Shubman Gill: అహ్మదాబాద్‌కు గిల్ .. పాక్‌తో మ్యాచ్‌ ఆడతాడా..? బ్యాటింగ్‌ కోచ్‌ ఏమన్నారంటే..?

ఇప్పుడందరి చూపూ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill)పైనే ఉంది. డెంగీ బారిన పడటంతో వన్డే ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇక చిరకాల ప్రత్యర్థి పాక్‌తోనైనా ఆడతాడని ఆశిస్తున్న వేళ.. భారత బ్యాటింగ్ కోచ్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చాడు.

Published : 11 Oct 2023 11:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: డెంగీ బారిన పడిన శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. ఇవాళ అఫ్గానిస్థాన్‌తో (IND vs AFG) మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని ఇప్పటికే బీసీసీఐ వెల్లడించింది. అయితే, పాకిస్థాన్‌తో శనివారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో గిల్ ఆడతాడనే కథనాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. చెన్నై నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తాడనే ప్రచారం సాగింది. తాజాగా ఆ వార్తలపై భారత బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్ రాఠోడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా గిల్ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చాడు.

‘‘గిల్ వేగంగా కోలుకుంటున్నాడు. అతడు ఆసుపత్రిలో చేరిన మాట వాస్తవమే. ముందు జాగ్రత్తగా ఇలా చేశాం. కోలుకోవడంతో మళ్లీ హోటల్‌కు చేరుకున్నాడు. ఎప్పటికప్పుడు వైద్య బృందం పర్యవేక్షిస్తూ ఉంది. త్వరలోనే మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నాం. ఇప్పటికే 70 నుంచి 80 శాతం వరకు కోలుకున్నాడు. అయితే, ఏ మ్యాచ్‌లో ఆడతాడనేది ఇప్పుడే చెప్పడం కష్టం.

గిల్‌ అందుబాటులో లేకపోయినా భారత బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్ఠంగానే ఉంది. అనుభవం కలిగిన బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ప్రతి ఒక్కరికీ తమ పాత్ర ఏంటో తెలుసు. మైదానంలోకి దిగిన తర్వాత ఎలా ఆడాలనే స్వేచ్ఛ వారికి ఇచ్చాం. కాబట్టి కేవలం ఒక్కరి మీదనే టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌ ఆధారపడదు’’ అని రాఠోడ్ తెలిపాడు.

దిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో భారత్‌ ఇవాళ తలపడనుంది. అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌ (IND vs PAK) మధ్య మ్యాచ్‌ జరగనుంది. ప్రస్తుతం డెంగీ ఫీవర్‌ నుంచి పూర్తిగా కోలుకోని గిల్ పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధం కావడం కష్టమేనన్న అభిప్రాయమూ విశ్లేషకుల్లో నెలకొంది. దీంతో ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని