Glenn Maxwell: మ్యాక్సీ.. తప్పతాగి.. స్పృహ తప్పి!

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ మద్యం తాగి, స్పృహ కోల్పోయి ఆసుపత్రి పాలయ్యాడు. అడిలైడ్‌లో ఓ సంగీత విభావరి సందర్భంగా ఇలా జరిగింది. 

Updated : 24 Jan 2024 16:46 IST

సిడ్నీ: ఆస్ట్రేలియా (Australia) స్టార్‌ బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (Glenn Maxwell) మద్యం తాగి, స్పృహ కోల్పోయి ఆసుపత్రి పాలయ్యాడు. అడిలైడ్‌లో ఓ సంగీత విభావరి సందర్భంగా ఇలా జరిగింది. ‘సిక్స్‌ అండ్‌ ఔట్‌’ అనే బ్యాండ్‌ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మ్యాక్సీ.. అక్కడే చాలాసేపు గడిపాడు. అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఫొటోలు దిగాడు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి అతడు అతిగా మద్యం తాగి, ఆ క్రమంలోనే స్పృహ కోల్పోయినట్లు సమాచారం. మ్యాక్సీని లేపడానికి ప్రయత్నించి విఫలమైన స్నేహితులు అతడిని ఆసుపత్రికి తరలించారు. వెళ్లే దారిలో మ్యాక్సీకి స్పృహ వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై క్రికెట్‌ ఆస్ట్రేలియా విచారణ చేపట్టింది. అసలేం జరిగిందో మ్యాక్సీనే సమాధానం చెప్పాలని ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ అన్నాడు.

‘‘సంగీత విభావరిలో నేనూ ఉన్నా. కానీ ముందుగానే వెళ్లిపోయా. మనం అన్నీ తెలిసినవాళ్లం. ఎవరు తీసుకునే నిర్ణయాలకు వాళ్లే బాధ్యులు. ఇదేమీ క్రికెట్‌ సంబంధిత విషయం కాదు. మాక్సీనే అన్నిటికి సమాధానం చెప్పాలి’’ అని కమిన్స్‌ పేర్కొన్నాడు. ‘‘అంబులెన్స్‌ ఎక్కేవరకు వెళ్లాడంటేనే ఆందోళనగా ఉంది. ఇలాంటి సంఘటనలు సముచితం కాదు. క్రికెట్‌ ఆస్ట్రేలియా దీన్ని లోతుగా విచారించాలి. కెమెరాలు ఉన్నాయి.. చుట్టూ జనం ఉన్నారు. నిజం అదే తెలుస్తుంది’’ అని మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ అన్నాడు. ఇటీవల బిగ్‌బాష్‌ లీగ్‌లో తమ జట్టు మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఫైనల్‌ చేరడంలో విఫలం కావడంతో మ్యాక్స్‌వెల్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీనికి తోడు ఫిబ్రవరి 2న వెస్టిండీస్‌తో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లోనూ తలపడే ఆసీస్‌ జట్టులోనూ అతడికి చోటు దక్కలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు