IPL 2024: గిల్ కెప్టెన్‌గా సక్సెస్‌ అవుతాడు.. మేం అండగా ఉంటాం: గ్యారీ కిర్‌స్టెన్

కొత్త సారథి నాయకత్వంలో గుజరాత్‌ టైటాన్స్‌ ఈసారి ఐపీఎల్‌ (IPL 2024) బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో హార్దిక్‌ కెప్టెన్సీలోని ముంబయి ఇండియన్స్‌తో తలపడనుండటం గమనార్హం. గత రెండు సీజన్లలో హార్దిక్‌ గుజరాత్‌ను నడిపించిన సంగతి తెలిసిందే.

Updated : 18 Mar 2024 10:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ (IPL 2024) సీజన్‌కు వేళైంది. నాలుగు రోజుల్లో మెగా లీగ్‌ ప్రారంభం కానుంది. టోర్నీలో ప్రధాన ఆటగాళ్లపైనే ఎక్కువ దృష్టి ఉంది. మరీ ముఖ్యంగా గుజరాత్‌ టైటాన్స్‌కు కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టిన శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) జట్టును ఎలా నడిపిస్తాడనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు నాయకత్వ అనుభవం పెద్దగా లేని అతడు సహచరుల్లో భరోసా నింపాల్సి ఉంటుంది. ఒకప్పుడు జట్టును ఛాంపియన్‌గా నిలిపిన హార్దిక్‌ ముంబయి సారథిగా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే, గిల్ కెప్టెన్సీ తప్పకుండా విజయవంతమవుతుందని గుజరాత్ బ్యాటింగ్‌ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. దానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని స్పష్టం చేశాడు. 

‘‘జట్టుకు నాయకత్వం వహించడం ఎవరికైనా కష్టమే. ఇలాంటి మెగా లీగ్‌ల్లో ఆ బాధ్యతలు అత్యంత కీలకం. గిల్ ఈ విధులను అద్భుతంగా నిర్వర్తిస్తాడనే నమ్మకం ఉంది. అతడికి అవసరమైన సాయాన్ని అందించడమే మా ముందున్న కర్తవ్యం. సహచరుల నుంచి నాణ్యమైన క్రికెట్‌ను వెలికితీసి జట్టును విజయాలబాట పట్టించేలా గిల్ చేయగలడు. బ్యాటింగ్‌పరంగా అతడు అద్భుతమైన ఆటగాడు. సారథిగానూ మెరుగైన పనితీరు కనబరుస్తాడని ఆశిస్తున్నాం. టీమ్‌ఇండియా తరఫున ఆడేటప్పుడూ గిల్ నిబద్ధతను చూశాం. కొత్తగా నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు ఆరంభంలో కాస్త ఒత్తిడి ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొని ముందుకు తీసుకెళ్లగల సత్తా అతడిలో ఉంది. కోచ్‌లుగా, సహాయక సిబ్బందిగా అతడికి అండగా నిలుస్తాం’’ అని కిర్‌స్టెన్ వెల్లడించాడు. 

లోయర్ ఆర్డర్‌లో అతడే కీలకం: ఆశిశ్‌ నెహ్రా

‘‘ఈ సీజన్‌లో మా జట్టుకు లోయర్‌ ఆర్డర్‌లో కీలకమైన ఆటగాడు ఉన్నాడు. ఆ స్థానంలో షారుఖ్‌ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఐపీఎల్‌ వంటి సుదీర్ఘమైన టోర్నీలో పరిస్థితులకు త్వరగా అలవాటు పడాల్సిన అవసరం ఉంది. కేవలం నాలుగైదు మ్యాచ్‌లు ఆడటం కాదు. ఫైనల్‌ వరకూ చేరుకోవడానికి ప్రయత్నిస్తాం. వాతావరణం కూడా కఠినంగా ఉంటుంది. ఆటగాళ్లు గాయపడకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్క ఆటగాడూ మాకు ముఖ్యమే. స్పెన్సర్ జాన్సన్ యువకుడు. నాణ్యమైన క్రికెటర్. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ మంచి ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. తప్పకుండా వారికి ఈ సీజన్‌ అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నా’’ అని గుజరాత్ ప్రధాన కోచ్‌ ఆశిశ్‌ నెహ్రా వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని