Afghanistan vs Sri Lanka: సంచలనం నం.3

ఒక్కరైనా ఊహించి ఉండరు ఈ పరిస్థితిని! ఇదో అద్భుతం! ఇదో స్ఫూర్తిదాయక ప్రయాణం! వన్డే ప్రపంచకప్‌లో ప్రతి జట్టూ ఆరేసి మ్యాచ్‌లు ఆడేసింది.

Updated : 31 Oct 2023 07:22 IST

శ్రీలంకకూ షాక్‌.. అఫ్గాన్‌ మరో అద్భుతం
విజృంభించిన ఫారూఖీ
చెలరేగిన రహ్మత్‌, హష్మతుల్లా, అజ్మతుల్లా

ఒక్కరైనా ఊహించి ఉండరు ఈ పరిస్థితిని! ఇదో అద్భుతం! ఇదో స్ఫూర్తిదాయక ప్రయాణం! వన్డే ప్రపంచకప్‌లో ప్రతి జట్టూ ఆరేసి మ్యాచ్‌లు ఆడేసింది. అట్టడుగున ఇంగ్లాండ్‌, 7వ స్థానంలో పాకిస్థాన్‌, ఆరులో శ్రీలంక! క్రికెట్‌ ప్రపంచాన్నే నివ్వెరపరుస్తూ అయిదో స్థానంలో అఫ్ఘనులు. ఆహా ఏమి ఆట. మేటి జట్లను సైతం మించిన ప్రదర్శనతో అభిమానుల మనసులు గెలిచిన అఫ్గానిస్థాన్‌.. అంతర్జాతీయ క్రికెట్లో మరో మెట్టెక్కుతూ టోర్నీలో మూడో సంచలనం నమోదు చేసింది. ఏకంగా   సెమీఫైనల్‌ రేసులో (ముందంజ వేయడం చాలా కష్టమైనా సరే) నిలిచి ఔరా అనిపించింది.

పెద్ద జట్టుపై అఫ్గాన్‌ విజయాన్ని సంచలనమనడానికి ఇక సంకోచించాలేమో! ఆ జట్టును కూనగా పరిగణిస్తే అంతకన్నా పొరపాటుండదేమో! అంత నైపుణ్యాన్ని, అంత పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు అఫ్ఘనులు. అటు బంతితో, ఇటు బ్యాటుతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అఫ్గానిస్థాన్‌.. ఈసారి శ్రీలంకను చిత్తు చేసింది. బంతితో ఫారూఖీ, ముజీబ్‌.. బ్యాటుతో అజ్మతుల్లా, రహ్మత్‌ షా, హష్మతుల్లా అఫ్గాన్‌ హీరోలు.

పుణె

ఫ్గానిస్థాన్‌ అదరహో(Afghanistan vs Sri Lanka). ఆ జట్టు మరోసారి ఆల్‌రౌండ్‌ సత్తా చాటింది. సోమవారం 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. మొదట శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. నిశాంక (46; 60 బంతుల్లో 5×4) టాప్‌ స్కోరర్‌. కుశాల్‌ మెండిస్‌ (39; 50 బంతుల్లో 3×4), సమరవిక్రమ (36; 40 బంతుల్లో 3×4) రాణించారు. ఫారూఖీ (4/34), ముజీబ్‌ (2/38) లంకకు కళ్లెం వేశారు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (73 నాటౌట్‌; 63 బంతుల్లో 6×4, 3×6) సూపర్‌ ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్‌ 45.2 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి ఛేదించింది. రహ్మత్‌ షా (62; 74 బంతుల్లో 7×4), హష్మతుల్లా (58 నాటౌట్‌; 74 బంతుల్లో 2×4, 1×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఫారూఖీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఏదో గాలివాటంగా గెలిచినట్లు కాకుండా.. ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌లపై నెగ్గినట్లే ఈ మ్యాచ్‌లోనూ అఫ్గాన్‌ సాధికారికంగా విజయం సాధించడం విశేషం.

అలవోకగా..: ఛేదనలో ఖాతా అయినా తెరవకముందే వికెట్‌. ఓపెనర్‌ గుర్బాజ్‌ ఔట్‌. కానీ రోజు రోజుకీ రాటుదేలుతున్న అఫ్గానిస్థాన్‌ బెదరలేదు. మొదట మరో ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (39; 57 బంతుల్లో 4×4, 1×6).. రహ్మత్‌ షా అర్ధశతక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ నిర్మాణం మొదలైంది. 17వ ఓవర్లో జట్టు స్కోరు 73 వద్ద ఇబ్రహీం నిష్క్రమించినా.. రహ్మత్‌ షా మరో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. హష్మతుల్లాతో మూడో వికెట్‌కు అతడు 58 పరుగులు జోడించడంతో ఛేదనలో అఫ్గాన్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. 28వ ఓవర్లో రహ్మత్‌ ఔటయ్యేటప్పటికి స్కోరు 131. క్రీజులోకి వచ్ని అజ్మతుల్లా దూకుడు ప్రదర్శించాడు. చక్కని షాట్లతో అలరిస్తూ.. సహకారాన్నిస్తున్న హష్మతుల్లాతో కలిసి జట్టును చకచకా లక్ష్యం దిశగా నడిపించాడు. బ్యాటర్లపై లంక బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఏ దశలోనూ వారికి కళ్లెం వేయలేకపోయారు. సింగిల్స్‌తో పాటు, అడపా దడపా బౌండరీలు వస్తుండడంతో చూస్తుండగానే అఫ్గాన్‌ స్కోరు 200 దాటింది. అలవోకగా సిక్స్‌లు బాదిన అజ్మతుల్లా 50 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. హష్మతుల్లా అంతకుముందే అర్ధసెంచరీ సాధించాడు. 93 బంతుల్లో శతక భాగస్వామ్యం నమోదు చేసిన అజ్మతుల్లా, హష్మతుల్లా జంట.. ఏమాత్రం తడబాటుకు అవకాశం ఇవ్వకుండా అలవోకగా లక్ష్యాన్ని పూర్తి చేసింది.

లంకకు కళ్లెం: అంతకుముందు శ్రీలంక బ్యాటుతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. అఫ్గాన్‌ పేసర్‌ ఫారూఖీ విజృంభించడంతో తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకుంది. ఫారూఖీ తన ఎడమచేతి వాటం పేస్‌తో బ్యాటర్లను బెంబేలెత్తించగా.. స్పిన్నర్లు ముజీబ్‌, రషీద్‌ ఖాన్‌ ఎప్పటిలాగే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో తమ వంతు పాత్ర పోషించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక పరుగుల కోసం తీవ్రంగా శ్రమించింది. పిచ్‌ నుంచి పెద్దగా సహకారం లేకున్నా ఫారూఖీ, ముజీబ్‌.. బ్యాటర్లను స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. ఆరో ఓవర్లో కరుణరత్నె (15)ను ఫారూఖీ వికెట్ల ముందు దొరకబుచ్చుకునేటప్పటికి స్కోరు 22 పరుగులే. ఆ తర్వాత కుశాల్‌ మెండిస్‌తో కలిసి నిశాంక ఇన్నింగ్స్‌ నడిపించాడు. వెంటనే వికెట్‌ పడనివ్వలేదు. రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించాక అతడు నిష్కమ్రించాడు. స్కోరింగ్‌ రేట్‌ ఏ దశలోనూ అయిదు దాటకున్నా.. సమరవిక్రమతో కలిసి మెండిస్‌ బ్యాటింగ్‌ కోనసాగించడంతో 27 ఓవర్లలో 131/2తో లంక ఇన్నింగ్స్‌ బాగానే పురోగమిస్తున్నట్లనిపించింది. కానీ స్కోరు వేగం పెంచే ప్రయత్నంలో ముజీబ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి మెండిస్‌ క్యాచ్‌ ఔట్‌ కావడంతో ఇన్నింగ్స్‌ కుదుపునకు గురైంది. ముజీబ్‌ తన తర్వాతి ఓవర్లో సమరవిక్రమను కూడా ఔట్‌ చేశాడు. ఆ తర్వాత క్రమ తప్పకుండా వికెట్లు పడ్టాయి. ధనంజయ (14), అసలంక (22), చమీర (1) కొద్ది తేడాలో నిష్క్రమించడంతో లంక 40వ ఓవర్లో 185/7తో చిక్కుల్లో పడింది. మాథ్యూస్‌ (23), తీక్షణ (29) ఎనిమిదో వికెట్‌కు 45 పరుగులు  జోడించి లంకను ఆదుకున్నారు. 11 పరుగుల వ్యవధిలో ఆ జట్టు తన చివరి మూడు వికెట్లు కోల్పోయింది.

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిశాంక (సి) గుర్బాజ్‌ (బి) అజ్మతుల్లా 46; కరుణరత్నె ఎల్బీ (బి) ఫారూఖీ 15; మెండిస్‌ (సి) నజిబుల్లా (బి) ముజీబ్‌ 39; సమరవిక్రమ ఎల్బీ (బి) ముజీబ్‌ 36; అసలంక (సి) రషీద్‌ (బి) ఫారూఖీ 22; ధనంజయ (బి) రషీద్‌ 14; మాథ్యూస్‌ (సి) నబి (బి) ఫారూఖీ 23; చమీర రనౌట్‌ 1; తీక్షణ (బి) ఫారూఖీ 29; రజిత రనౌట్‌ 5; మదుశంక నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (49.3 ఓవర్లలో ఆలౌట్‌) 241; వికెట్ల పతనం: 1-22, 2-84, 3-134, 4-139, 5-167, 6-180, 7-185, 8-230, 9-239; బౌలింగ్‌: ముజీబ్‌ 10-0-38-2; ఫారూఖీ 10-1-34-4; నవీనుల్‌ 6.3-0-47-0; అజ్మతుల్లా 7-0-37-1; రషీద్‌ ఖాన్‌ 10-0-50-1; నబి 6-0-33-0

అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (బి) మదుశంక 0; ఇబ్రహీం (సి) కరుణరత్నె (బి) మదుశంక 39; రహ్మత్‌ షా (సి) కరుణరత్నె (బి) రజిత 62; హష్మతుల్లా నాటౌట్‌ 58; అజ్మతుల్లా నాటౌట్‌ 73; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (45.2 ఓవర్లలో 3 వికెట్లకు) 242; వికెట్ల పతనం: 1-0, 2-73, 3-131; బౌలింగ్‌: మదుశంక 9-0-48-2; రజిత 10-0-48-1; మాథ్యూస్‌ 3-0-18-0; చమీర 9.2-0-51-0; తీక్షణ 10-0-55-0; ధనంజయ 4-0-21-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని