Team India: వారు భారత జట్టులోకి రావాలంటే.. ఐపీఎల్‌లో రాణిస్తేనే సరిపోదు!

జాతీయ జట్టులోకి రావాలంటే తప్పకుండా దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సిందేననే బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

Updated : 03 Mar 2024 12:41 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇషాన్ కిషన్, శ్రేయస్‌ అయ్యర్ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లను కోల్పోవడంపై చర్చ నడుస్తున్న వేళ.. బీసీసీఐ ఆగ్రహానికి గల కారణాలు ఒక్కోటి వెల్లడవుతూ ఉన్నాయి. వారిద్దరి స్వయంకృతం వల్లే కాంట్రాక్ట్‌ను చేజార్చుకున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభం కానుంది. ఇందులో రాణిస్తే చాలు బీసీసీఐ దృష్టిలో పడొచ్చని అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే, ఐపీఎల్‌లో ఎలా ఆడినా.. జాతీయ జట్టులోకి రావాలంటే మాత్రం దేశవాళీ క్రికెట్‌ కూడా ఆడాల్సి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. 

‘‘ఇషాన్‌ బ్రేక్‌ తీసుకున్న సమయంలో ఎన్‌సీఏ లేదా రాష్ట్ర జట్టుకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ, ఐపీఎల్‌ కోసం ప్రాక్టీస్‌ చేసుకుంటున్నాడు. అందుకే, బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ దక్కలేదు. శ్రేయస్‌ విషయంలోనూ ఇదే సమస్య తలెత్తింది. అయితే, ఇప్పటికీ వీరిద్దరికి జాతీయ జట్టులోకి తలుపులు తెరిచే ఉన్నాయి. దేశవాళీలో ఆడితేనే అవకాశం ఉంటుంది’’ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. 

వన్డే వరల్డ్ కప్‌ కోసమే శ్రేయస్‌ గత ఐపీఎల్‌ ఆడలేదా?

వెన్ను నొప్పి కారణంగా ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ మధ్యలోనే బయటకొచ్చేసిన శ్రేయస్‌.. ఇప్పుడు ఫిట్‌నెస్‌ను సాకుగా చూపి రంజీల్లో ఆడకపోవడంపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. అందుకే, సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. తాజాగా రంజీ ట్రోఫీ సెమీస్‌లో ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడి గురించి కీలక విషయాలు బయటకొస్తున్నాయి. గతేడాది వన్డే ప్రపంచ కప్‌ కోసం గత ఐపీఎల్‌కు శ్రేయస్‌ దూరంగా ఉండిపోయాడని సమాచారం. అతడి స్థానంలో నితీశ్ రాణా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ‘‘గతేడాది  శస్త్రచికిత్స అనంతరం నొప్పి నివారణ మాత్రలను వాడాడు. వరల్డ్‌ కప్‌ సమయంలోనూ ఇంజెక్షన్లు తీసుకున్నాడు. సెమీస్‌, ఫైనల్‌లోనూ మళ్లీ గాయం తిరగబెట్టింది. అయినా మొత్తం టోర్నీ ఆడాడు. దాని కోసం గత ఐపీఎల్‌ సీజన్‌లోనూ ఆడలేదు. ఇక వన్డే ప్రపంచ కప్‌ తర్వాత ఆసీస్‌తో టీ20 సిరీస్‌ ఆడాడు. దక్షిణాఫ్రికా పర్యటనకూ వెళ్లాడు. జనవరిలో రంజీ మ్యాచ్‌లో ఆడేందుకు ఆసక్తి చూపాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ పాల్గొన్నాడు. ఇలా వరుసగా మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు ఎవరూ లేరు. అయినా, అతడిపై వేటు పడటం ఆశ్చర్యంగా ఉంది’’ అని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని