Mithali Raj: మూడేళ్ల తర్వాత మళ్లీ నం.1

టీమ్‌ఇండియా మహిళా జట్టు సారథి మిథాలి రాజ్‌ మంగళవారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సంపాదించింది. మూడేళ్ల తర్వాత తిరిగి తన స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషం....

Published : 06 Jul 2021 20:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మహిళా జట్టు సారథి మిథాలి రాజ్‌ మంగళవారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సంపాదించింది. మూడేళ్ల తర్వాత తిరిగి తన స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషం. మిథాలి 2018 ఫిబ్రవరిలో చివరిసారి ఈ జాబితాలో అందరికన్నా ముందుండేది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-1 తేడాతో ఓటమిపాలైనా ఆమె మూడు అర్థశతకాలు బాదడంతో తిరిగి నంబర్‌ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. తొలి వన్డేలో 72 పరుగులు సాధించిన ఆమె రెండో మ్యాచ్‌లో 59, మూడో మ్యాచ్‌లో 75నాటౌట్‌తో అద్భుతంగా ఆకట్టుకుంది.

మరోవైపు యువ ఓపెనర్‌ షెఫాలి వర్మ గత రెండు వన్డేల్లో 44, 19 పరుగులు చేయడంతో ఏకంగా 49 స్థానాలు ఎగబాకి 71వ స్థానానికి చేరింది. అలాగే సీనియర్‌ పేసర్‌ ఝులన్‌గోస్వామి నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 53వ ర్యాంక్‌ సాధించింది. ఇక బౌలర్ల జాబితాలో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకోవడంతో 12వ ర్యాంక్‌ సాధించింది. ఇక ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ లారెన్‌ విన్‌ఫీల్డ్‌ 14 ర్యాంకులు ఎగబాకి 41వ స్థానం సంపాదించగా.. సోఫియా డంక్లీ అనే బ్యాటర్‌ 80 స్థానాలు ఎగబాకి 76వ ర్యాంక్‌ సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ సోఫి ఎక్లిస్టోన్‌ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌ ఆరుకు చేరుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని