Sehwag : అది ‘నో బాల్‌’ మాత్రమే కాదు.. ఎన్నో లక్ష్యాలకు ‘ఎండ్ బాల్’!

న్యూజిలాండ్‌ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో...

Published : 28 Mar 2022 01:36 IST

భారత మహిళల జట్టు ఓటమికి కారణమైన నోబాల్‌పై సెహ్వాగ్‌ పోస్ట్‌

ఇంటర్నెట్ డెస్క్‌: ఒక్క ‘నో బాల్‌’.. మ్యాచ్‌ ఫలితంతోపాటు ఎంతోమంది క్రికెటర్ల కలలను కూల్చేస్తుందని టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్‌ బ్యాటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ను షేర్‌ చేశాడు. ‘‘అది కేవలం నోబాల్‌ మాత్రమే కాదు. భారత మహిళల జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు అంగుళం వల్ల ఎన్నో సంవత్సరాలపాటు పడిన శ్రమ వృథా అయిపోతుంది. చాలా మంది క్రికెటర్లకు జీవిత లక్ష్యాలను దూరం చేస్తుంది’’ అని పోస్ట్‌ పెట్టాడు. 

న్యూజిలాండ్‌ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. మ్యాచ్‌ ఫలితంపైనే టీమ్‌ఇండియా భవితవ్యం ఆధారపడిన సందర్భంలో అది జరగడం క్రికెట్‌ అభిమానులను బాధపెట్టింది. కప్‌ పోరులో నిలవాలంటే భారత్‌ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 274/7 స్కోరు చేసి దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచింది. అయితే ప్రొటీస్‌ బ్యాటర్లు వాల్వార్డట్‌ (80), గుడ్డాల్(49), డుప్రీజ్‌ (52*) రాణించడంతో ఒకానొక దశలో ఆ జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే మిడిల్‌ ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకోవడంతో మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌ వరకూ వెళ్లింది. చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి ఏడు పరుగులు కావాల్సి ఉంది. టీమ్‌ఇండియా బౌలర్‌ దీప్తి శర్మ నాలుగు బంతులు కట్టుదిట్టంగా వేయడంతో కేవలం నాలుగు పరుగులు వచ్చాయి. చివరి రెండు బంతులకు మూడు పరుగులు కావాల్సిన సమయంలో.. అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న డుప్రీజ్‌ భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్‌ వద్ద హర్మన్‌ చేతికి చిక్కింది. అయితే అది ‘నో బాల్’గా తేలడంతో భారత్‌ ఆశలకు తెరపడినట్లైంది. చివరి రెండు బంతులకు రెండు సింగిల్స్‌ తీసి దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఒకవేళ అది నోబాల్‌ కాకుండా ఉంటే భారత్‌నే విజయం వరించేది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని