IPL 2021: మహీ భాయ్‌ నీ వాచ్‌ ఇవ్వు.. దేవుడా మా డాడీని గెలిపించు!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ, దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంటుంది. ఇద్దరు సరదాగా ఉంటూ అభిమానులను అలరిస్తారు...

Published : 05 Oct 2021 12:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ, దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంటుంది. ఇద్దరు సరదాగా ఉంటూ అభిమానులను అలరిస్తారు. సోమవారం ఇరు జట్ల మధ్య దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ గురు శిష్యులు అంతే సరదాగా ఉన్నారు. టాస్‌ వేసే సమయంలో జోకులు వేసుకుంటూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియా చూడటానికి ఎంతో ముచ్చటగా ఉందని అభిమానులు అంటున్నారు. అలాగే దీనిపై మీమ్స్‌ రూపొందించి జోకులు పేలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్‌ చేసిన మీమ్‌ అందర్ని ఆకట్టుకుంటోంది. సోమవారం పంత్‌ పుట్టిన రోజు కావడంతో ధోనీతో మాట్లాడుతూ తన చేతికున్న వాచ్‌ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవ్వాలని కోరినట్లు సరదాగా రూపొందించారు. ఆ వీడియోలో దిల్లీ కెప్టెన్‌ తన గురువు చేయి పట్టుకొని ఆ వాచ్‌ను పరిశీలిస్తున్నట్లు కనిపించింది. ఇద్దరి మధ్య నిజంగా అలాంటి సంభాషణ జరిగినట్లే కనపించడం గమనార్హం. దీంతో ఆ మీమ్‌ చూసిన నెటిజెన్లు బాగుందని మెచ్చుకుంటున్నారు.

చెన్నై గెలుపు కోసం జీవా ప్రార్థన..

మరోవైపు ఇదే మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలవాలని కోరుతూ ధోనీ కుమార్తె జీవా దేవుడికి ప్రార్థన చేస్తున్నట్లు కనిపించింది. ఆ ఫొటో కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అభిమానులు దాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంబరపడుతున్నారు. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఇదే చూడముచ్చటైన ఫొటో అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ ఫొటోలో జీవా అమాయకంగా కళ్లు మూసుకొని దండం పెడుతూ ప్రార్థిస్తున్న తీరు నిజంగానే ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో చెన్నై ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోనీసేన నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులే చేసింది. రాయుడు (55) అర్ధ శతకంతో మెరిశాడు. ఆపై దిల్లీ ఏడు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ధావన్‌ (39), హెట్‌మయర్‌ (28 నాటౌట్‌) దిల్లీని గెలిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని