కుల్‌దీప్‌ లాంటోడు అంత తేలిగ్గా దొరకడు.. 

కుల్‌దీప్‌ యాదవ్‌ లాంటి ఎడమ చేతివాటం మణికట్టు మాంత్రికుడు అంత తేలిగ్గా దొరకడని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. రాబోయే టెస్టు సిరీస్‌లో అతడికి కచ్చితంగా...

Published : 03 Feb 2021 03:16 IST

మణికట్టు మాంత్రికుడికి పఠాన్‌ మద్దతు..

ఇంటర్నెట్‌డెస్క్‌: కుల్‌దీప్‌ యాదవ్‌ లాంటి ఎడమ చేతివాటం మణికట్టు మాంత్రికుడు అంత తేలిగ్గా దొరకడని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. రాబోయే టెస్టు సిరీస్‌లో కచ్చితంగా తుది జట్టులో చోటు దక్కుతుందని అతను ఆశిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌కు ఎంపికైనా కుల్‌దీప్‌ ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో అవకాశం వస్తే రాణిస్తాడని పఠాన్‌ పేర్కొన్నాడు. 

‘తుది జట్టులో అవకాశం దక్కని ఆటగాళ్ల పట్ల జట్టు యాజమాన్యం సరైన పద్ధతిలో వ్యవహరిస్తోందని నేను ఆశిస్తున్నా. వారిని మానసికంగా దృఢంగా ఉంచడం ఎంతో ముఖ్యం. అందుకే ఇటీవల యువకులు బాగా రాణించిన సందర్భాలను మనం చూశాం. అలాగే కుల్‌దీప్‌ విషయంలోనూ జట్టు అండగా ఉందని అనుకుంటున్నా. అతడో వైవిధ్యమైన బౌలర్‌. అతడికిప్పుడు 25-26 ఏళ్లు ఉంటాయి. ఈ వయసులోనే పరిణతి చెందుతాడు. రాబోయే సిరీస్‌లో ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు రాణించడానికి సిద్ధంగా ఉంటాడు’ అని మాజీ పేసర్‌ వివరించాడు.

ఇంగ్లాండ్‌ గత ప్రదర్శనలు చూస్తే.. ఆ జట్టు లెగ్‌స్పిన్నర్లపై ఆడలేదని, దాంతో కుల్‌దీప్‌ ఈ సిరీస్‌లో ఆడినప్పుడు కచ్చితంగా మంచి ప్రదర్శన చేస్తాడని చెప్పాడు. అలాగే టీమ్‌ఇండియా ఎలాంటి కాంబినేషన్‌లోనైనా ఆడగలదని పఠాన్‌ అన్నాడు. చెన్నై పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే పరిస్థితుల్లో ముగ్గుర్ని కూడా ఆడించొచ్చని పేర్కొన్నాడు. సహజంగా భారత జట్టు ముగ్గురు పేసర్లతో ఏ వికెట్‌ మీదైనా ఆడుతుందని అన్నాడు. అయితే అక్కడి పిచ్‌ను పరిశీలిస్తే ముగ్గురు స్పిన్నర్లు అవసరమని చెప్పాడు. కాగా.. భారత్‌, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు సోమవారమే తమ క్వారంటైన్‌ గడువును పూర్తి చేసుకున్నారు. అందరికీ మూడోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా తేలడంతో నేటి నుంచి ప్రాక్టీస్‌కు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నుంచి తొలి టెస్టు ఆడనున్నారు.

 ఇవీ చదవండి..
రిషభ్‌ పంత్‌ గుండెపోటు తెప్పించగలడు.. 
ఫీల్డింగ్‌ చేస్తూ జెర్సీ మార్పు.. బంతి బౌండరీకి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని