Tokyo Olympics: భారత షూటర్లకు క్వారంటైన్‌ లేదు

మరోవారం రోజుల్లో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొనేందుకు జపాన్‌కు వెళ్లిన భారత షూటర్లు ఎలాంటి క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని భారత జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌...

Published : 17 Jul 2021 22:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మరోవారం రోజుల్లో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొనేందుకు జపాన్‌కు వెళ్లిన భారత షూటర్లు ఎలాంటి క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని భారత జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ రాజీవ్‌ భాటియా తెలిపారు. తమ షూటర్లు సోమవారం నుంచి యథావిధిగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టొచ్చని చెప్పారు. ఈ క్రీడాకారులంతా క్రోయేషియా నుంచి నేరుగా శనివారం టోక్యోకు చేరుకున్న నేపథ్యంలో ఎలాంటి క్వారంటైన్‌ అవసరం లేదన్నారు. దాంతో ఒలింపిక్స్‌ గ్రామంలో వారికి కేటాయించిన గదుల్లో అథ్లెట్లు బస చేస్తున్నారని చెప్పారు.

యూరప్‌ నుంచి టోక్యోకు చేరుకున్న తర్వాత తమకు గదులు కేటాయించడానికి ఎనిమిది గంటల సమయం పట్టిందని, దాంతో షూటర్లంతా అలిసిపోయారని భాటియా తెలిపారు. ఈ నేపథ్యంలో రేపు విశ్రాంతి తీసుకొని సోమవారం నుంచి ప్రాక్టీస్‌ మొదలుపెడతారని చెప్పారు. మరోవైపు భారత్‌ సహా పలు ఇతర దేశాల నుంచి వచ్చే క్రీడాకారులు తప్పనిసరిగా మూడు రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించారు. అయితే, భారత్‌లో మే నెలలో కరోనా కేసులు అధికమవడంతో షూటర్లు క్రొయేషియాకు వెళ్లారని, దాంతో అక్కడే ప్రాక్టీస్‌ చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే మే 29 నుంచి జూన్‌ 6 వరకు యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌, జూన్‌ 22 నుంచి జులై 3 వరకు షూటింగ్‌ ప్రపంచకప్‌లో సత్తా చాటారని పేర్కొన్నారు. కాగా, ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి మొత్తం 15 మంది షూటర్లు పాల్గొనడం విశేషం. అందులో 8 మంది రైఫిల్‌ విభాగానికి చెందిన వారు కాగా, ఐదుగురు పిస్టల్‌, మిగిలిన ఇద్దరు షూటర్లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని