IPL - 2022 : పొట్టి ఫార్మాట్లో అతడు అత్యుత్తమ క్రికెటర్‌ : సంగక్కర

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్‌పై ఆ జట్టు డైరెక్టర్‌, హెడ్‌ కోచ్‌ కుమార సంగక్కర ప్రశంసలు కురిపించాడు. టీ20 క్రికెట్లో సంజూ శాంసన్‌ అత్యుత్తమ..

Published : 22 Mar 2022 01:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్‌పై ఆ జట్టు డైరెక్టర్‌, హెడ్‌ కోచ్‌ కుమార సంగక్కర ప్రశంసలు కురిపించాడు. టీ20 క్రికెట్లో సంజూ శాంసన్‌ అత్యుత్తమ ఆటగాడని పేర్కొన్నాడు.

‘శాంసన్‌ అద్భుతమైన ఆటగాడు. బ్యాటుతో విధ్వంసం సృష్టించగలడు. ఒంటి చేత్తో జట్టును గెలిపించగలడు. నేను డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టక ముందు నుంచే అతడు రాజస్థాన్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సంజూ నాయకుడిగా బాధ్యతలు చేపట్టినా.. ఇప్పటికీ చాలా విషయాలు తనకు తెలియదని.. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానని ధైర్యంగా చెబుతాడు. కెప్టెన్‌గా రోజురోజుకి మరింత మెరుగవుతున్నాడు. అతడిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. రాజస్థాన్‌ జట్టుకు కెప్టెన్‌, గొప్ప భవిష్యత్‌ ఉన్న ఆటగాడు అనే విషయాలను పక్కన పెడితే.. టీ20 క్రికెట్లో అతడు అత్యుత్తమ ప్లేయర్‌. శాంసన్ ఇక్కడి నుంచే తన ఐపీఎల్ కెరీర్‌ ప్రారంభించాడు. రాజస్థాన్‌ జట్టంటే అతడికి చాలా గౌరవం ఉంది’ అని సంగక్కర అన్నాడు.

‘సంజూ చాలా సింపుల్‌గా ఉంటాడు. చాలా తక్కువగా మాట్లాడతాడు. కానీ, తన ఆటలో గొప్ప నైపుణ్యం ఉంది. అతడితో కలిసి పని చేయడం చాలా సులభం. ఒక నాయకుడిగా ఎప్పుడూ జట్టుని గెలిపించాలనే కసితో ఉంటాడు. రాజస్థాన్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా నేను అతడికి మద్దతుగా నిలుస్తూ.. జట్టు విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తాను’ అని సంగక్కర చెప్పాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్‌-2022 సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మార్చి 29న మహరాష్ట్రలోని పుణె వేదికగా జరుగనున్న మ్యాచులో రాజస్థాన్‌ జట్టు సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్టుతో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని