IND vs AUS : ఆస్ట్రేలియాకు మరో షాక్‌..! మూడో టెస్టుకు కెప్టెన్‌ దూరం..

వరుస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న ఆస్ట్రేలియా‌(Australia)కు మరో షాక్‌. అత్యవసరంగా స్వదేశానికి వెళ్లిన కెప్టెన్‌(Pat Cummins) మూడో టెస్టు(IND vs AUS) నాటికి భారత్‌కు తిరిగి రావడం లేదు.

Updated : 24 Feb 2023 12:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy) తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాభవంతో.. తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోన్న ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్‌. అత్యవసరంగా స్వదేశానికి వెళ్లిన ఆ జట్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌.. తిరిగి భారత్‌కు రావడం లేదు. దీంతో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్‌ స్మిత్‌ మూడో టెస్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

రెండో టెస్టు అనంతరం అత్యవసరంగా వ్యక్తిగత పనుల నిమిత్తం కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్(Pat Cummins)‌.. సిడ్నీ వెళ్లిన విషయం తెలిసిందే. అతడు మూడో టెస్టు సమయానికి జట్టుతో కలుస్తాడని యాజమాన్యం తొలుత చెప్పింది. అయితే.. తన తల్లి అనారోగ్యం కారణంగా భారత్‌కు రాలేనని కమిన్స్‌ యాజమాన్యానికి తెలిపాడు. ‘ఈ సమయంలో నేను భారత్‌కు తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. నేను ఇక్కడ నా కుటుంబంతో ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం. క్రికెట్‌ ఆస్ట్రేలియా, జట్టు సహచరుల నుంచి నాకు లభించిన సహకారానికి కృతజ్ఞతలు’ అంటూ కమిన్స్‌ స్థానిక మీడియాతో పేర్కొన్నాడు.

ఇక  టీమ్‌ఇండియా(Team India) స్పిన్నర్ల ధాటికి సమాధానం ఇవ్వలేక ఆసీస్‌(Australia) బ్యాటర్లు తొలి రెండు టెస్టుల్లో చేతులెత్తేశారు. ఇదే సమయంలో ఆ జట్టుని గాయాల బెడద వెంటాడుతోంది. ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా హేజిల్‌వుడ్‌ ఈ సిరీస్‌కే దూరమవగా.. ఇక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా గాయం కారణంగా.. మిగతా రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇప్పుడు కెప్టెన్‌ కూడా మూడో టెస్టుకు దూరమయ్యాడు. అయితే, మరో కీలక ఆటగాడు కామెరూన్‌ గ్రీన్‌ మూడో టెస్టుకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఇందౌర్ వేదికగా మార్చి 1వ తేదీ నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు విజయాలతో టీమ్‌ఇండియా జోరుమీదుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని