Cricket News: ఆ ముగ్గురి గురించి ఈ ఒక్క ఫొటో చాలు.. తొలి టెస్టులో జడ్డూ ఎందుకు ఆడలేదంటే?

Updated : 26 Dec 2023 18:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచంలోనే టాప్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో ముగ్గురు భారత క్రికెటర్లు.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో జడేజా లేకపోవడానికి కారణమేంటో చెప్పిన రోహిత్.. ఐసీసీ - కోకాకోలా బంధం మరో ఎనిమిదేళ్లు.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..

ఆసీస్‌ డ్రెస్సింగ్‌లో రూమ్‌లోనూ వారిపై చర్చ

ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఓ ఫొటో హల్‌చల్ చేస్తోంది. ఆసీస్ ఆటగాడు స్టీవ్‌ స్మిత్ డిస్‌ప్లే బోర్డుపై పదిమంది గురించి వివరించి చెబుతున్నాడు. ఆ ఫొటోనే నెట్టింట వైరల్‌గా మారింది. ఆ జాబితాలో భారత్‌ నుంచి ముగ్గురు ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. అత్యుత్తమ స్పిన్‌ ఆల్‌రౌండర్లు ఎవరనేదానిపై అక్కడ చర్చ జరిగింది. అందులో మూడో పేరు రవీంద్ర జడేజా, ఐదో ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్‌, తొమ్మిదో స్థానంలో అక్షర్‌ పటేల్‌ ఉన్నాడు. దీంతో భారత్‌ నుంచి ముగ్గురు ఆటగాళ్ల పేర్లను ఆసీస్‌ ప్లేయర్లు మరవలేకపోతున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 


దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో జడ్డూ ఆడకపోవడానికి..

బాక్సింగ్‌ డే టెస్టులో దక్షిణాఫ్రికాతో టాప్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో అతడికి ఏమైందోననే అనుమానం అభిమానుల్లో నెలకొంది. ఒక్క స్పిన్నర్‌గా అశ్విన్‌కు అవకాశం కల్పించిన టీమ్‌ నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. అయితే, జడేజా ఆడకపోవడానికి గల కారణాలను కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ వెల్లడించింది. ‘‘ వెన్ను నొప్పిగా ఉందని రవీంద్ర జడేజా మా దృష్టికి తీసుకొచ్చాడు. అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం. తొలి టెస్టులో అతడు ఆడటం లేదు’’ అని బీసీసీఐ వెల్లడించింది. రోహిత్ శర్మ కూడా టాస్‌ అనంతరం ఇదే  విషయాన్ని తెలిపాడు. 


2031 వరకు ఐసీసీ పార్ట్‌నర్‌గా కోకా కోలా

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), కోకా కోలా సంస్థ మరో 8 ఏళ్లపాటు తమ భాగస్వామ్యం కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఐసీసీ మహిళల, పురుషుల క్రికెట్‌ ఫార్మాట్లకు సంబంధించి అన్నింట్లోనూ ఐసీసీ పార్టనర్‌షిప్‌ ఉంటుంది. వన్డే, టీ20 వరల్డ్‌ కప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీలు, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ వంటి ఈవెంట్లలో ఐసీసీ భాగస్వామిగా కోకా కోలా వ్యవహరించనుంది. ఒకే ఒక్క బ్రాండ్‌తో ఇన్నేళ్లు ఐసీసీ పార్టనర్‌షిప్‌ కొనసాగించడం కూడా ఘనతే. ఈ మేరకు ఐసీసీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ అనురాగ్‌ దహియా ఓ ప్రకటన వెలువరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని