IND vs PAK: దుబాయ్‌లో పాకిస్థాన్‌కే అనుకూలం.. కానీ!

పాకిస్థాన్‌లో క్రికెట్‌ ఆడేందుకు ఇతర దేశాలు ముందుకు రాకపోవడంతో యూఏఈలోనే ఆ జట్టు ఎక్కువగా మ్యాచ్‌లు ఆడుతోంది. దీంతో అక్కడి పిచ్‌లపై పాకిస్థాన్‌ టీమ్‌కు ఉన్నంత అవగాహన మరే జట్టుకు లేదనేది కాదనలేని వాస్తవం...

Published : 24 Oct 2021 13:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌లో క్రికెట్‌ ఆడేందుకు ఇతర దేశాలు ముందుకు రాకపోవడంతో యూఏఈలోనే ఆ జట్టు ఎక్కువగా మ్యాచ్‌లు ఆడుతోంది. దీంతో అక్కడి పిచ్‌లపై పాకిస్థాన్‌ టీమ్‌కు ఉన్నంత అవగాహన మరే జట్టుకు లేదనేది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా టీమ్‌ఇండియాతో ఈరోజు తలపడే దుబాయ్‌ వేదికలో 2016 నుంచి ఇప్పటివరకూ ఆ జట్టు ఆడిన ఆరు టీ20ల్లోనూ గెలవడం గుర్తించాల్సిన విషయం. అక్కడి పిచ్‌లు ఎలా ప్రవర్తిస్తాయో.. వాటిపై ఎలా బ్యాటింగ్‌ చేయాలో పాక్‌ బ్యాటర్లకు కొట్టిన పిండి. అయితే, టీమ్‌ఇండియా ఆటగాళ్లు గతేడాది పూర్తి ఐపీఎల్‌ ఆడటంతో పాటు ఈసారి రెండో దశ పోటీలు కూడా యూఏఈలోనే ఆడడంతో ఆయా పిచ్‌లు అలవాటు అయినట్లే కనిపిస్తున్నాయి. అయితే, పాకిస్థాన్‌కు రెండో సొంతగడ్డ లాంటి ఈ వేదికపై దాన్ని ఓడించాలంటే టీమ్‌ఇండియా అందుకు తగిన వ్యూహాలు రచించాలి.

విశేషాలు..

* 8.. ఇప్పటివరకూ టీ20ల్లో భారత్‌, పాకిస్థాన్‌ తలపడ్డ మ్యాచ్‌లు. టీమ్‌ఇండియా ఏడు మ్యాచ్‌ల్లో నెగ్గగా.. పాక్‌ ఒక విజయం మాత్రమే సాధించింది.

* 1.. గత మూడేళ్లలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (1173) అగ్రస్థానంలో ఉన్నాడు. టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ 993 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

* 3.. టీ20 ప్రపంచకప్‌ల్లో పాక్‌తో ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లి అజేయంగా నిలిచాడు. 2012లో 78, 2014లో 36, 2016లో 55 పరుగులు చేసి.. ఒక్కసారి కూడా ఔట్‌ కాలేదు.

* 5.. టీ20 ప్రపంచకప్‌ల్లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు. అన్నింట్లోనూ టీమ్‌ఇండియానే గెలిచింది. ఇక టీ20 ప్రపంచకప్‌ల్లో పాక్‌పై భారత్‌ నమోదు చేసిన అత్యధిక స్కోర్‌ 157/5. 2007 ఫైనల్లో భారత్‌ ఈ స్కోర్‌ సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని