Lucknow vs Mumbai: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్‌.. ముంబయికి చావోరేవో

లఖ్‌నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్‌లకు దూరమైన మయాంక్ యాదవ్‌ (mayank yadav) ఫిట్‌నెస్ సాధించాడు. 

Updated : 30 Apr 2024 12:28 IST

ఇంటర్నెట్ డెస్క్: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ (Mayank Yadav) ఫిట్‌నెస్ సాధించాడు. ఈ విషయాన్ని ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కల్ ధ్రువీకరించాడు. ఏప్రిల్ 30న ముంబయి ఇండియన్స్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌లో ఈ యువ సీమర్‌ ఆడే అవకాశం ఉంది. ‘‘మాయాంక్ యాదవ్‌ ఫిట్‌గా ఉన్నాడు. అన్ని ఫిట్‌నెస్ టెస్టులు పాసయ్యాడు. ఇది నిజంగా మాకు గుడ్‌న్యూస్. ముంబయితో జరిగే మ్యాచ్‌లో అతడు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశముంది’’ అని లఖ్‌నవూ బౌలింగ్‌ కోచ్ పేర్కొన్నాడు. 

ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన వేగంతో మయాంక్‌ యాదవ్ ఆకట్టుకున్నాడు. నిలకడగా 150+ కి.మీ వేగంతో బంతులేస్తూ స్టార్‌ క్రికెటర్లనే ఆశ్చర్యపరిచాడు. ఏప్రిల్ 7న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌ మాత్రమే విసిరి గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. ప్రస్తుత ఐపీఎల్‌ ఎడిషన్‌లో బెంగళూరుపై 156.7 కి.మీ వేగంతో మయాంక్‌ బంతిని విసిరాడు. 2024 సీజన్‌లో ఇదే అత్యంత వేగవంతమైన బాల్ కావడం విశేషం. పంజాబ్‌పైనా 155.8 కి.మీ స్పీడ్‌తో బంతిని వేశాడు. 

ముంబయికి చావోరేవో 

లఖ్‌నవూతో జరిగే మ్యాచ్‌ ముంబయి ఇండియన్స్‌కు చావోరేవో లాంటిది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడానికి దారులు దాదాపు మూసుకుపోయినట్లే. ప్రస్తుతం ముంబయి 9 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు మాత్రమే సాధించింది. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ముంబయి ముందంజ వేసి ప్లేఆఫ్స్‌కు ఆశలు సజీవంగా ఉంచుకొంటుంది. లఖ్‌నవూకు కూడా ఇది కీలకమైన మ్యాచే. ప్రస్తుతం ఆ జట్టు 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 4 ఓటములతో ఉంది. ముంబయిపై నెగ్గితే లఖ్‌నవూ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడతాయి. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. మయాంక్ యాదవ్ ఆడితే ఆ జట్టుకు మరింత బలం చేకూరుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని