Ms Dhoni: ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ కాదు: మాజీ క్రికెటర్‌

భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని పూర్తి ఫిట్‌గా ఉన్నాడని, అతడికి ఇదే చివరి ఐపీఎల్‌ కాదని మాజీ క్రికెటర్‌ వ్యాఖ్యానించాడు.

Published : 14 Feb 2024 02:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని (MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఐపీఎల్‌ (IPL)ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ఈ మధ్యే నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోలు బయటకు రావడంతో అవి వైరలయ్యాయి. కానీ అతడికిదే చివరి ఐపీఎల్‌ అని ఊహాగానాలు వస్తోన్న నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ (Irfan Pathan)స్పందించాడు.

‘‘నేను ధోనిని కొన్నిరోజుల కిందట కలిశాను. పొడవాటి జుట్టు పెంచుతూ కెరీర్‌ తొలినాళ్లలతో ఉన్న ధోనిలా తయారవుతున్నాడు. 40 ఏళ్లు దాటినా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఫ్రాంఛైజీ కోసం, అభిమానుల కోసం ఇంకొన్ని సీజన్లు ఆడేలా అతడు కనిపిస్తున్నాడు.’’అని అన్నాడు.

మూడు ఐసీసీ ట్రోఫీలు (టీ20, వన్డే వరల్డ్‌ కప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫి) గెలుచుకున్న ఏకైక భారత కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని. 2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఐదో టైటిల్‌ అందించాడు. 2024 ఐపీఎల్‌లో ఆరోసారి కప్పును అందుకుని రికార్డు సృష్టించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అత్యధికంగా (ఐదుసార్లు) కప్పు గెలిచిన కెప్టెన్లుగా రోహిత్‌శర్మ, ధోని ఉన్నారు.  ఎంతో అనుభవమున్న ధోని నాయకత్వం గురించి మాట్లాడుతూ ‘‘మనం కేవలం మాటలు చెబితే సరిపోదు. ఏదైనా చేతల్లోనే చూపించాలి. కుర్చీ లేదా ర్యాంకు వల్ల గౌరవం వస్తుందని నేను భావించను. మనం ఎలా వ్యవహరిస్తామన్న దాన్ని బట్టే అది దక్కుతుంది. సహచరులు మనల్ని నమ్మితే మెరుగైన ప్రదర్శన దానంతట అదే వస్తుంది’’అని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని