Kuldeep Yadav vs PAK: ఆటకు వీడ్కోలు పలికినా.. ఈ స్పెల్‌ గుర్తుండిపోతుంది: కుల్‌దీప్‌

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను భారత్‌ (IND vs PAK) చిత్తుగా ఓడించింది. దీంతో సూపర్-4లో టీమ్‌ఇండియా అగ్రస్థానానికి దూసుకుపోయింది. పాక్‌ను కట్టడి చేయడంలో కుల్‌దీప్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించాడు.

Updated : 12 Sep 2023 12:34 IST

ఇంటర్నెట్ డెస్క్: భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్‌ను (IND vs PAK) కట్టడి చేయడంలో కుల్‌దీప్‌ యాదవ్ (Kuldeep Yadav) కీలక పాత్ర పోషించాడు. ఆసియా కప్‌ సూపర్ -4లో (Asia cup Super 4 Clash) భాగంగా దాయాది దేశంతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సెంచరీలు.. రోహిత్, గిల్ హాఫ్ సెంచరీలు చేశారు. అయితే, బ్యాటింగ్‌లోనూ బలమైన పాక్‌ను 128 పరుగులకే ఆలౌట్‌ చేయడం వెనుక కుల్‌దీప్‌ (8 ఓవర్లలో 5/25) ప్రదర్శనే కారణం. మ్యాచ్‌ అనంతరం కుల్‌దీప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆట నుంచి దూరమైనప్పటికీ ఇలాంటి స్పెల్‌ తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించాడు.

‘‘చాలా సంతోషంగా ఉందని చెప్పడం మినహా ఏమీ మాట్లాడలేను. కానీ, అత్యుత్తమ జట్టుపై ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం అద్భుతంగా అనిపిస్తోంది. తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోతుంది. క్రికెట్‌ను ఆడటం ఆపేసి వీడ్కలు పలికినా సరే ఈ స్పెల్‌ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైందే. పాక్‌పై ఐదు వికెట్లు తీసుకోవడం అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే, స్పిన్‌ను చక్కగా ఆడగలిగే ఉపఖండ జట్టుపై ఇలాంటి ప్రదర్శన చేయడం వల్ల మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

గతేడాదిన్నర నుంచి మంచి ఫామ్‌లో ఉన్నా. నాణ్యమైన బౌలింగ్‌ వేస్తున్నా. కానీ, ఎప్పుడూ తుది జట్టు గురించి అతిగా ఆలోచించలేదు. ఎప్పుడు అవకాశం వచ్చినా బౌలింగ్‌ను ఆస్వాదించడం అలవాటు చేసుకున్నా. ప్రతి రోజు ఉదయం నాకెప్పుడు ఛాన్స్ వస్తుందా...? ఎలా సన్నద్ధం కావాలి? అని ఆలోచిస్తూ ఉంటా. ఫిట్‌నెస్‌పై దృష్టిసారించా. ఐపీఎల్‌ సమయంలోనూ చాలా కష్టపడ్డా’’ అని కుల్‌దీప్‌ తెలిపాడు. 2017లో వన్డేల్లోకి అడుగు పెట్టిన కుల్‌దీప్‌ 87 వన్డేల్లో 146 వికెట్లు తీశాడు. వచ్చే ప్రపంచకప్‌ జట్టులోనూ స్థానం సంపాదించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని