Sourav Ganguly: బుమ్రా లేకపోవడంతో టీమ్‌ఇండియాలో సమస్యలు: గంగూలీ

జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) జట్టులో లేకపోవడంతో టీమ్‌ఇండియాలో సమస్యలు వస్తాయని భారత మాజీ ఆటగాడు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) అభిప్రాయపడ్డాడు.  

Published : 11 Jan 2023 23:07 IST

ఇంటర్నెట్ డెస్క్: వెన్ను నొప్పి కారణంగా జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) జట్టుకు దూరం కావడంతో టీమ్‌ఇండియా (Team India)లో సమస్యలు వస్తాయని భారత మాజీ ఆటగాడు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు  సౌరభ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ పేసర్‌ అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు ముఖ్యమైన ఆస్తి అని పేర్కొన్నాడు. ఇటీవల గాయం నుంచి  కోలుకున్న బుమ్రా శ్రీలంకతో వన్డేలకు జట్టులో చోటు దక్కించుకున్నాడు. లంకతో తొలి వన్డేకు సన్నద్ధమయ్యే క్రమంలో బుమ్రా బరువులు మోస్తుండగా.. ఇబ్బంది తలెత్తి సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. పరీక్షలు చేయించగా బుమ్రా నడుం దగ్గర సమస్య ఉందని, చికిత్స అవసరమని తేలింది. బుమ్రా కోలుకోవడానికి ఇంకో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు కూడా బుమ్రా అందుబాటులో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది. 

ఈ నేపథ్యంలోనే బుమ్రా గాయం గురించి గంగూలీ (Sourav Ganguly) మాట్లాడాడు. గాయపడే అవకాశం ఉన్నందున ఫాస్ట్ బౌలర్‌గా ఉండటం అంత సులభం కాదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. బుమ్రా కోలుకునే వరకు వేచి చూడాలని యాజమాన్యాన్ని కోరాడు. ‘భారత జట్టుకు బుమ్రా చాలా ముఖ్యమైన ఆస్తి. అతడు లేకపోవడంతో జట్టులో సమస్యలు వస్తాయి. ఫాస్ట్ బౌలర్లు తరచూ గాయపడుతుంటారు. అతడు కోలుకునే వరకు మీరు వేచి ఉండాలి. ఫాస్ట్ బౌలింగ్ చేయడం అంత సులభం కాదు’ అని గంగూలీ అన్నాడు. ఇక, గురువారం భారత్‌, శ్రీలంక మధ్య జరిగే రెండో వన్డేకు  కోలకతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ చారిత్రాక మైదానంలో వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఈ మెగా టోర్నీకి ముందు ఈడెన్ గార్డెన్స్‌లో కొత్త స్టాండ్స్‌ నిర్మించడంతోపాటు మరికొన్ని మార్పులు చేస్తామని గంగూలీ పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని