Mirabai chanu: మీరాకు అపూర్వ స్వాగతం.. పోలీస్‌ శాఖలో ఉన్నతోద్యోగం!

టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి మన దేశకీర్తిని ప్రపంచానికి చాటిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను స్వదేశానికి చేరుకున్నారు. ...

Updated : 26 Jul 2021 20:23 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను స్వదేశానికి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. అభిమానులు ‘ఇండియా.. ఇండియా.. భారత్‌ మాతాకీ జై, వందేమాతరం’ వంటి నినాదాలతో విమానాశ్రయ ప్రాంగణాన్ని హోరెత్తించారు. అనంతరం ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

టోక్యో నుంచి దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం మీరాబాయి చాను ఆర్టీ- పీసీఆర్‌ పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మీరాబాయి చాను మాట్లాడుతూ..  ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు 2016లోనే కోచ్‌తో కలిసి ప్రిపరేషన్‌ ప్రారంభించానన్నారు. రియో ఒలింపిక్స్‌ తర్వాత ట్రైనింగ్‌ పద్ధతిని కూడా మార్చుకున్నానన్నారు. గత ఏడేళ్లలో అంకితభావంతో కృషిచేసినట్టు వివరించారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఒలింపిక్స్‌ కలను సాకారం చేసుకొనేందుకు ఎంతో కష్టపడ్డానని, ఎన్నో త్యాగాలు చేశానని మీరా గుర్తు చేసుకున్నారు.

పోలీస్‌ శాఖలో ఉన్నతోద్యోగం..!

మరోవైపు, టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించి దేశాన్ని, రాష్ట్రాన్ని గర్వపడేలా చేసిన మీరాబాయి చానుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గౌరవం కల్పించింది. మణిపూర్‌ ప్రభుత్వం పోలీస్‌ శాఖలో ఉన్నతోద్యోగిగా నియమించింది. ఆమెను అదనపు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (స్పోర్ట్స్‌)గా నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. రజతం సాధించిన రోజే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.కోటి రివార్డును మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌సింగ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, మంచి ఉద్యోగం ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం మీరాబాయి చాను రైల్వే శాఖలో టీసీగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని