Rohit-Virat: ఆ విషయాన్ని కోహ్లీ కెప్టెన్సీ నుంచి నేర్చుకున్నా: రోహిత్‌ శర్మ

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు తాను జట్టులో ఆటగాడిగా ఉన్నానని, ఆ సమయంలో విరాట్ నుంచి పలు నాయకత్వ నైపుణ్యాలను నేర్చుకున్నానని రోహిత్‌ శర్మ (Rohit Sharma) అన్నాడు.

Published : 13 Feb 2023 13:16 IST

ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ (Virat Kohli) నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్‌ శర్మ .. సారథిగా అన్ని ఫార్మాట్లలో విజయవంతమవుతున్నాడు. ఇప్పటికే అతడి నాయకత్వంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతున్న టీమ్‌ఇండియా.. టెస్టుల్లోనూ విజయాలు సాధిస్తోంది. తాజాగా రోహిత్‌ (Rohit Sharma) కెప్టెన్సీలో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు తాను జట్టులో ఆటగాడిగా ఉన్నానని, ఆ సమయంలో విరాట్ నుంచి కొన్ని నైపుణ్యాలను నేర్చుకున్నానని రోహిత్‌ శర్మ అన్నాడు. 

‘నేను ఆటగాడిగా ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సమయంలో నేను ఒక విషయం గమనించా. మనకు వికెట్ రాకపోయినా ఫర్వాలేదు. కానీ, ప్రత్యర్థి తప్పు చేసేలా ఒత్తిడి తీసుకురావాలి. ఈ విషయాన్నివిరాట్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు, మన బౌలర్ల నుంచి చూసి నేను నేర్చుకున్నా. అదే నేనెప్పుడు అమలు చేస్తున్నా. ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తేవాలి. ప్రతి బంతికి వికెట్‌ను ఆశించవద్దు. బంతిని సరైన ప్రాంతాలలో వేయాలి. అప్పుడు పిచ్ కూడా సహకరిస్తుంది’’ అని రోహిత్‌ శర్మ వివరించాడు.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా (Team India) ఎన్నో విజయాలు సాధించి తిరుగులేని జట్టుగా నిలిచింది. దూకుడైన ఆటతీరును కూడా అలవాటు చేసుకుంది. కోహ్లీ నాయకత్వంలోనే ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించి టెస్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కూ దూసుకెళ్లింది. రోహిత్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియాకు మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final)కు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో భారత్‌ మరో రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తే 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకెళ్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని