Pat Cummins: కమిన్స్‌కు కలిసొచ్చిన 2023.. ఆ అవార్డును సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్‌

ఆసీస్‌ కెప్టెన్‌ పాట్ కమిన్స్‌ (Pat Cummins) 2023 డిసెంబరు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

Published : 16 Jan 2024 16:42 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్‌ కమిన్స్‌ (Pat Cummins) 2023లో కెప్టెన్‌గా, ఆటగాడిగా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. డిసెంబరులో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0 తో క్లీన్‌స్వీప్‌ చేయడంలోనూ కీలకపాత్ర పోషించాడు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(MCG)లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 250 వికెట్లు తీసిన ఏడో ఆస్ట్రేలియా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో 2023 డిసెంబరు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది అవార్డు విజేతగా నిలిచాడు. తైజుల్ ఇస్లాం (బంగ్లాదేశ్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)ను వెనక్కినెట్టి కెరీర్‌లో తొలిసారి ఈ అవార్డును అందుకున్నాడు. కమిన్స్‌ ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు రేసులోనూ ఉన్నాడు. 

పట్టిందల్లా బంగారమే!

కమిన్స్‌ జీవితంలో 2023 చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది అతడు కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎన్నో ఘనతలు అందుకున్నాడు. అతడి సారథ్యంలో యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ మొదటి మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడి ఒక మ్యాచ్‌ డ్రా చేసుకుని బాగా వెనకబడిపోయింది. తర్వాత అనూహ్యంగా పుంజుకుని మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను డ్రా చేసుకుంది. అనంతరం ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (WTC) విజేతగా నిలిచింది. ఫైనల్‌లో టీమ్ఇండియాను ఓడించి తొలిసారి డబ్ల్యూటీసీ గదను అందుకుంది. ప్రపంచకప్‌లో రెండు ఓటములతో వెనకబడినట్లు కనిపించిన జట్టును వరుసగా ఏడు విజయాలతో ఫైనల్‌కు చేర్చాడు. కీలకమైన ఫైనల్‌లో వరుసగా 10 విజయాలు సాధించి జోరు మీదున్న టీమ్‌ఇండియాను తన మాస్టర్‌ మైండ్‌తో బోల్తా కొట్టించి ఆసీస్‌కు ఆరో ప్రపంచ కప్‌ టైటిల్‌ను అందించాడు.  

ఐపీఎల్‌లో జాక్‌పాట్ 

ప్రపంచకప్‌లో సత్తా చాటిన కమిన్స్‌ ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధర పలుకుతాడని ముందే ఊహించారు. అంచనాలకు తగ్గట్టుగానే ఫ్రాంఛైజీలు అతడిపై రూ. కోట్లు కుమ్మరించడానికి పోటీపడ్డాయి. చివరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.20.5 కోట్లకు సొంతం చేసుకుంది. కమిన్స్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు  42 మ్యాచ్‌లు ఆడి 45 వికెట్లు పడగొట్టాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు