Bhajji : రాజకీయాలు తెలియవు.. క్రికెట్‌తోనే నా అనుబంధం: హర్భజన్‌

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ ...

Published : 10 Jan 2022 02:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ తన భవిష్యత్‌పై స్పష్టత ఇచ్చాడు. రాజకీయాల గురించి తెలియదని, క్రికెట్‌తో సంబంధమున్న వ్యవహారాల్లోనే పాల్గొనబోతున్నట్లు వెల్లడించాడు. వ్యాఖ్యాతగా మారడమా.. మెంటార్‌ వంటి పాత్ర పోషించడమా అనేది త్వరలోనే చెబుతానని, అయితే రాజకీయాల్లోకి రావడం లేదని పేర్కొన్నాడు. ‘‘భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తూనే ఉన్నా. ఏదైనా సరే ఆటతో ముడిపడి ఉండాలని భావిస్తున్నా. క్రికెట్ కోసం ఏమైనా చేయాలని అనుకుంటున్నా. అది క్రికెట్ వ్యాఖ్యాతగానా? లేదా ఐపీఎల్‌లో ఏదొక జట్టుకు మెంటార్‌గానా అనేది ఇప్పుడే చెప్పలేను. క్రికెట్‌ ఆటతో కనెక్ట్‌ అయ్యేందుకే ఇష్టపడతా. రాజకీయాలు మాత్రం కాదు’’ అని తెలిపాడు. 

హర్భజన్‌ సింగ్‌ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ 2016లో ఆడాడు. అప్పటి నుంచి వేచి చూసినా జట్టులో స్థానం దక్కలేదు. ఆటకు రిటైర్‌మెంట్ ప్రకటించడం ఆలస్యం కావడంపై హర్భజన్‌ మాట్లాడుతూ.. ‘‘జాతీయ జట్టులోకి వచ్చేందుకు ద్వారాలు మూసుకుపోయాయి. నేను చివరి మ్యాచ్‌ ఆడి కూడా ఐదేళ్లు అయింది. అప్పుడే నా మనస్సుల్లో రిటైర్‌మెంట్ అయిపోయానని అనుకున్నా. వీడ్కోలు  అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమైంది. ఇప్పుడు నేను మాజీ ఆటగాడిని. ఇప్పటివరకు జరిగిన విషయాలపై సంతోషంగా, సంతృప్తిగా ఉన్నా’’ అని వివరించాడు.  

మూడో టెస్టు మ్యాచ్‌లో విజయం ఎవరిదంటే..?

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మూడో టెస్టు మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆఖరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా గెలిచే అవకాశాలు ఉన్నాయని హర్భజన్‌ తెలిపాడు. ‘‘గతంలో మనం పర్యటించినా.. ఇతర దేశాల వారు మన దేశానికి వచ్చినా ఎప్పుడూ 145 కి.మీ వేగంతో బంతులను సంధించే నలుగురు ఫాస్ట్‌ బౌలర్లు ఉండేవారు కాదు. అయితే ఇప్పుడు జట్టులో చాలా మంది ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. షమీ, బుమ్రా, సిరాజ్‌, శార్దూల్‌ వంటి నాణ్యమైన పేసర్లు ఉండటం కలిసొచ్చే అంశం. ఇలాంటి బౌలింగ్‌ దళం ఉండి ఉంటే దక్షిణాఫ్రికాలో సిరీస్‌ విజయం ఎప్పుడో వచ్చేది. అందుకే ఈసారి భారత్‌కు మంచి అవకాశం ఉందని భావిస్తున్నా. ఇదే సమయంలో సఫారీల జట్టు కూడా బాగానే ఆడుతోంది. అయితే కేప్‌టౌన్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది’’ అని విశ్లేషించాడు. గతంలో దక్షిణాఫ్రికా జట్టు చాలా పటిష్ఠంగా ఉండేదని చెప్పాడు. అయితే ప్రస్తుతం ఉన్న టీమ్‌ను తక్కువ చేయడం లేదుగానీ భారత్‌ను ఎదుర్కొనే సత్తా తక్కువేనని హర్భజన్‌ అంచనా వేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని