IND vs AUS: కాసేపు టెస్టు క్రికెట్‌ ఆడేయమన్నాడు.. సెంచరీ మిస్‌ అయినందుకు బాధలేదు: కేఎల్ రాహుల్

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో (IND vs AUS) భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేశాడు. విరాట్ కోహ్లీతో కలిసి జట్టును గెలిపించాడు. ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు పడినా.. ఏమాత్రం బెదరకుండా సంయమనం పాటించాడు.

Updated : 09 Oct 2023 09:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI WC 2023) భారత్‌కు శుభారంభం దక్కింది. క్లిష్టపరిస్థితులను ఎదుర్కొని మరీ ఆసీస్‌పై (IND vs AUS) విజయం సాధించింది. టీమ్‌ఇండియా గెలవడంలో విరాట్ కోహ్లీ (85), కేఎల్ రాహుల్ (97*) కీలక పాత్ర పోషించారు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చిన కేఎల్‌ రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. మరో 3 పరుగులు చేసి ఉంటే శతకం చేసే అవకాశం ఉండేది. అయితే, సెంచరీ మిస్‌ అయినందుకు బాధేం లేదని.. జట్టు విజయమే ముఖ్యమని కేఎల్ రాహుల్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘రెండు పరుగులకే కీలకమైన మూడు వికెట్లు పడినప్పుడు క్రీజ్‌లోకి వచ్చా. అయితే, మరీ ఎక్కువగా కంగారు పడిపోలేదు. విరాట్‌ కోహ్లీతో వికెట్‌ గురించి ఎక్కువగా చర్చించలేదు. కానీ దాని గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు కోహ్లీ ఒకటే మాట చెప్పాడు. పిచ్‌ చాలా క్లిష్టంగా ఉంది. టెస్టు మ్యాచ్‌ ఆడినట్లు కాసేపు ఆడాలని సూచించాడు. ఆరంభంలో కొత్త బంతి వేసిన పేసర్లకు సహకరించింది. ఆ తర్వాత స్పిన్నర్లకూ హెల్ప్‌గానే ఉంది. అయితే, చివరి 15-20 ఓవర్లప్పుడు మాత్రం తేమ ప్రభావంతో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. బౌలర్లకు బంతిపై పట్టు దొరకలేదు. అయితే, చెన్నై పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం సులభమేమీ కాదు. ఇది చాలా మంచి క్రికెట్ వికెట్. బ్యాటర్లు, బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. చివరిగా సిక్స్‌ను అద్భుతంగా కొట్టా. అయితే, సెంచరీ చేయడానికి ఎన్ని పరుగులు అవసరం..? ఎలా చేయాలి? అనే దానిపై అవగాహన ఉంది. అప్పటికి భారత్ విజయానికి ఐదు పరుగులు అవసరం. వరుసగా ఫోర్, సిక్స్‌ కొడితే సెంచరీ అవుతుంది. కానీ బంతి నేరుగా స్టాండ్స్‌లో పడింది. శతకం మిస్‌ అయినందుకు నాకేం బాధ లేదు. జట్టు విజయం సాధించింది. అదే ముఖ్యం’’ అని కేఎల్ రాహుల్‌ అన్నాడు.

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు..

  • 2000 తర్వాత జరిగిన వరల్డ్‌ కప్ టోర్నీల్లో.. భారత్ తలపడిన మొదటి మ్యాచ్‌లోనే విజయం సాధించడం ఇది ఐదోసారి. 2003, 2011, 2015, 2019 సీజన్ల తొలి మ్యాచులో భారత్‌ గెలిచింది. కేవలం 2007లో మాత్రమే ఓటమిపాలైంది. మరోవైపు వరల్డ్‌ కప్‌ ఆరంభంలో ఆసీస్‌కు ఇదే మొదటి ఓటమి కావడం గమనార్హం. 
  • ఓపెనర్‌గా కాకుండా వన్డేల్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు. కుమార సంగక్కర 112 సార్లు చేయగా.. విరాట్ 113 సార్లు 50+ స్కోర్లు చేశాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు విరాట్ 165 పరుగులు జోడించాడు. ఇది వరల్డ్‌ కప్‌లో భారత్‌కు రెండో అత్యుత్తమ భాగస్వామ్యం.
  • ఐసీసీ పరిమిత ఓవర్ల క్రికెట్‌ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ విరాట్‌ ఘనత సాధించాడు. సచిన్‌ 2,719 పరుగులు చేయగా.. విరాట్ 2,785 రన్స్‌ చేశాడు. అయితే సచిన్ 58 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. కోహ్లీ 64 ఇన్నింగ్స్‌ల్లో చేశాడు. 
  • వన్డే ప్రపంచకప్‌ పోటీల్లో ఆసీస్‌పై భారత్ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ కేఎల్ రాహుల్. అంతకుముందు శిఖర్ ధావన్ (2019లో) 117 పరుగులు, అజయ్‌ జడేజా (1999లో) 100* పరుగులు సాధించారు.
  • వరల్డ్‌ కప్‌ పోటీల్లో చెన్నై వేదికగా ఆసీస్‌ ఆడిన నాలుగు మ్యాచుల్లో ఈసారే ఓటమి చవిచూసింది. 1987లో రెండుసార్లు, 1996లో విజయం సాధించింది. అలాగే భారత్‌ వేదికగా జరిగిన మ్యాచుల్లో ఆసీస్‌కు ఇది నాలుగో పరాజయం. మొత్తంగా 19 మ్యాచులను ఆస్ట్రేలియా జట్టు ఆడింది.
  • ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్ల జాబితాలో కేఎల్ రాహుల్ రెండో ప్లేయర్‌ కావడం విశేషం. ప్రస్తుత టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (1999లో) శ్రీలంకపై 145 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 97 పరుగులు (ప్రస్తుత మ్యాచ్‌లో), ఎంఎస్ ధోనీ (2011లో) శ్రీలంకపై 91 పరుగులు చేశారు. 
  • వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు అత్యధిక వయసులో కెప్టెన్సీ చేపట్టిన ఆటగాడు రోహిత్ శర్మనే. ఈ సారి ప్రపంచకప్‌లో రోహిత్ వయసు 36 ఏళ్ల 161 రోజులు. గతంలో మహమ్మద్ అజారుద్దీన్ (1999లో) 36ఏళ్ల 124 రోజుల వయసులో టీమ్‌ఇండియాను వరల్డ్‌ కప్‌లో నడిపించాడు. భారత్‌ అత్యధికంగా వన్డే మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టు ఆసీస్‌. మొత్తం 150 వన్డేల్లో తలపడింది. శ్రీలంకతో 167 వన్డేల్లో ప్రత్యర్థిగా బరిలోకి దిగింది. 
  • ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు ఆరు వికెట్లు తీయగా.. ఆస్ట్రేలియా స్పిన్నర్లు వికెట్‌ లేకుండా 16ఓవర్లలో 86 పరుగులు సమర్పించారు. వరల్డ్‌ కప్‌లో ఆసీస్‌పై మూడు వికెట్లు తీసిన రెండో స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 3/28 గణాంకాలు నమోదు చేశాడు. అంతకుముందు 1987లో మనిందర్ సింగ్ 3/34 ప్రదర్శన ఇచ్చాడు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని