IND vs WI: జట్టులో రాహుల్ పాత్రేంటో త్వరగా నిర్ణయించాలి: అజిత్‌ అగార్కర్‌

కేఎల్‌ రాహుల్‌ని ఏ స్థానంలో బ్యాటింగ్‌ పంపాలనే విషయంపై జట్టు యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకోవాలని మాజీ బౌలర్ అజిత్‌ అగార్కర్‌ సూచించాడు. అలాగే, చాలా రోజుల తర్వాత జట్టులో...

Published : 02 Feb 2022 01:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కేఎల్‌ రాహుల్‌ని ఏ స్థానంలో బ్యాటింగ్‌ పంపాలనే విషయంపై జట్టు యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకోవాలని మాజీ బౌలర్ అజిత్‌ అగార్కర్‌ సూచించాడు. అలాగే, చాలా రోజుల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న కుల్దీప్ యాదవ్‌, యువ ఆటగాడు రవి బిష్ణోయ్‌, యుజ్వేంద్ర చాహల్‌లలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనే విషయంపై కూడా నిర్ణయం తీసుకోవాలని మరో మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా కోరాడు.

‘ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో.. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. శిఖర్‌ ధావన్‌తో కలిసి ఓపెనింగ్‌ చేశాడు. అయితే, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మరోవైపు చాలా రోజుల తర్వాత వచ్చిన అవకాశాన్ని ధావన్‌ సద్వినియోగం చేసుకున్నాడు. రెండు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు. అందుకే రాహుల్‌ని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలనే విషయంపై జట్టు యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకోవాలి. గత ప్రదర్శన దృష్ట్యా ధావన్‌ని పక్కన పెట్టలేం. కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి అతడు ఓపెనింగ్‌ చేస్తాడు. రాహుల్‌ 4, 5 స్థానాల్లో మెరుగ్గా రాణించగలడు. అందుకే అతడిని మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు పంపితే బాగుంటుందనుకుంటున్నాను. రానున్న ప్రపంచకప్‌ వరకు ధావన్‌ ఇదే ఫామ్‌ని కొనసాగిస్తాడని భరోసా ఇవ్వలేం. అందుకే, ఒక వేళ ధావన్‌ని పక్కన పెట్టాల్సి వస్తే.. రోహిత్‌తో కలిసి రాహుల్‌ ఓపెనింగ్‌ చేయవచ్చు. 4, 5 స్థానాల్లో ఆడేందుకు ఇషాన్‌ కిషన్‌, రిషభ్‌ పంత్‌ కూడా సిద్ధంగా ఉన్నారు’ అని అజిత్‌ అగార్కర్‌ పేర్కొన్నాడు.

‘గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న కుల్దీప్ యాదవ్‌ వెస్టిండీస్‌తో జరుగనున్న సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో అతడికి కచ్చితంగా మరో అవకాశం ఇవ్వాలి. అవసరమైతే అరంగేట్ర ఆటగాడు రవి బిష్ణోయ్‌కి కూడా అవకాశమివ్వాలి. వీళ్లే కాకుండా యుజ్వేంద్ర చాహల్‌, వాష్టింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పాడు. ఫిబ్రవరి 6న అహ్మదాబాద్‌ వేదికగా తొలి వన్డే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని