Shane Warne: భారత్‌ అంటే అమితమైన ప్రేమ.. వార్న్‌ అరంగేట్రం చేసింది కూడా మనపైనే..!

స్పిన్‌ బౌలింగ్‌కే వన్నె తెచ్చిన ఆటగాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌. తన లెగ్‌స్పిన్‌తో బంతిని గింగిరాలు తిప్పుతూ ఇలా కూడా బౌలింగ్‌ చేయొచ్చా అని బ్యాట్స్‌మెన్‌ను తికమక పెట్టడం అతడి ప్రత్యేకత...

Published : 05 Mar 2022 11:21 IST

ఆసీస్‌ స్పిన్‌ దిగ్గజం గురించి ఆసక్తికర విషయాలు

స్పిన్‌ బౌలింగ్‌కే వన్నె తెచ్చిన ఆటగాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌. తన లెగ్‌స్పిన్‌తో బంతిని గింగిరాలు తిప్పుతూ.. ఇలా కూడా బౌలింగ్‌ చేయొచ్చా అని బ్యాట్స్‌మెన్‌ను తికమక పెట్టడం అతడి ప్రత్యేకత. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో 1001 వికెట్లు సాధించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాంటి దిగ్గజ ఆటగాడు శుక్రవారం హఠాన్మరణం చెందాడు. క్రికెట్‌ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచి దివికేగాడు. ఈ సందర్భంగా షేన్‌వార్న్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం..

* అరంగేట్రం: షేన్‌వార్న్‌ అరంగేట్రం చేసింది టీమ్‌ఇండియాపైనే. 1992 ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో ఈ స్పిన్‌ మాంత్రికుడు తొలిసారి టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అయితే, ఆ మ్యాచ్‌లో అతడు 45 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్‌ మాత్రమే తీసి 150 పరుగులు సమర్పించుకొని నిరాశపరిచాడు. కానీ, ఆ ఒక్క వికెట్‌ మాత్రం డబుల్‌ సెంచరీ సాధించిన రవిశాస్త్రి(206)ది కావడం గమనార్హం. అంటే షేన్‌వార్న్‌ తొలి వికెట్‌ మన మాజీ కోచ్‌దే.

* 97 కేజీలు: వార్న్‌ తన అరంగేట్రం టెస్టు నాటికే అధిక బరువుతో ఉన్నాడు. టీమ్‌ఇండియాతో ఆడిన తొలి టెస్టు సమయంలో అతడి బరువు 97 కేజీలు.

* ముందే పసిగట్టాడు: షేన్‌వార్న్‌ 2011 వన్డే ప్రపంచకప్‌ సమయంలో భారత్‌, ఇంగ్లాండ్‌కు సంబంధించిన గ్రూప్‌-బిలోని 11వ మ్యాచ్‌ ఫలితాన్ని ముందే పసిగట్టాడు. ఆరోజు మ్యాచ్‌కు ముందే ఫలితం టై అవుతుందని ట్వీట్‌ చేశాడు. నిజంగానే ఆ మ్యాచ్‌ టైగా మారింది. భారత్‌ తొలుత 338 పరుగులకు ఆలౌటవ్వగా ఇంగ్లాండ్‌ కూడా ఎనిమిది వికెట్లు కోల్పోయి అన్నే పరుగులు చేసింది.

* సచిన్‌దే పైచేయి: షేన్‌వార్న్‌ ప్రపంచ క్రికెట్‌లో అన్ని జట్లపైనా, గొప్ప గొప్ప బ్యాట్స్‌మెన్‌పైనా అదిరిపోయే ప్రదర్శనలు చేశాడు. కానీ, టీమ్‌ఇండియా మీద, ముఖ్యంగా సచిన్‌ తెందూల్కర్‌ మీద ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. టీమ్‌ఇండియాపై అతడి సగటు 47. ఇది ఏ కోణంలోనూ అత్యుత్తమ బౌలింగ్‌ కాదు.

* తగ్గేదేలే అన్నట్లు: టెస్టు క్రికెట్‌లో లోయర్‌ ఆర్డర్‌లో సెంచరీ లేకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు షేన్‌వార్న్‌. ఈ ఫార్మాట్‌లో అతడు ఒక్క శతకం కూడా సాధించకుండా 3,154 పరుగులు చేశాడు. అందులో 12 అర్ధ శతకాలు ఉన్నాయి. అలాగే స్లిప్‌లోనూ వార్న్‌ మంచి ఫీల్డర్‌ అని చెప్పొచ్చు. అక్కడ అతడి ఖాతాలో 125 క్యాచ్‌లు ఉన్నాయి.

* పడిలేచిన కెరటం: వార్న్‌ 2003 వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి ముందు డోపింగ్‌ పరీక్షలో పట్టుబడి ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. నిషేధిత ఉత్ప్రేకం వాడాడని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఏడాది పాటు సస్పెండ్‌ చేసింది. అయితే, 2004లో తిరిగొచ్చిన అతడు శ్రీలంకపై ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రదర్శన చేశాడు. మూడు టెస్టుల్లో 26 వికెట్లు పడగొట్టాడు. ఇంకో విశేషం ఏంటంటే.. తొలి రెండు టెస్టుల్లోని రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదేసి వికెట్లు తీశాడు.

* తికమక పెట్టాలని: షేన్‌వార్న్‌ ఫేవరెట్‌ కొటేషన్‌ ఒకటుంది. ‘స్పిన్‌ బౌలింగ్‌తో ప్రత్యేకంగా ఏదీ జరగకపోయినా.. ఏదో జరుగుతుందని బ్యాట్స్‌మెన్‌ను తికమక పెట్టడం ఓ కళ’. ఇలాంటి ఫీలింగ్‌తోనే వార్న్‌ తన బౌలింగ్‌తో ఎంతో మందిని బోల్తాకొట్టించాడు.

* భారత్‌ అంటే అమితమైన ప్రేమ: షేన్‌వార్న్‌కు భారత దేశం అంటే అమితమైన ప్రేమ. అవకాశం చిక్కినప్పుడల్లా మన దేశంపై తన అభిమానాన్ని చాటుకుంటాడు. గతేడాది భారత్‌లో కరోనా రెండో వేవ్‌ సమయంలో కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిన సమయంలో ఆందోళన చెందాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో ఉండాలని, తమ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలని ఓ ట్వీట్‌ ద్వారా అభ్యర్థించాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts