Mayank Yadav: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఫాస్టెస్ట్‌ బౌలర్‌కు ఏమైంది?

నయా పేస్ సంచలనంగా మారిన లఖ్‌నవూ బౌలర్‌ మయాంక్‌ యాదవ్ (Mayank Yadav) మ్యాచ్‌ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. గుజరాత్‌పై కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే వేశాడు.

Published : 08 Apr 2024 12:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన పేస్‌తో యువ ఫాస్ట్‌ బౌలర్ మయాంక్‌ యాదవ్ (Mayank Yadav) ఆకట్టుకున్నాడు. నిలకడగా 150+ కి.మీ వేగంతో బంతులేస్తూ స్టార్‌ క్రికెటర్లనే ఆశ్చర్యపరిచాడు. తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ లఖ్‌నవూ బౌలర్‌ కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే విసిరాడు. ఆ తర్వాత మైదానాన్ని వీడాడు. దీంతో అతడికి ఏమైందనే? ప్రశ్నలు తలెత్తాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్య మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. మయాంక్‌ పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. అతడికి ఏమైందనే విషయం మాత్రం వెల్లడించలేదు. కొన్ని మీడియాల్లో వస్తున్న కథనాల ప్రకారం అతడు పక్కటెముకల గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. స్కానింగ్‌ చేసిన తర్వాతనే గాయం పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే లఖ్‌నవూ ఫ్రాంచైజీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. 

ప్రస్తుత ఐపీఎల్‌ ఎడిషన్‌లో బెంగళూరుపై 156.7 కి.మీ వేగంతో మయాంక్‌ బంతిని విసిరాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యంత వేగవంతమైన బాల్ కావడం విశేషం. పంజాబ్‌పైనా 155.8 కి.మీ స్పీడ్‌తో బంతిని వేశాడు. పేసర్‌ కావడంతో గాయాలపాలు కావడం సహజమే. గత రెండు సీజన్లలోనూ మయాంక్‌ గాయం కారణంగా రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇటీవల రంజీ ట్రోఫీ సమయంలోనూ గాయం తిరగబెట్టడంతో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు మూడు మ్యాచ్‌లకే మళ్లీ గాయపడటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.


హ్యారీ బ్రూక్‌ స్థానంలో లిజాద్‌ విలియమ్స్

ఇంగ్లాండ్‌ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఐపీఎల్‌ సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దిల్లీకి ప్రాతినిధ్యం వహించే అతడు వ్యక్తిగత కారణాల వల్ల ఆడటం లేదని ఇప్పటికే ప్రకటించాడు. అతడి స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు లిజాద్‌ విలియమ్స్‌ను తీసుకున్నట్లు దిల్లీ ఫ్రాంచైజీ ప్రకటించింది. లిజాద్ దక్షిణాఫ్రికా తరఫున 4 వన్డేలు,  11 టీ20లు ఆడాడు. అతడి కనీస ధర రూ.50 లక్షలకు దిల్లీ తీసుకుంది. దక్షిణాఫ్రికా టీ20 ఛాలెంజ్‌లో టైటాన్స్‌ తరఫున 9 మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడాది SA20 సీజన్‌లో సూపర్‌ కింగ్స్‌కు ఆడిన లిజాద్ తొమ్మిది మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం దిల్లీ ఐదు మ్యాచుల్లో నాలుగు ఓటములు, ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని