Ban vs NZ: బంగ్లాదేశ్‌ vs న్యూజిలాండ్‌ వెల్లివిరిసిన క్రీడాస్ఫూర్తి.. వీడియో వైరల్‌

Ban vs NZ: బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో నాన్‌స్టైకర్‌ బ్యాటర్‌ను రనౌట్‌చేసిన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

Updated : 24 Sep 2023 17:05 IST

ఢాకా: బంతి వేయకముందే పరుగుకోసం సిద్ధమయ్యే నాన్‌స్టైకర్‌ బ్యాటర్‌ను ఔట్‌ చేయవచ్చా? లేదా? అన్నదానిపై ఇప్పటికే ఎన్నోసార్లు చర్చ జరిగింది. క్రికెట్‌ నిబంధనల ప్రకారం కచ్చితంగా అది ఔటే. అయితే, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఇలాంటి సంఘటనే బంగ్లాదేశ్‌ vs న్యూజిలాండ్‌ రెండో వన్డే సందర్భంగా జరిగింది. నాన్‌స్టైకర్‌ ఎండ్‌లో ఉన్న ఇష్‌ సోథి (ish Sodhi) బంతి వేయకముందే పరుగు కోసం ప్రయత్నించడంతో బౌలర్‌ హసన్‌ మహ్మద్‌ (Hasan Mahmud) అతన్ని రనౌట్‌ చేశాడు. దీంతో ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోయారు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం న్యూజిలాండ్‌ (New Zealand) జట్టు బంగ్లాదేశ్‌ (Bangladesh)లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఢాకా వేదికగా రెండో వన్డే జరిగింది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. 45.3 ఓవర్‌లో బంతి విడుదల చేయకముందే ఇష్‌ సోథి పరుగు కోసం ప్రయత్నించగా, బౌలర్‌ హసన్‌ మహ్మద్‌ అతడిని రనౌట్‌ చేశాడు. దీంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు, మ్యాచ్‌ వీక్షిస్తున్న ప్రేక్షకులు సైతం ఒక్కసారి ఆశ్చర్యపోయారు. మహ్మద్‌ వెంటనే ఔట్‌ అప్పీల్‌ చేయగా, అంపైర్‌ అతడి వంక తీక్షణంగా చూసి, తుది నిర్ణయాన్ని థర్డ్‌ అంపైర్‌కు ఇచ్చాడు. క్రికెట్‌ నిబంధనల ప్రకారం థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో అప్పటికి 26 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేసి, జోరుమీదున్న ఇష్‌ సోథి చేసేది లేక చిరు నవ్వులు చిందిస్తూ పెవిలియన్‌ వైపు వెళ్లడం ప్రారంభించాడు.

ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ లిట్టన్‌దాస్‌తో చర్చించి, హసన్‌ మహ్మద్‌ తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడంతో పాటు, సోథిని తిరిగి బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మళ్లీ క్రీజులోకి వచ్చిన సోథి నేరుగా వెళ్లి మహ్మద్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 49.2 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 41.1 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌట్‌ అవ్వడం గమనార్హం. దీంతో కివిస్‌ జట్టు 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇష్‌ సోథి 39 బంతుల్లో 35 పరుగులు చేయడమే కాదు, ఏకంగా  ఆరు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకుని మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మరోవైపు మ్యాచ్‌లో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన హసన్‌ మహ్మద్‌కు (Hasan Mahmud) సామాజిక మాధ్యమాల వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని