Virat kohli: ‘కోహ్లీ.. రేపు సెలవు తీసుకోవచ్చు కదా’: ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ అభ్యర్థన

ఈ టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీని.. సెమీఫైనల్‌లో కట్టడి చేయాలని ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌.. విరాట్‌కు సరదా అభ్యర్థన చేశాడు.

Updated : 09 Nov 2022 10:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి టీమ్‌ఇండియా సన్నద్ధమవుతోంది. గురువారం జరిగే సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు మాజీ సారథి, కింగ్ కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌.. కోహ్లీకి ఓ సరదా అభ్యర్థన చేశాడు. రేపటి మ్యాచ్‌కు ఆడకుండా విశ్రాంతి తీసుకోవాలని కోరాడు.

ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ కోసం విరాట్ సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న ఓ వీడియోను కోహ్లీ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోకు పీటర్సన్‌ స్పందిస్తూ.. ‘‘గురువారం డే ఆఫ్‌ తీసుకోవచ్చు కదా.. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీక్కూడా తెలుసు. కానీ రేపు ఒక్కరోజే విశ్రాంతి తీసుకో ప్లీజ్‌’’ అని సరదాగా రాసుకొచ్చాడు. పీటర్సన్‌తో కోహ్లీకి మంచి అనుబంధం ఉంది. ఆ మధ్య విరాట్ ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ ఇంగ్లాండ్‌ మాజీ బ్యాటర్‌.. మన పరుగుల వీరుడికి మద్దతుగా నిలిచాడు.

ఇక, ఆసియాకప్‌తో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. పొట్టి ప్రపంచకప్‌లో దూకుడు కొనసాగిస్తున్నాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు అర్ధ శతకాలు సాధించాడు. ముఖ్యంగా తొలి మ్యాచ్‌లో దాయాది పాక్‌తో అతడు ఆడిన 82 పరుగుల మ్యాచ్‌ విన్నింగ్‌ నాక్‌.. తన కెరీర్‌లోనే అత్యుత్తమం. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగే సెమీస్‌ మ్యాచ్‌లోనూ ఈ పరుగుల యంత్రం చెలరేగాలని, టీమ్‌ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లాలని అభిమానులు ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని