IND vs NZ: భారత బౌలర్ల దెబ్బకు 66 పరుగులకే చేతులెత్తేసిన కివీస్‌

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 168 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. భారత బౌలర్ల ధాటికి 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది.

Updated : 01 Feb 2023 22:34 IST

అహ్మదాబాద్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 168 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. భారత బౌలర్ల ధాటికి 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. కివీస్‌ బ్యాటర్లలో డారిల్ మిచెల్‌ (35) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఈ విజయంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ని భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.  భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్య నాలుగు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్‌ సింగ్, ఉమ్రాన్‌ మాలిక్, శివమ్‌ మావి తలో రెండు వికెట్లు పడగొట్టారు.

గిల్ జిగేల్ 

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ (126; 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతక్కొట్టాడు. 35 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న గిల్.. తర్వాతి 50 పరుగులను 19 బంతుల్లోనే సాధించాడు. గిల్‌కిది టీ20ల్లో తొలి సెంచరీ కావడం విశేషం. రాహుల్ త్రిపాఠి (44; 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. హార్దిక్ పాండ్య (30), సూర్యకుమార్‌ యాదవ్ (24) పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో బ్రాస్‌వెల్‌, టిక్నర్‌, ఇష్‌ సోధి, డారిల్‌ మిచెల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

పరుగుల పరంగా అతిపెద్ద విజయం 

టీ20ల్లో పరుగుల పరంగా భారత్‌కిదే అతిపెద్ద విజయం. అంతకుముందు 2018లో ఐర్లాండ్‌పై టీమ్ఇండియా 143 పరుగుల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 70 పరుగులకు ఆలౌటైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని