క్రీడా పురస్కారాలకు హాకీ ఇండియా సిఫార్సులు

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు భారత పురుషుల హాకీ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ పేరును హాకీ ఇండియా సిఫార్సు చేసింది. శ్రీజేశ్‌తో పాటు మహిళల మాజీ క్రీడాకారిణి దీపిక పేరును కూడా కేంద్ర క్రీడాశాఖకు నామినేట్‌ చేసింది....

Published : 27 Jun 2021 01:17 IST

ఖేల్‌రత్న అవార్డుకు శ్రీజేశ్‌, దీపిక పేర్లు

దిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు భారత పురుషుల హాకీ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ పేరును హాకీ ఇండియా సిఫార్సు చేసింది. శ్రీజేశ్‌తో పాటు మహిళల మాజీ క్రీడాకారిణి దీపిక పేరును కూడా కేంద్ర క్రీడాశాఖకు నామినేట్‌ చేసింది. హర్మన్‌ప్రీత్‌సింగ్‌, వందనా కటారియా, నవజ్యోత్‌ కౌర్‌ పేర్లను అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది. జీవిత సాఫల్య పురస్కారం  (ధ్యాన్ చంద్ అవార్డు) కోసం ప్రముఖ మాజీ ప్లేయర్లు డా.ఆర్‌పీ సింగ్‌, సంఘాయ్‌ ఇబెంహాల్‌తోపాటు కోచ్‌లు బీజే కరియప్ప, సీఆర్‌ కుమార్‌ పేర్లను హాకీ ఇండియా కేంద్ర క్రీడాశాఖకు నామినేట్‌ చేసింది.

హాకీ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ భారత జట్టుకు విశేష సేవలందిస్తున్నాడు. 2018లో నెదర్లాండ్స్‌లోని బ్రెడాలో జరిగిన హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు వెండి పతకం సాధించడంలో, 2018లో జరిగిన ఆసియా క్రీడల్లో రజతం గెలవడంలో శ్రీజేశ్‌ కీలక పాత్ర పోషించాడు. 2019లో భువనేశ్వర్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్‌ మెన్స్‌ సిరీస్‌ ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసి జట్టు బంగారు పతకం గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. శ్రీజేశ్‌ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం అతడికి 2015లో అర్జున అవార్డు అందించింది. 2017లో పద్మశ్రీతో సత్కరించింది.

భారత మహిళ జట్టు సాధించిన పలు విజయాల్లో దీపిక ప్రధాన పాత్ర పోషించింది. 2018 ఆసియా క్రీడలతోపాటు, 2018లో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు రజత పతకం సాధించడంలో కీలకంగా వ్యవహరించింది. 2017 జనవరి 1 నుంచి 2020 డిసెంబర్ 31 మధ్య కాలాన్ని పరిగణలోకి తీసుకొని ఈసారి రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డులను ప్రదానం చేయనున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని