Pujara - Rahane : రహానె-పుజారా మళ్లీ ట్రోలింగ్‌కు దొరికేశారు..

దక్షిణాఫ్రికాతో గత టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకాలు సాధించి...

Published : 14 Jan 2022 01:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో గత టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకాలు సాధించి కాస్త ఫర్వాలేదనిపించిన టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ బ్యాటర్లు ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె కీలకమైన ఆఖరి టెస్టులో మరోసారి విఫలమయ్యారు. అయితే పుజారా రెండు ఇన్నింగ్సల్లో కలిపి 51 (43,9) చేయగా.. ఇక రహానె మరీ దారుణంగా 10 పరుగులే (9, 1) చేశాడు. దీంతో క్రికెట్‌ అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. గత కొన్ని టెస్టుల్లో సీనియర్‌ బ్యాటర్లుగా జట్టులో కొనసాగుతున్నప్పటికీ పరుగులు చేయడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నారు. దీంతో యువ క్రికెటర్లకు మార్గం సుగమం చేశారని నెటిజన్లు ట్రోల్స్ ప్రారంభించారు. రహానెను ఉద్దేశిస్తూ ‘‘థ్యాంక్యూ రహానె’’ అంటూ ట్రెండ్‌ చేస్తున్నారు.

రెండో ఇన్నింగ్స్‌లో ఇవాళ తొలి ఓవర్‌లోనే పుజారా (9).. జాన్‌సెన్‌ బౌలింగ్‌లో పీటర్సెన్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రహానె (1) కాన్ఫిడెంట్‌గా ఆడలేకపోయాడు. అనవసరమైన షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. రిజర్వ్‌ బెంచీలో శ్రేయస్‌ అయ్యర్‌, హనుమ విహారి, వృద్ధిమాన్‌ సాహా వంటి ఆటగాళ్లు తమ అవకాశం కోసం కాచుకుని కూర్చొన్నారు. దీంతో నెటిజన్లు ‘‘ఇక రహానె కుర్రాళ్ల కోసం దారి చూపించాడు. ఏ ఇతర బ్యాటర్‌కు ఈ విధంగా ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు’’ అని ట్వీట్‌ చేయగా... ‘‘వీరిద్దరిలో ఒకరు మాత్రమే తుది జట్టులో ఉంటారు. అది కూడానూ రహానెనే కావొచ్చు. ఆ తర్వాత పుజారా వరుసలో ఉంటాడు’’ అని మరొకరు ట్వీటారు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని