IND vs BAN: రాహుల్‌.. ఆ విషయంపై ఇంకోసారి ఆలోచించుకో: నెట్టింట ట్రోలింగ్‌

బంగ్లాతో తొలి టెస్టులో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(KL Rahul) ప్రదర్శన మరోసారి విమర్శలపాలైంది. అన్ని ఫార్మాట్లలో ఒకే విధంగా ఆడుతున్నాడంటూ నెటిజన్లు అతడిని ట్రోల్‌ చేస్తున్నారు. 

Published : 15 Dec 2022 02:20 IST

చట్‌గావ్‌: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌(IND vs BAN)లో భాగంగా తొలి మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ పేలవమైన ప్రదర్శన చేసి మరోసారి అభిమానులు ఆగ్రహానికి గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. రాహుల్‌(KL Rahul) శుభ్‌మన్‌గిల్‌తో కలిసి 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే, ఖలీద్‌ అహ్మద్‌ తన బౌలింగ్‌తో రాహుల్‌ను కట్టడి చేశాడు. గిల్‌, విరాట్‌(Virat kohli) సైతం తైజుల్‌ ఇస్లామ్‌ చేతికి చిక్కారు. తొలి మ్యాచ్‌లో రోహిత్‌ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపికైన రాహుల్‌ రాణిస్తాడని అంతా భావించారు. కానీ, అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌కి ఆవల వేసిన బంతిని ఆడబోయి క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరాడు.

దీంతో తీవ్ర అసహనానికి గురైన రాహుల్‌ బ్యాట్‌పై పంచ్‌ ఇచ్చాడు. అతడు 54 బంతులను ఎదుర్కొని 22 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై నెట్టింట ట్రోలింగ్‌ మొదలైంది. బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంత తక్కువ స్కోరుతో వెనుదిరిగిన ఏకైక కెప్టెన్‌ రాహులే అయ్యుంటాడంటూ అతడిపై మండిపడుతున్నారు. అన్ని ఫార్మట్లలో ఒకే విధంగా ఆడుతూ అభిమానుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నాడంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇలాంటి ఆటగాళ్లకు అవకాశం ఇస్తోందంటూ బీసీసీఐని తప్పుపడుతున్నారు. 

‘‘డియర్‌ రాహుల్‌, నువ్వు స్ట్రైట్‌గా ఆడటం మర్చిపోయావు. అదే నిన్ను చిక్కుల్లో పడేస్తోంది. నువ్వు కొంత కాలం ఆటనుంచి విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్‌ ద్రవిడ్‌ ఆటను చూస్తే ఓపికగా ఉంటూ స్ట్రైట్‌గా ఆడటం ఎలాగో తెలుస్తుంది.  ఒకసారి ఈ విషయంపై ఆలోచించు’’ అంటూ ఓ అభిమాని ట్విటర్‌ ద్వారా అవేదన వ్యక్తం చేశాడు.  ‘‘టెస్టు క్రికెట్‌లో మనదేమీ  ఇంగ్లాండ్‌ జట్టు కాదు. కాస్త శ్రద్ధగా ఆడండి’’ అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 
 











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని