Gill - Anderson: మా మధ్య ఏమైందంటే? గిల్‌తో మాటల యుద్ధంపై జేమ్స్‌ అండర్సన్

సిరీస్‌ చివర్లో టీమ్‌ఇండియా ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ - ఇంగ్లాండ్‌ పేసర్ జేమ్స్ అండర్సన్ మధ్య జరిగిన మాటల యుద్ధం అందరికీ గుర్తుండే ఉంటుంది.

Updated : 13 Mar 2024 11:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను (IND vs ENG) 4-1 తేడాతో టీమ్‌ఇండియా చిత్తు చేసింది. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్ - ఇంగ్లిష్‌ జట్టు సీనియర్ పేసర్ జేమ్స్‌ అండర్సన్  మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అప్పుడు ఏం జరిగిందనేది గిల్ మ్యాచ్‌ అనంతరం చెప్పలేదు. తాజాగా ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్ అండర్సన్ అప్పుడేం జరిగిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

‘‘భారత్ వెలుపల నువ్వేమైనా పరుగులు చేశావా? అని నేను అన్నా. దానికి బదులుగా ‘ఇక నువ్వు రిటైర్‌ కావాల్సిన సమయం వచ్చింది’ అని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత రెండు బంతులకే నేను గిల్‌ను ఔట్‌ చేశా. మరో ఆటగాడు కుల్‌దీప్‌ యాదవ్‌ వికెట్‌ను నేనే తీశా. అది నాకు టెస్టుల్లో 700వ వికెట్‌. అంతకుముందే కుల్‌దీప్‌ ఓ మాట అన్నాడు. ‘నాదే నీకు మైలురాయి వికెట్‌’ అవుతుందని చెప్పాడు. మేమిద్దరం దానికి నవ్వుకున్నాం’’ అని అండర్సన్ గుర్తు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించడంలో శుభ్‌మన్‌ గిల్, కుల్‌దీప్ కీలక పాత్ర పోషించారు. గిల్ సెంచరీతో అలరించాడు. కుల్‌దీప్‌ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో ఇన్నింగ్స్‌ తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది. భారత బ్యాటర్లు భారీగా పరుగులు చేసిన ఆ పిచ్‌పై ఇంగ్లాండ్ ఆటగాళ్లు తేలిపోయారు.

సిక్స్‌ కొట్టి.. ఆ తర్వాత ఔటై..

అద్భుతమైన ఆటతీరుతో శుభ్‌మన్‌ గిల్ ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రెండు సెంచరీలు చేశాడు. ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ శతకం సాధించాడు. అండర్సన్‌ బౌలింగ్‌లోనూ భారీ షాట్లు కొట్టాడు. తాను వేసిన బంతిని గిల్‌ సిక్స్‌గా మలచడంతో అండర్సన్‌ తీవ్ర అసహనానికి గురయ్యాడు. దీంతో తన నోటికి పని చెప్పాడు. మరోవైపు గిల్ కూడా  ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ ఇచ్చాడు. కానీ, ఆ తర్వాత బంతికే గిల్‌ను జిమ్మీ ఔట్ చేశాడు. టెస్టుల్లో గిల్‌ను 6 సార్లు అండర్సన్ ఔట్‌ చేయడం గమనార్హం. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్ జానీ బెయిర్‌ స్టోను కూడా భారత యువ ఆటగాడు వదల్లేదు. మాటలతో తికమక పెట్టి పెవిలియన్‌కు చేరేలా చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని