Cricket News: టీ20ల్లో ఆడటంపై స్పష్టతనిచ్చిన షమి.. ‘ఉమ్రాన్‌ మాలిక్‌ ఎక్కడ’?

భారత పేసర్ మహ్మద్‌ షమి (Mohammed Shami) టీ20ల్లో తన భవితవ్యంపై స్పందించాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ను టీమ్ఇండియాకు ఎంపిక చేయకపోవడాన్ని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా తప్పుబట్టాడు. 

Published : 09 Jan 2024 20:10 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్‌ షమి (Mohammed Shami)కి అన్ని ఫార్మాట్లలోనూ సత్తాచాటే సామర్థ్యముంది. అతడి గణాంకాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఐపీఎల్‌లోనూ రాణిస్తున్నాడు. కానీ, కొంతకాలంగా అంతర్జాతీయ టీ20లకు తనని ఎంపిక చేయడం లేదు. 2022 టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఈ ఫార్మాట్‌లో ఆడలేదు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్న షమిని అఫ్గాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. 2024 టీ20 ప్రపంచకప్‌లో కూడా అతడు ఆడతాడా? లేదా అనే దానిపై గందరగోళం నెలకొంది. దీంతో టీ20ల్లో తన భవితవ్యంపై షమి స్పష్టతనిచ్చాడు. 

‘‘నేను వేగంగా కోలుకుంటున్నా. ఎన్‌సీఏలోని వైద్య నిపుణులు నా పురోగతి పట్ల సంతోషంగా ఉన్నారు. ట్రైనింగ్‌ సెషన్స్‌ని ప్రారంభించాను. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండేందుకు శాయశక్తులా కృషి చేస్తా. టీ20ల విషయానికొస్తే.. సెలెక్టర్ల దృష్టిలో ఉన్నానో లేదో అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందో నాకు తెలియదు.  కానీ, టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఐపీఎల్ ఉంది. వరల్డ్ టీమ్‌ని ఎంపిక చేయడానికి ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతుంది. టీమ్ మేనేజ్‌మెంట్ కోరితే టీ20 ప్రపంచకప్‌లో ఆడతాను’’ అని షమి స్పష్టం చేశాడు. 


‘ఉమ్రాన్ మాలిక్‌ ఎక్కడున్నాడు?’

భారత యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ (Umran Malik) కెరీర్‌పై టీమ్ఇండియా మాజీ ఓపెనర్ ఆకాశ్‌ చోప్రా ఆందోళన వ్యక్తం చేశాడు. కొంతకాలంగా అతడిని ఇండియా ‘ఎ’ జట్టుకి కూడా ఎంపిక చేయట్లేదన్నాడు. ‘‘కొన్నాళ్ల క్రితం ఎక్కడ చూసినా ఉమ్రాన్‌ మాలికే కనిపించాడు. వెస్టిండీస్‌ పర్యటనకు తీసుకెళ్లారు. ఒకానొక దశలో ప్రపంచకప్‌ జట్టులోనూ ఉంటాడని అంతా భావించారు. తర్వాత నుంచి అతడిని ఏ జట్టులోకీ తీసుకోవడం లేదు. కనీసం ఇండియా ‘ఎ’ టీమ్‌ కి కూడా ఎంపిక చేయలేదు. మూడు నెలల్లోనే ఏమైంది? టీమ్‌ఇండియాలోకి అడుగుపెట్టి కొన్ని అవకాశాలు అందుకున్నాక అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. అసలెక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఎందుకిలా జరుగుతోంది?’’ అని చోప్రా ప్రశ్నించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని