి పోరు అభిమానులను అలరించనుంది. ఒకవేళ అక్షర్‌ కోలుకోకపోతే అశ్విన్‌ ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుల్‌దీప్‌, హార్దిక్‌లు ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో అశ్విన్‌తో పాటు వాషింగ్టన్‌ సుందర్‌ తుది జట్టులో ఉంటాడు. వీళ్లిద్దరూ జడేజాతో కలిసి స్పిన్‌ బాధ్యతలు పంచుకుంటారు. ఈ సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్లెవరికీ విశ్రాంతిన్వివలేదు. కానీ బుమ్రా, సిరాజ్‌లు మూడు మ్యాచ్‌ల్లో రెండే ఆడే అవకాశముంది.

ఫామ్‌లో ఆసీస్‌: ఇటీవల దక్షిణాఫ్రికాలో 2-3తో ఓడిపోయినప్పటికీ ఆస్ట్రేలియా నాణ్యమైన వన్డే సిరీస్‌ ఆడింది. భారత్‌తో భారత్‌లో ఆడిన చివరి వన్డే సిరీస్‌లో నెగ్గడం ఆ జట్టు విశ్వాసాన్ని పెంచేదే. ట్రావిస్‌ హెడ్‌కు గాయం కావడంతో అందివచ్చిన అవకాశాన్ని లబుషేన్‌ దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అందిపుచ్చుకున్నాడు. అతడు 283 పరుగులతో ఆ సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అసలు పరీక్ష మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లకే. బ్యాటింగ్‌ అనుకూల పిచ్‌పై బౌలింగ్‌ చేయడం వారికి సవాలే. కెప్టెన్‌ కమిన్స్‌ గాయం ఆసీస్‌కు ఆందోళన కలిగిస్తోంది. మణికట్టు గాయం నుంచి కోలుకున్న అతడు సిరీస్‌లో మూడు మ్యాచ్‌లూ అడతాననే      విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

తుది జట్లు (అంచనా).. భారత్‌: ఇషాన్‌ కిషన్‌, గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌, రాహుల్‌, జడేజా, సుందర్‌, అశ్విన్‌, షమి, సిరాజ్‌, బుమ్రా

ఆస్ట్రేలియా: వార్నర్‌, మార్ష్‌, స్మిత్‌, లబుషేన్‌, కేరీ, గ్రీన్‌, స్టాయినిస్‌, కమిన్స్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, అడమ్‌ జంపా, హేజిల్‌వుడ్‌

పిచ్‌ ఇలా

మొహాలీలో నాలుగేళ్లుగా వన్డే మ్యాచ్‌ జరగలేదు. ఐపీఎల్‌లో మాత్రం కొన్ని భారీ స్కోర్లు నమోదయ్యాయి. చివరగా ఇక్కడ 2019లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తొలి వన్డే సందర్భంగా ఇక్కడి వాతావరణం వేడిగా, పొడిగా ఉంటుంది.

వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి స్టీవ్‌ స్మిత్‌కు అవసరమైన పరుగులు. 61

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని