Team India: కోహ్లీ రాకపై లేని స్పష్టత.. అప్పుడే ఇషాన్‌కు ఛాన్స్‌.. కఠోరంగా శ్రమించాలన్న దీపక్‌!

Published : 09 Feb 2024 15:02 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో (IND vs ENG) టెస్టు సిరీస్‌ నుంచి వార్తల్లో నిలుస్తున్న విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ఇషాన్‌ కిషన్‌ జట్టులోకి వచ్చేందుకు ఎదురుచూపులు.. ఖాళీగా ఉన్న సమయాన్ని మానసికంగా బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలన్న దీపక్ చాహర్.. ఇలాంటి క్రికెట్ విశేషాలు.. 

జట్టు ప్రకటన.. అందుకే ఆలస్యమా?

ఇంగ్లాండ్‌తో మిగతా మూడు టెస్టులకు జట్టు ప్రకటన ఆలస్యం కావడానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అని పలువురు అంటున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన కోహ్లీ.. మిగతా మ్యాచ్‌లకు వస్తాడా? లేదా? అనేది తెలియడం లేదు. అతడి నుంచి వచ్చే సమాచారం కోసమే సెలక్టర్లు వేచి ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌ను ధ్రువీకరిస్తూ జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి నివేదికలు రావాల్సిఉంది. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ కూడా గాయం బారినపడ్డాడని.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం కష్టమేనని తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌కు అవకాశం దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది.


దేశవాళీలో ఆడితేనే.. : చోప్రా

‘‘అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి విరామం తీసుకున్న ఇషాన్ కిషన్ జట్టులోకి రావాలని ఆశిస్తున్నాడు. అతడిని నేరుగా తీసుకోవడం సరైన పద్ధతి కాదు. దాదాపు నెలన్నర రోజులుగా క్రికెట్ ఆడటం లేదు. కనీసం ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అయినా ఆడాల్సింది. ఫామ్‌ పరంగా ఇబ్బందిలేదని భావిస్తున్నా.. అతడిని ఇప్పుడే జట్టులోకి తీసుకోవద్దు. కొంతకాలం దేశవాళీ క్రికెట్‌ ఆడిన తర్వాతే అవకాశం ఇవ్వాలి. అప్పటివరకు కేఎస్‌ భరత్, ధ్రువ్‌ జురెల్, జగదీశన్‌ .. ఇలా ఎవరినైనా కొనసాగించాలి. విరాట్ కోహ్లీ నేరుగా వస్తాడు కదా? ఇషాన్‌ కిషన్ విషయంలో ఎందుకు వ్యత్యాసం అని అడగొద్దు. ఎందుకంటే వీరిద్దరి మధ్య చాలా తేడా ఉంది’’ అని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. 


విరామ సమయాన్ని అలా వినియోగించుకోవాలి: దీపక్ చాహర్

తండ్రికి అనారోగ్యం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న దీపక్ చాహర్ మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు. ఈసందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘కొంతకాలం పాటు విరామం తీసుకోవడం మంచిదే. ఆ సమయంలో మానసికంగా, శారీరకంగా పుంజుకొనే ఆస్కారముంటుంది. ఇప్పుడు మా నాన్న అనారోగ్యం కారణంగా ఆటకు దూరంగా ఉన్నా. ఈ సమయాన్ని నా పేస్‌ మరింత పెరిగేందుకు వినియోగించుకుంటున్నా. 2018లో నేను క్రికెట్‌ ఆడేటప్పుడు నా బౌలింగ్‌ వేగం 140 కి.మీ.గా ఉండేది. ఆ తర్వాత వేగం కోల్పోయా. నిరంతరం ఆడటం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఇప్పుడు నేను నా పేస్‌ను, నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు కృషి చేస్తున్నా. బ్యాటింగ్‌లోనూ కొన్ని షాట్లను ప్రాక్టీస్‌ చేశా. లోయర్‌ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేయాల్సిన అవసరం ఉంటుంది’’ అని దీపక్ చాహర్‌ తెలిపాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని