Team India : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. వీరిద్దరిలో టీమ్‌ఇండియాను నడిపించేదెవరో?

మే 29తో టీ20 లీగ్‌ ముగియనుంది. జూన్‌ 9 నుంచి భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే  ఈ సిరీస్‌కు కెప్టెన్‌ రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌ సహా పలువురు సీనియర్లు ..

Published : 14 May 2022 21:40 IST

ఇంటర్నెట్ డెస్క్: మే 29తో టీ20 లీగ్‌ ముగియనుంది. జూన్‌ 9 నుంచి భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే  ఈ సిరీస్‌కు కెప్టెన్‌ రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌ సహా పలువురు సీనియర్లు అందుబాటులో ఉండరు. బయోబబుల్‌ ఒత్తిడి నుంచి విరామం తీసుకుంటారు. జులైలో ఇంగ్లాండ్‌ పర్యటన ఉన్న నేపథ్యంలో రోహిత్, రాహుల్, కోహ్లీ, బుమ్రా, పంత్‌కు విశ్రాంతి  ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. దీంతో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు టీమ్‌ఇండియాను మరో సీనియర్‌ బ్యాటర్‌ శిఖర్ ధావన్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యలో ఒకరు నడిపిస్తారని సమాచారం. ఇప్పటికే టీ20 లీగ్‌లో హార్దిక్‌ తన కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు. గుజరాత్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. దీంతో హార్దిక్‌కే ఎక్కువ అవకాశాలు ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

దక్షిణాఫ్రికాతో జూన్‌ 9 నుంచి ఐదు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. దిల్లీ, కటక్, విశాఖపట్నం, రాజ్‌కోట్, బెంగళూరు వేదికగా మ్యాచ్‌లు జరుగుతాయి. దీని కోసం మే 22న టీమ్‌ఇండియా జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ‘‘సీనియర్‌ ప్లేయర్లు అందరూ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. రోహిత్, కేఎల్ రాహుల్, రిషభ్‌, బుమ్రా, కోహ్లీ తదితరులు నేరుగా ఇంగ్లాండ్‌కు వెళ్తారు. ఇంగ్లాండ్‌తో భారత్‌ ఐదో టెస్టుతోపాటు వన్డే, టీ20 సిరీస్‌ ఆడనుంది. అందుకే కీలకమైన ఆటగాళ్లు ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఫ్రెష్‌గా ఉండాలని విశ్రాంతి ఇస్తున్నాం’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు టీమ్ఇండియాను ఎవరు నడిపిస్తారనేదానిపైనా స్పందించారు. ‘‘సెలక్టర్లకు రెండు ఛాయిస్‌లు ఉన్నాయి.  గతంలో విరాట్, రోహిత్, రాహుల్‌ గైర్హాజరీలో శ్రీలంక పర్యటనకు శిఖర్ ధావన్‌ నాయకత్వం వహించాడు. అలానే హార్దిక్‌ పాండ్య సారథ్యం కూడా ఆకట్టుకుంటోంది’’ అని పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని