NZ vs BAN: న్యూజిలాండ్‌ హ్యాట్రిక్‌ విజయం

వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ హ్యాట్రిక్‌ విజయాలు సాధించింది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Updated : 13 Oct 2023 22:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 246 పరుగుల లక్ష్యాన్ని కేవలం 42.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఛేదించింది. ఇప్పటికే ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచుల్లో వరుస విజయాలు సాధించిన కీవీస్‌ ముచ్చటగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మిచెల్‌ (89*; 67 బంతుల్లో  6×4, 4×6) కేన్‌ విలియమ్సన్‌ (78 రిటైర్డ్‌ హర్ట్‌; 107 బంతుల్లో 8×4, 1×6) చెలరేగిన వేళ.. బంగ్లా నిర్దేశించిన లక్ష్యం చిన్నబోయింది. కాన్వే (45) ఫర్వాలేదని పించాడు. బంగ్లా బౌలర్లలో ముష్ఫికర్‌ రహ్మాన్‌, షకీబ్‌ అల్‌ హసన్‌ తలో వికెట్‌ తీశారు. 

తొలి డౌన్‌లో వచ్చిన విలియమ్సన్‌ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. వీలు చిక్కినప్పుడల్లా ఎడాపెడా బౌండరీలు బాదేసి.. స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అయితే, 38.2 ఓవర్‌ వద్ద ఎడమ చేతి బొటనవేలికి గాయం కావడంతో రిటైర్డ్‌ హట్‌గా వెనుదిరిగాడు. అప్పటికే స్కోరు 201కి చేరడంతో విజయం లాంఛనమే అయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్‌ ఫిలిప్స్‌ (19*)తో కలిసి మిచెల్‌ లక్ష్యాన్ని పూర్తి చేశాడు. ఓపెనర్‌ రవీంద్ర (9) మినహా క్రీజులోకి వచ్చిన వారంతా మంచి ప్రదర్శనే ఇచ్చారు. 

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్‌ (66; 75 బంతుల్లో 6×4,2×6) అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్‌  షకీబ్‌ అల్‌ హసన్‌  (40),  మెహిదీ హసన్‌ మిరాజ్‌ (30) ఫర్వాలేదని పించారు. మిగతావారెవరూ పెద్దగా రాణించలేదు. చివర్లో మహ్మదుల్లా (41*) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో బంగ్లా మంచి స్కోరే చేసింది.కివీస్‌ బౌలర్లలో ఫెర్గుసన్‌ 3 వికెట్లు తీయగా.. ట్రెంట్‌ బౌల్ట్‌, మత్‌ హెన్రీ చెరో 2 వికెట్లు, మిచెల్‌ శాట్నర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని